South Korea: ఆహార వృథాను అరికట్టడంలో మార్గదర్శి దక్షిణ కొరియా.. వ్యర్థానికి సరికొత్త ‘అర్థం’ చెప్పింది!

అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే దక్షిణ కొరియా (South Korea) సుమారు 20 ఏళ్ల క్రితమే ఆహార  (Food) వ్యర్థాలను ఇష్టారీతిన పారేయడంపై నిషేధం విధించింది. ఇళ్లు, హోటళ్ల నుంచి తడి చెత్తను సేకరించి.. దాన్ని పశుగ్రాసం, ఎరువులు, వంటగ్యాస్‌గా మార్చి ప్రపంచానికే ఓ మార్గదర్శిలా నిలిచింది. అదెలాగో చదివేయండి. 

Updated : 17 Jun 2023 11:44 IST

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.4 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలను (Food scraps) బయట పడేస్తున్నారు. అవి కుళ్లిపోవడం కారణంగా నీరు, నేల, గాలి కలుషితమవుతోంది. పైగా వంటగ్యాస్‌లో వినియోగించే మీథేన్‌ వాయువు వృథాగా పోతోంది. దాన్ని అరికట్టడానికి దక్షిణ కొరియా (South Korea) ఎలా కృషి చేస్తోందో తెలుసుకోండి.

ప్రపంచ దేశాల అధ్యయనం

ఆహార వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల కేవలం మీథేన్‌ మాత్రమే గాలిలో కలిసి పోతుందనుకుంటే పొరపడినట్లే. ఆ ఆహారాన్ని తయారు చేయడానికి అయ్యే ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు కూడా గాలిలో కలిసినట్లేనని దక్షిణ కొరియా భావించింది. అందుకే దాదాపు 90 శాతం ఆహార పదార్థాల వ్యర్థాలను పారేయడం, దహనం చేయకుండా చర్యలు తీసుకుంది. ఈ దేశం అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు అధ్యయనం చేసి తమ దేశాల్లో అమలు పరిచాయి. అమెరికా, చైనా, డెన్మార్క్‌ అధికారులు సైతం దక్షిణ కొరియాలో పర్యటించి ఇక్కడ వృథాను అరికట్టే సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.

ఏటా 600 మిలియన్‌ డాలర్ల ఖర్చు

ఆహార వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడం కోసం దక్షిణ కొరియా ఏడాదికి సుమారు 600 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కొంత మొత్తాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు చెల్లిస్తున్నాయి. 1995లోనే ఈ దేశ ప్రభుత్వం ప్లాస్టిక్‌, కాగితం రీసైక్లింగ్‌ విధానాలను ప్రవేశపెట్టింది. అప్పటికి వృథా ఆహార పదార్థాలను రోజువారీ చెత్తతో కలిపి పల్లపు ప్రాంతాల్లో పడేసేవారు. కొరియా వంటకాల తయారీలో నీరు అధికంగా వినియోగిస్తారు. కాబట్టి అవి కుళ్లి తీవ్ర దుర్వాసన వచ్చేవి. దాంతో స్థానికులు ఈ పారబోతకు అడ్డుకట్ట వేయాలని కొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దానికి రాజకీయ నాయకుల మద్దతు తోడు కావడంతో ప్రభుత్వం సమస్యకు చెక్‌ పెట్టే పరిష్కార మార్గాలను అన్వేషించింది.

చెత్త బుట్టకు స్టిక్కర్లు

అలా 2005 నాటికి పల్లపు ప్రదేశాల్లో ఆహార వ్యర్థాలు పడేయడం నేరంగా పరిగణించేలా చట్టాలు చేసింది. స్థానిక ప్రభుత్వాలు వాటిని ప్రాసెస్‌ చేసేలా సౌకర్యాలు కల్పించింది. వ్యక్తులు, హోటళ్ల నిర్వాహకులు, ట్రక్‌ డైవర్లు సహా ప్రతి ఒక్కరూ ఆ సౌకర్యాలను వినియోగించేలా చర్యలు తీసుకుంది. ఏదైనా రెస్టారెంట్‌లోని చెత్త రికవరీ వ్యాన్‌లో పడేయాలంటే దాని యజమాని ముందే నిర్ణీత రుసుం చెల్లించి కొన్ని స్టిక్కర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిని చెత్త బుట్టకు అతికిస్తేనే రోజూ పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తీసుకెళ్తారు. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

కట్టుదిట్టంగా ప్రాసెసింగ్‌

గ్రామాల్లో, పట్టణాల్లో సేకరించిన ఆహార వ్యర్థాలను కార్మికులు ఉదయం 11 గంటలకల్లా ప్రాసెసింగ్‌ యూనిట్‌కు చేరుస్తారు. అక్కడ చెత్తలోని ఎముకలు, విత్తనాలు, పెంకులను చేత్తో ఏరివేస్తారు. ఆ తరువాత వ్యర్థాలను కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా గ్రైండర్‌లోకి పంపిస్తారు. అది పెద్ద పెద్ద పదార్థాలను చిన్న ముక్కలుగా చేస్తుంది. ఆ ముక్కలను యంత్రాల్లో వేడి చేసి నిర్జలీకరణం చేస్తారు. ఫలితంగా వెలువడిన తేమ నీటి శుద్ధి కర్మాగార పైపుల్లోకి వెళుతుంది. అందులో కొంత తేమ ద్వారా బయోగ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. ప్రాసెసింగ్‌లో వచ్చిన వ్యర్థాల పొడిని నాలుగు గంటలపాటు ఎండబెడతారు. అందులో ప్రొటీన్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉన్న భాగాన్ని కోళ్లు, బాతులకు ఆహారంగా పంపిస్తారు. మిగిలిన పొడికి కొన్ని మిశ్రమాలు కలిపి ఎరువుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్‌ చేసే క్రమంలో దుర్వాసన వెలువడుతుంది. దాన్ని అడ్డుకునే వ్యవస్థ కూడా ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ఉంటుంది.

ఇన్ని చర్యలు తీసుకున్నా దక్షిణ కొరియా ఆహార వృథాను అరికట్టడంలో విఫలమైందనే విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం డబ్బాలో చెత్త వేయాలంటే కార్డులను స్కాన్‌ చేసే వ్యవస్థను ప్రవేశపెట్టింది. స్కాన్‌ చేసి ఎంత ఎక్కువ చెత్త వేస్తే వారికి నెలాఖరులో అంత బిల్‌ వేయడం దీని ముఖ్య ఉద్దేశం. అధికంగా బిల్లు చెల్సించాల్సి వస్తుందనే భయంతో చాలా మంది ఆహార వృథాను తగ్గించారు. ఎంత తినగలమో.. అంతే వండుకోవడం క్రమంగా అలవాటు చేసుకున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని