Offbeat: ఆ నగరంలో కార్లను లాక్‌ చేయరు.. ఎందుకంటే?

సాధారణంగా ఎవరైనా కారు పార్క్‌ చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు కార్‌ డోర్స్‌ లాక్‌ అయ్యాయో లేదో సరిచూసుకుంటారు. లేకపోతే కారులో విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకుపోవచ్చు. లేదా కారునే దొంగలించొచ్చు. అయితే, కెనడాలోని ఓ నగరంలో మాత్రం ప్రజలు తమ కార్లను అసలు

Published : 03 Feb 2022 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఎవరైనా కారు పార్క్‌ చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు కార్‌ డోర్స్‌ లాక్‌ అయ్యాయో లేదో సరిచూసుకొంటారు. లేకపోతే కారులో విలువైన వస్తువులను దొంగలు అపహరించవచ్చు. లేదా కారునే దొంగలించొచ్చు. అయితే, కెనడాలోని ఓ నగరంలో మాత్రం ప్రజలు తమ కార్లను అసలు లాక్‌ చేయరు. 24/7 కార్లు అన్‌లాక్‌లోనే ఉంటాయి. ఎందుకంటే ధ్రువపు ఎలుగుబంట్ల నుంచి సాటి పౌరుల్ని కాపాడేందుకు ఇలా చేస్తారట.

కెనడాలోని మనిటోబాలో ఉన్న చర్చిల్‌ ప్రాంతంలో ధ్రువపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి ధ్రువపు ఎలుగుబంట్ల రాజధానిగా పిలుస్తారు. చూడటానికి ధ్రువపు ఎలుగుబంట్లు అందంగా కనిపించినా.. మనుషుల్ని చంపేసే క్రూర జంతువులు. తరచూ చర్చిల్‌ నగరంలోని జనావాసాల మధ్యలోకి వచ్చి ప్రజల్ని హడలెత్తిస్తుంటాయి. దీంతో వారంతా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడైనా ఎలుగుబంటి ఎదురుపడితే తప్పించుకునే మార్గం కూడా ఉండాలి కదా.. అందుకే, అక్కడి ప్రజలు తమ కార్లను అన్‌లాక్‌లోనే ఉంచుతారు. ఎవరిపైనైనా ఎలుగుబంటి దాడి చేసేందుకు వస్తే వారు సమీపంలోని ఏదో ఒక కారులో ఎక్కి తమని తాము రక్షించుకోవచ్చన్నమాట. ఈ విధంగా అక్కడి ప్రజలు పరస్పరం సాయం చేసుకుంటున్నారు.

ఈ ఎలుగుబంట్లు నగరంలోకి రాకుండా ఉండేందుకు అక్కడి కన్జర్వేషన్‌ అధికారులు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఆహారం కోసమే అవి నగరంలోకి వస్తుండటంతో వాటికి అవి దొరక్కుండా ఓపెన్‌ ఎయిర్‌ డంప్‌ను మూసివేశారు. ఎలుగుబంట్లు వీధుల్లోకి రాగానే అధికారులకు సమాచారం అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయినా, ఎలుగుబంట్లు నగరంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని