Indian Operations: సంక్షోభం ఏదైనా సై.. విదేశీ గడ్డపై భారత్‌ ‘ఆపరేషన్‌’లు..!

వివిధ దేశాల్లో సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్లను చేపడుతోంది. అఫ్గాన్‌, ఉక్రెయిన్‌ మొదలు సూడాన్‌ వరకు ఇలా ఎన్నో సంక్షోభ సమయాల్లో భారత పౌరులను సొంత గడ్డకు తీసుకువచ్చే పనిని భారత ప్రభుత్వం విజయవంతంగా చేపట్టింది. 

Published : 24 Apr 2023 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లోని భారతీయులకు ఆపద వచ్చిందంటే చాలు.. భారత సైన్యం రంగంలోకి దిగాల్సిందే. ఆయా దేశాల్లో కల్లోల పరిస్థితులు మొదలు కరోనా మహమ్మారి వంటి ప్రకృతి వైపరీత్యాల వరకు విదేశీ గడ్డపై సంక్షోభం ఏర్పడిందంటే చాలు హుటాహుటిన వారిని స్వదేశానికి తీసుకుచ్చే బాధ్యతను దేశ సైన్యం తన భుజాలమీద ఎత్తుకుంటోంది. తాజాగా సూడాన్‌లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్‌ కావేరీ’ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న మన పౌరులను సురక్షితంగా తరలించేందుకుగాను భారత ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్‌లను పరిశీలిస్తే..

ఆపరేషన్‌ గంగ: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన దండయాత్ర ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు గతేడాది ఫిబ్రవరి 22న ‘ఆపరేషన్‌ గంగ’ పేరుతో మొదలుపెట్టిన ప్రత్యేక ఆపరేషన్‌.. మార్చి 10వరకు కొనసాగింది. దాదాపు 80కిపైగా విమానాలతో సుమారు 18వేల మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా చేర్చింది. రొమేనియా, పొలాండ్‌, హంగేరీ, స్లొవేకియా, మాల్డోవా వంటి దేశాల నుంచి ఈ ఆపరేషన్‌ చేపట్టి భారతీయ పౌరులను స్వదేశానికి విజయవంతంగా తీసుకువచ్చింది.

ఆపరేషన్‌ దేవీశక్తి: అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న కొన్ని రోజుల్లోనే తాలిబన్ల చేతుల్లోకి అఫ్గానిస్థాన్‌ వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 2021లో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వేల మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అటువంటి సమయంలో ‘ఆపరేషన్‌ దేవీశక్తి’ కార్యక్రమాన్ని చేపట్టిన భారత ప్రభుత్వం.. అక్కడున్న 669 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది.

ఆపరేషన్‌ సంకట్‌ మోచన్‌: దక్షిణ సూడాన్‌లో 2016లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు అత్యవసర సేవలూ నిలిచిపోయాయి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ‘ఆపరేషన్‌ సంకట్‌ మోచన్‌’ను చేపట్టింది. రంగంలోకి దిగిన భారత వాయుసేన 153 మంది భారతీయులతోపాటు ఇద్దరు నేపాల్‌ పౌరులను సురక్షితంగా తరలించింది.

ఆపరేషన్‌ బ్రసెల్స్‌ 2016: బెల్జియంలో మార్చి నెలలో ఉగ్రవాద దాడులు జరిగాయి. బ్రసెల్స్‌ విమానాశ్రయంతోపాటు మాల్బీక్‌ మెట్రో స్టేషన్‌పైనా దాడుల్లో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. 28 మంది సిబ్బందితోసహా మొత్తం 242 మంది భారతీయులతో కూడిన జెట్‌ఎయిర్‌వేస్‌ విమానం భారత్‌కు చేరుకుంది.

లిబియా ఆపరేషన్‌ 2015: లిబియాలో 2015లో అంతర్యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడున్న 3600 మంది భారత పౌరులను తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ముఖ్యంగా లిబియా సరిహద్దు దేశాల సహకారంతో రోడ్డు మార్గంతోపాటు జల, వైమానిక మార్గాల్లో భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చారు.

ఆపరేషన్‌ రాహత్‌, యెమన్‌: మార్చి- ఏప్రిల్‌ 2015లో యెమన్‌ అంతర్యుద్ధం సమయంలో అక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆపరేషన్‌ రాహత్‌ను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. సుమారు 6700 మందిని సురక్షితంగా అక్కడ నుంచి తరలించింది. వీరిలో 4748 మంది భారతీయులు కాగా మరో 1962 మంది విదేశీయులు ఉన్నారు.

ఆపరేషన్‌ సేఫ్‌ హోమ్‌కమింగ్‌: 2011లో లిబియన్‌ అంతర్యుద్ధంతో.. వేల మంది భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ సేఫ్‌ హోమ్‌కమింగ్‌ చేపట్టింది. ఫిబ్రవరి 26 2011న చేపట్టిన ఈ ఆపరేషన్‌ ద్వారా సుమారు 15,400 మందిని స్వదేశానికి తీసుకువచ్చింది. భారత వాయుసేనతోపాటు ఎయిర్‌ ఇండియా విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

ఆపరేషన్‌ సుకూన్‌: 2006లో లెబనాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో అక్కడున్న 2300 మంది భారతీయులతోపాటు శ్రీలంక, నేపాల్‌ వాసులను సురక్షితంగా తరలించేందుకు ఎయిర్‌ ఇండియా సాయంతో భారత నౌకాదళం ఈ ఆపరేషన్‌ చేపట్టింది. తొలుత వారిని సిరియా తరలించి అక్కడ నుంచి సైప్రస్‌కు, అనంతరం భారత్‌కు తరలించారు. అత్యంత శ్రమతో ఈ ఆపరేషన్‌ చేపట్టారు.

కువైట్‌ ఆపరేషన్‌: 1990లో దాదాపు లక్షమంది ఇరాకీ సైనికులు కువైట్‌పై దాడి చేశారు. దీంతో రాజులు మొదలు వీఐపీలు కూడా సౌదీ అరేబియాకు తరలిపోయారు. సామాన్య పౌరులు అక్కడే చిక్కుకుపోయారు. ఇలా కువైట్‌లో చిక్కుకుపోయిన వారిలో 1.70 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారందర్నీ సుమారు 500 ఎయిరిండియా విమానాల్లో తరలించే కార్యక్రమం చేపట్టారు. రెండు నెలలపాటు సాగిన ఈ ఆపరేషన్‌.. ఎయిరిండియా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన మిషన్‌గా నిలిచింది. అంతేకాకుండా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కూడా సృష్టించింది.

వందే భారత్‌ మిషన్‌: కరోనా వైరస్‌ విలయతాండవం చేసిన వేళ.. ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఏప్రిల్‌ 30, 2021 నాటికి 60 లక్షల మంది భారతీయులు వివిధ దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. వివిధ దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 18లక్షల మంది ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల్లో రాగా.. మరో 36 లక్షల మంది ఛార్టెడ్‌ విమానాల్లో తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. సుమారు 4వేల మంది నౌకాయానం ద్వారా భారత్ చేరుకున్నారు.

ఆపరేషన్‌ సముద్ర సేతు: కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ విదేశాల్లో ఉన్న భారతీయులను రప్పించేందుకు ఆపరేషన్‌ సముద్ర సేతును చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి 3992 మంది భారత పౌరులను జలమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని