India Vaccination 2021: ఆశలతో మొదలై.. లక్ష్యానికి చేరువై..!

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 90శాతానికి పైగా అర్హులకు తొలిడోసు అందించగా.. 64శాతం మంది అర్హులకు రెండు డోసులు అందుకున్నారు.

Published : 31 Dec 2021 18:08 IST

మరిన్ని లక్ష్యాలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న భారత్‌

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌ మహమ్మారి కొమ్ములు విరిచే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. దీంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలు.. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కొవిడ్‌ను ఎదుర్కొనే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆశలతో మొదలుపెట్టిన భారత్‌.. ఇప్పటికే 145 కోట్ల డోసులను పంపిణీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ చివరినాటికి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్‌ అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటివరకు దాదాపు 90శాతానికి పైగా అర్హులకు తొలిడోసు అందించగా.. 64 శాతం మంది అర్హులకు రెండు డోసుల్లో అందించింది. ఇలా ఏడాది చివరికి నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువైన భారత్‌.. కొత్త ఏడాది ప్రారంభంలో బూస్టర్‌ డోసు పంపిణీతో పాటు చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించే లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.

మైలురాయి దాటుకుంటూ..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. జనవరి 16, 2021న భారత్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. మొదట్లో కాస్త మందకొడిగా సాగినప్పటికీ.. రెండో డోసు పంపిణీ నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ వంటి వ్యాక్సిన్‌ సంస్థలు తమ ఉత్పత్తులను భారీగా పెంచడంతో దేశంలో వ్యాక్సిన్‌ లభ్యత భారీగా పెరిగింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఒక్కటే ప్రతినెలా 12 నుంచి 15 కోట్ల కొవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. భారత్‌ బయోటెక్‌ కూడా 5 నుంచి 6 కోట్ల డోసులను తయారు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా నిత్యం 50 లక్షలకుపైగా డోసులను అందించే వీలు కలిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 17న ఒక్కరోజే 2 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్‌ రికార్డు సృష్టించింది. నవంబర్‌ 3వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో అక్టోబర్‌ 21న 100 కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని దాటింది. ఇలా ఇప్పటివరకు 145 కోట్ల డోసులను పంపిణీ చేసిన ప్రభుత్వం.. మూడో డోసు ఇచ్చేందుకూ సన్నద్ధమవుతోంది.

100 శాతం అసాధ్యమేనా..?

ఈ ఏడాది చివరినాటికి దేశంలో అర్హులైన వారందరికీ వ్యాక్సిన్‌ అందించే ప్రయత్నం చేస్తామని కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు దాదాపు 94 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. వీరందరికీ రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందించాలంటే దాదాపు 190 కోట్ల డోసులు అవసరం. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 31 నాటికి 145 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 84.51 కోట్ల (90శాతం) లబ్ధిదారులు మొదటి డోసు తీసుకోగా.. 60.15 కోట్ల మంది (64శాతం) రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలకు 150 కోట్ల డోసులు పంపిణీ చేయగా.. మరో 15కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద నిల్వ ఉన్నాయన్నారు.

10 కోట్ల మంది రెండోడోసుకు దూరం..

ఇలా కేంద్ర ప్రభుత్వం 100శాతం పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే పనికాదని ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తున్నప్పటికీ అది తీసుకోవడానికి చాలా మంది పౌరులు ముందుకు రాకపోవడమే కారణంగా చెబుతున్నారు. మొదటిడోసు తీసుకున్న తర్వాత గడువు ముగిసినప్పటికీ ఇంకా 10 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ లెక్కలు చూస్తేనే అర్థమవుతోంది. దీంతో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినప్పటికీ కొందరు పౌరుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ దాదాపు మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతున్నారు.

రాహుల్‌ గాంధీ విమర్శ..

ఏడాది చివరినాటికి వ్యాక్సిన్‌ లక్ష్యాన్ని చేరుకోలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ‘2021 చివరి నాటికి దేశంలో ప్రతిఒక్కరికీ రెండుడోసుల్లో వ్యాక్సిన్‌ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఈ రోజు ఏడాది ముగింపు. అయినప్పటికీ దేశంలో చాలా మంది వ్యాక్సిన్‌ అందలేదు. మరో వాగ్దానం విఫలమయ్యింది’ అంటూ ట్విటర్‌లో విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని