Kibithoo : అమిత్‌ షా చెప్పిన ఫస్ట్‌ విలేజ్‌ ‘కిబితూ’.. మీరూ వెళ్తారా!

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని (Arunachal pradesh) కిబితూ (Kibithoo) గ్రామం ప్రకృతి అందాలకు నెలవు. ఆ గ్రామాన్ని ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit shah) సందర్శించారు.

Updated : 14 Apr 2023 15:57 IST

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని (Arunachal pradesh) కిబితూ గ్రామంలో (Kibithoo) ప్రతి ఒక్కరూ పర్యటించాలని దేశ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit shah) కోరారు. ఆ ప్రాంత ప్రకృతి అందాలను వీక్షించాలని సూచించారు. దానిని మొదటి గ్రామంగా (India's first village) (ఇండియాస్‌ ఫస్ట్‌ విలేజ్‌) ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో కిబితూ (Kibithoo) ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

కొండలు.. జలపాతాలు

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అంజావ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ‘కిబితూ’ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే దాని పొలిమేర నుంచి రెండు దేశాలు కన్పిస్తాయి. ఉత్తరాన చైనా, తూర్పున మయన్మార్‌ ఉన్నాయి. ఈ గ్రామం ఈశాన్య భారత్‌లో ఈశాన్య దిశలో చివరి రహదారిపై ఉంది. ఇక్కడే ‘లోహిత్‌’ నది భారత్‌లోకి ప్రవేశిస్తుంది. లోహిత్‌ బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఇది టిబెట్‌లోని కాంగ్రీ గార్పో శ్రేణిలో పుడుతుంది. అక్కడ దానిని ‘జాయుల్‌ చు’ అని పిలుస్తారు. కిబితూ గ్రామానికి వెళ్లే మార్గం పొడవునా సుందరమైన పర్వతాలు దర్శనమిస్తాయి. వాటిపై తెల్లని మంచు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అనేక చోట్ల జలపాతాలు జాలువారుతుంటాయి. 

కిబితూ సుందర దృశ్యాలను కెమెరాలో బంధిస్తున్న అమిత్‌ షా

వ్యూహాత్మక సరిహద్దు

కిబితూ గ్రామం ఇండో-చైనా సరిహద్దులో ఉండటం వల్ల ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ప్రాంతమైంది. ఈ గ్రామం మిష్మి పర్వతాల్లో.. సముద్ర మట్టానికి 4వేల అడుగుల ఎత్తులో ఉంది. భారత్‌లో మొట్టమొదట సూర్యకిరణాలు పడే డాంగ్‌ వ్యాలీకి తూర్పున కిబితూ కన్పిస్తుంది. నదికి అవతలి వైపు కహో గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని కూడా మొదటి గ్రామంగా పిలుస్తుంటారు. 1962లో కహోలోకి ప్రవేశించిన చైనా బలగాలను.. భారత సైనికులు దీటుగా ఎదుర్కొన్నారు. భారత సైనికులు కిబితూ పోస్ట్ వద్దకు సైనిక సామగ్రిని తీసుకెళ్లడానికి ఫుట్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జిని ఉపయోగిస్తుంటారు. లోహిత్‌ నది తూర్పు ఒడ్డును, పశ్చిమ ఒడ్డుతో కలిపే ఏకైక దారి ఇది మాత్రమే. ఎక్కువగా కొండచరియలు విరిగి పడుతుండటం వల్ల మిగతా మార్గాలను మూసి ఉంచుతున్నారు. భారత సైనికులు, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆఫ్‌ చైనా మధ్య అప్పుడప్పుడు సాధారణ సంప్రదింపులు జరుగుతుంటాయి. అందుకోసం ఎంపిక చేసిన ఐదు బోర్డర్‌ పాయింట్లలో కిబితూ కూడా ఒకటి.

కిబితూను సందర్శించే ముందు..

ఈ గ్రామానికి 125 కిలోమీటర్ల దూరంలో ఖుపా పట్టణంలో మాత్రమే పెట్రోలు బంక్‌ ఉంది. అందుకే సొంత వాహనాల్లో వెళ్లేవారు ఇంధనం నిండుగా ఉండేలా చూసుకోవాలి. 75 కిలోమీటర్ల దూరంలోని అంజావ్‌ జిల్లా ప్రధాన కేంద్రం హవాయ్‌లో మాత్రమే బస చేయాల్సి ఉంటుంది. కిబితూ గ్రామానికి 20 కిలోమీటర్ల ముందే వాలాంగ్‌ వార్‌ మెమోరియల్‌ కన్పిస్తుంది. యుద్ధ సమయంలో భారత బలగాలు.. 4వేల మంది చైనా సైనికులను ఇక్కడే నిలువరించాయి. వాలాంగ్‌కు ఏడు కిలోమీటర్ల ముందే ‘గరంపానీ’ని చూడొచ్చు. అక్కడ వేడి నీటి బుగ్గల మడుగులుంటాయి. కిబితూలోని హెలిప్యాడ్ దగ్గర నుంచి చూస్తే చైనా ఆర్మీ క్యాంప్‌ ప్రదేశం స్పష్టంగా కన్పిస్తుంది. భారత భూభాగంపై సూర్యకాంతి పడే మొట్టమొదటి గ్రామం డాంగ్‌ను సందర్శించి సరికొత్త అనుభూతిని పొందొచ్చు. ఇతర రాష్ట్రాల ప్రజలు అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్నర్‌ లైన్‌ పర్మిట్ (ఐఎల్‌పీ) తీసుకుంటే సాఫీగా ప్రయాణం సాగించవచ్చు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని