National Highway : కశ్మీర్‌-కన్యాకుమారి.. పొడవైన జాతీయ రహదారి ‘ఎన్‌హెచ్‌-44’!

‘ఎన్‌హెచ్‌-44’ (National Highway 44).. 4112 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారిగా గుర్తింపు దక్కించుకుంది. కశ్మీర్‌ (Kashmir) నుంచి కన్యాకుమారి (Kanyakumari) వరకు సాగే ఈ మార్గం విశేషాలు తెలుసుకోండి.

Updated : 18 Apr 2023 11:46 IST

ఎన్‌హెచ్‌-44 (National Highway 44).. దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి (Indias longest highway) ఇది. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో (Jammu kashmir) మొదలై.. పంజాబ్‌ (Punjab), హరియాణా (Haryana), దేశ రాజధాని దిల్లీ (Delhi), ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh), రాజస్థాన్‌ (Rajasthan), మధ్యప్రదేశ్‌ (Madhya pradesh), మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh), కర్ణాటక (Karnataka) మీదుగా ప్రయాణిస్తూ తమిళనాడు (Tamil nadu) రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ముగుస్తుంది.

ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 492 కి.మీ, ఏపీలో 260 కి.మీ మేర ఎన్‌హెచ్‌-44 ఉంది. తొలుత ఇది ఒకే జాతీయ రహదారి కాదు. ఏడు జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌-1ఎ, ఎన్‌హెచ్‌-1, ఎన్‌హెచ్‌-2, ఎన్‌హెచ్‌-3, ఎన్‌హెచ్‌-75, ఎన్‌హెచ్‌-26, ఎన్‌హెచ్‌-7) విలీనం చేసి ‘ఎన్‌హెచ్‌-44’ను ఏర్పాటు చేశారు. భారత మ్యాప్‌పై ఒక నిలువు గీత గీసిన తరహాలో ఈ జాతీయ రహదారి కన్పిస్తుంది. ఈ దారిలో ప్రయాణించే సమయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వైవిధ్యం ప్రతిబింబిస్తుంటుంది. ఈ మార్గం వ్యాపారాభివృద్ధికి, ప్రయాణాలను మెరుగుపరచేందుకు ఎంతో తోడ్పాటునందిస్తోంది.

(Image : Google map)

దేశంలోనే అతి పొడవైన ఎన్‌హెచ్‌-44 గుండా ప్రయాణిస్తే ఈ ప్రదేశాలను వీక్షించొచ్చు.. అవేంటో తెలుసుకోండి.

భూతల స్వర్గం

ఉత్తర భారతం నుంచి ప్రయాణం మొదలు పెడితే మీ ప్రయాణం భూతల స్వర్గంగా పేరొందిన జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌  నుంచి ప్రారంభమవుతుంది. దారి పొడవునా మంచు దుప్పటి కప్పేసిన పర్వతాలు, ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లు, సుందరమైన నదులు కన్పిస్తాయి. ఉత్కంఠభరితంగా సాగే ఈ ప్రయాణంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు దర్శనమిస్తాయి. కశ్మీర్‌ అందాలు మొత్తం కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. కేవలం ఆ అందాలతోనే కడుపు నిండిపోదు కదా! అందుకే నోరూరించే కశ్మీరీ వంటకాలను రుచి చూడొచ్చు. ఇక్కడ యఖ్నీ పులావ్‌, రోగన్‌ జోష్‌ వంటకాలు చాలా ఫేమస్‌. వాటిని తప్పకుండా రుచి చూడాల్సిందే. 

పచ్చని రాష్ట్రం పంజాబ్‌

హరిత విప్లవ ఆరంభ స్థానం పంజాబ్‌ ఎల్లప్పుడూ పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ మార్గంలోనే జలంధర్‌, లూధియానా వంటి చారిత్రక ప్రాముఖ్యం కలిగిన నగరాలు కన్పిస్తాయి. వాటిని చూసిన తరువాత ఏదైనా పంజాబీ డాబాలో ఆగితే స్వచ్ఛమైన నెయ్యి తగిలించిన పరోటాలను బటర్‌ చికెన్‌తో కలిపి లాగించేయొచ్చు.

కురుక్షేత్ర సంగ్రామంలో..

మనమంతా మహాభారతం గురించి వినే ఉంటాం. అందులో కురుక్షేత్ర సంగ్రామానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హరియాణాలోకి ప్రవేశించగానే కురుక్షేత్ర పట్టణం కన్పిస్తుంది. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. చారిత్రక కళాఖండాలపై ఆసక్తి ఉంటే ఇక్కడి శ్రీ కృష్ణ మ్యూజియాన్ని సందర్శించొచ్చు. హిందువులు పరమ పవిత్రంగా భావించే బ్రహ్మ సరోవరం కూడా ఇక్కడే దర్శనమిస్తుంటుంది.

దేశ రాజధాని నగరం దిల్లీ

పార్లమెంటు, రాష్ట్రపతి భవనం, ఇండియాగేట్‌, కర్తవ్యపథ్‌ వంటి ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలతో విరాజిల్లుతోంది దిల్లీ నగరం. జంతర్‌మంతర్‌, కుతుబ్‌మినార్‌, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాలను చూడొచ్చు. 

శ్రీకృష్ణ ఆలయం.. తాజ్‌ మహల్

దిల్లీ దాటగానే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఉన్న మథురను చూడొచ్చు. ఇక్కడి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అనంతరం ఆగ్రాలోకి ప్రవేశిస్తే ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ ఉంది. ఆ పాలరాతి కట్టడం అందాలను చూస్తే ఎవరైనా తప్పకుండా మంత్ర ముగ్ధులు కావాల్సిందే.

గ్వాలియర్‌ కోట

ఉత్తరప్రదేశ్‌ దాటగానే రాజస్థాన్‌లోకి అడుగు పెట్టొచ్చు. అయితే ఇక్కడ 28 కిలోమీటర్ల మార్గం మాత్రమే ఉంది. దగ్గరలో చూడటానికి అనువైన ప్రదేశాలు లేవు. దాంతో నేరుగా మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. గ్వాలియర్‌ పట్టణంలోని పురాతన కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. వందల ఏళ్ల క్రితమే నిర్మించినప్పటికీ  దాని సౌందర్యం ఇప్పటికీ చెక్కు చెదర్లేదు. 

దక్షిణ దిశకు ప్రవేశ ద్వారం నాగ్‌పూర్‌

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోకి అడుగుపెట్టగానే ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతంలోకి ప్రవేశిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. ఇక్కడ దొరికే నారింజ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. కొన్ని రకాల స్థానిక వంటకాలు మైమరచిపోయేలా చేస్తాయి. తర్రి పోహాను తప్పకుండా రుచి చూడాల్సిందే.

తెలంగాణ పల్లెలు.. హైదరాబాద్

నిర్మల్‌ జిల్లాలోకి అడుగుపెట్టగానే గిరిజన పల్లెల అందాలు పలకరిస్తాయి. నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల మీదుగా చారిత్రక నగరం హైదరాబాద్‌లోకి ప్రవేశించవచ్చు. చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌, బిర్లామందిర్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలను చుట్టేసి ఆంధ్రప్రదేశ్‌ వైపు ప్రయాణం షురూ చేయొచ్చు.

రాయలసీమ అందాలు

ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టగానే రాయలసీమ ముఖద్వారం కర్నూలు నగరం స్వాగతం పలుకుతుంది. ఈ నగరంలోని కొండారెడ్డి బురుజును సందర్శించొచ్చు. నాన్‌వెజ్‌ ప్రియులు స్థానిక హోటళ్లలో రాగిసంగటి, నాటుకోడి పులుసును ఇష్టంగా లాగించవచ్చు. అటునుంచి అనంతపురం వెళ్లి అక్కడ టవర్‌క్లాక్‌ చూసి పెనుకొండ మీదుగా కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు చేరుకోవచ్చు.

సిలికాన్‌ సిటీ బెంగళూరు

సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరంలో బెంగళూరు ప్యాలెస్‌, టిప్పు సుల్తాన్‌ సమ్మర్‌ ప్యాలెస్‌ ఇలా ఎన్నో సుందరమైన కట్టడాలను, పార్కులను చూడొచ్చు. 

కన్యాకుమారి.. ముగింపు దారి

ఎన్‌హెచ్‌-44 ప్రయాణంలో చివరి రాష్ట్రం తమిళనాడు. ఈ మార్గంలోనే మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. అటు నుంచి బయలుదేరి గమ్య స్థానం కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక్కడ సూర్యాస్తమయం ఎందో అందంగా కనపడుతుంది. అక్కడితో ‘ఎన్‌హెచ్‌-44’కు బైబై చెప్పేయొచ్చు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని