Iaf heritage centre : వాయుసేన శౌర్య పరాక్రమాలకు ప్రతీక ‘ఐఏఎఫ్ వారసత్వ కేంద్రం’
భారత వైమానిక దళం (Indian Air Force) పుట్టుక మొదలుకొని మొన్నటి బాలాకోట్ వైమానిక దాడుల వరకు జరిగిన పరిణామాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది చండీగఢ్‌లోని ‘ఐఏఎఫ్ వారసత్వ కేంద్రం’.(Iaf heritage centre) ఆ కేంద్రం విశేషాలు మీ కోసం..
(Image : V P Singh Badnore)
గత వారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) చేతుల మీదుగా చండీగఢ్‌లో (Chandigarh) భారత వైమానిక దళ వారసత్వ కేంద్రం (Iaf heritage centre) ప్రారంభమైంది. భారత వైమానిక దళంలో సేవలందించిన వారి ధైర్యం, అంకితభావానికి నిదర్శనం ఈ కేంద్రమని ఆయన అన్నారు. అందుకు తగ్గట్లుగా ఈ కేంద్రంలోని విగ్రహాలు, చిత్రాలు తదితర ఏర్పాట్లున్నాయి.
చండీగఢ్ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ మ్యూజియానికి భారత వైమానిక దళం అనేక కళాఖండాలు, సిమ్యులేటర్లు, విమానాలు, విమానాల మోడళ్లను అందజేసింది. ఈ మ్యాజియంలో చూడచక్కని చిత్రాలను వేసే పనిని 2022 సెప్టెంబరులో మొదలుపెట్టారు. ఆ పని పూర్తయ్యేందుకు దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. ఈ భారత వైమానిక దళ వారసత్వ కేంద్రానికి వచ్చే పర్యాటకులకు అవగాహన కల్పించే గైడ్లకు నాలుగు నెలలపాటు శిక్షణనిచ్చారు. అందుకు రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చరిత్ర విభాగం తోడ్పడింది. ఈ కేంద్రానికి గ్రూప్ కెప్టెన్ పీఎస్ లాంబా ప్రాజెక్టు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.
మాటల్లో వర్ణించలేని అనుభూతి
భారత వైమానిక దళ వారసత్వ కేంద్రాన్ని రూ.2.75కోట్లతో నిర్మించారు. ఇది పాలం(దిల్లీ), తిరువనంతపురం మ్యూజియాల కంటే చాలా విశాలమైంది. లోపల రెండు కాక్‌పిట్స్, ఐదు విమానాలు, నాలుగు సిమ్యులేటర్లు ఏర్పాటు చేశారు. బాంబులు, రాకెట్లు సంధించడానికి ఏఏ బటన్లను యుద్ధ విమానాల్లో వినియోగిస్తారనే విషయం కూడా సందర్శకులు తెలుసుకోవచ్చు.
పైలట్లు వేగాన్ని ఎలా నియంత్రిస్తారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా మారుస్తారు వంటి విషయాలను అవగతం చేసుకోవచ్చు. దిశలు మార్చే ప్రక్రియ, ఏ సమయంలో ఎంత ఎత్తులో విమానం ఎగురుతుంది లాంటి సమాచారం దొరుకుతుంది. భారత వాయుసేనలో సేవలందిస్తున్న రకరకాల సిబ్బంది యూనిఫాంలను సైతం ప్రదర్శనకు ఉంచారు.
(Image : Air Marshal P K Roy)
యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు
వారసత్వ కేంద్రంలోకి ప్రవేశించగానే రెండు విమానాలు స్వాగతం పలుకుతాయి. అందులో ఒకటి ఫోలండ్ నాట్. రెండోది మిగ్-21 టైప్ 96. సందర్శకులు మిగ్-21లో కూర్చునే వెసులుబాటు కల్పించారు. ఈ విమానం సుమారు 45 ఏళ్ల పాటు భారత వాయుసేనకు సేవలందించింది. 2019లో దాని సేవలను నిలిపివేశారు. ప్రచండ్ కాంబాట్ హెలికాప్టర్ నమూనా, మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ సహా అనేక పాత తరం యుద్ధ విమాన నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ఇక భవనం లోపల ప్రతి గోడపై యుద్ధ నేపథ్యాలను వివరించే చిత్రాలను వేశారు. సైన్యంలో విశిష్ట సేవలందించిన కార్పోరల్ జ్యోతి ప్రకాశ్ నిరాల(అశోక చక్ర, మరణానంతరం), కార్పోరల్ గురుసేవక్ సింగ్ (శౌర్యచక్ర, మరణానంతరం) వంటి అధికారుల చిత్రాలను ఏర్పాటు చేశారు. గ్యాలరీలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, మిస్సైల్స్, బాంబులు నమూనాలు ఉంచారు. సందర్శకులకు మరింత అనుభూతి పంచేందుకు సిమ్యులేటర్లు, భారత వైమానిక దళానికి చెందిన అన్ని రకాల విమానాల హోలోగ్రాఫిక్ డిస్‌ప్లేలు, సినిమాలు, వర్చువల్ రియాలిటీ ప్రదర్శనలు సైతం ఆకట్టుకుంటాయి.
ఆ హీరోలకు సముచిత గౌరవం
భారత వాయుసేన చరిత్రలో ఎంతో మంది హీరోలున్నారు. వారిలో సుప్రసిద్ధులైన ఎయిర్‌ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ శిల్పాన్ని ఒక ప్రదేశంలో నెలకొల్పారు. ఈయన 1965 యుద్ధంలో దళానికి నాయకత్వం వహించారు. మరో కమడోర్ మెహర్‌సింగ్ (మహావీర చక్ర) విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఈయన 1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధ సమయంలో పూంఛ్, లేహ్ మధ్య మొదటిసారి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించారు. గ్యాలెంట్రీ అవార్డ్స్ వాల్ మొదట్లో ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ పేరును ముద్రించారు. ఈయనకు మరణానంతరం పరమవీర చక్ర అవార్డు ప్రకటించారు. ఆయన వాడిన బ్లేజర్‌ను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇక లోపలున్న గోడలన్నింటిపై ఇప్పటి వరకు భారత్ పాల్గొన్న యుద్ధాల గురించి వర్ణిస్తూ చిత్రాలను మలిచారు. బాలాకోట్ దాడుల చిత్రాలు కూడా ఈ గోడలపై దర్శనమిస్తాయి. మరో గోడను పాటియాలలో జన్మించిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మకు అంకితమిచ్చారు. 1984లో రష్యన్ సోయుజ్ టీ-11 ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆసక్తికరంగా ఇదే ప్రయోగానికి ఎంపికైన ఎయిర్ కమడోర్ రవీశ్ మల్హోత్ర చిత్రాన్ని కూడా గోడపై చిత్రించారు.
యువత స్ఫూర్తి పొందేలా..
ప్రళయ్ మిస్సైల్, స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్, బ్రహ్మోస్ (ఏరియల్ వెర్షన్), హామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్, లేజర్ గైడెడ్ బాంబ్, అస్త్ర మిస్సైల్ నమూనాలు ఒక వరసలో పొందుపరిచారు. ప్రస్తుతం ఈ వారసత్వ కేంద్రం 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మరిన్ని నమూనాలు ఇక్కడ ప్రదర్శించడానికి కావాల్సిన స్థలం అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి సైన్యంలో చేరాలనుకునే యువకులు స్ఫూర్తి పొందేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
మరింత సమాచారం..
- భారత వైమానిక దళ వారసత్వ కేంద్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
- ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది.
- ప్రవేశ టికెట్ ధర రూ.50
- సిమ్యులేటర్లు, ఆడియో-వీడియో పరికరాలు, వర్చువల్ రియాలిటీ తదితర అనుభూతులను సొంతం చేసుకోవాలంటే రూ.295తో ప్రత్యేక టికెట్ కొనుగోలు చేయాలి.
- ఇక్కడ ఉన్న దుకాణంలో విమానం నమూనాలు, కీ చైన్లు విక్రయిస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!