BBC: బీబీసీపై భారత్‌ నిషేధం విధించిన వేళ.. అప్పుడు కూడా ఇలానే జరిగింది!

బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీపై (BBC Documentary) దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోన్న నేపథ్యంలో.. గతంలో ఇందిరా గాంధీ (Indira Gandhi) హయాంలో బీబీసీని భారత్‌ నిషేధించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

Published : 17 Feb 2023 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బీబీసీ (BBC) వ్యవహారం భారత్‌లో ఇటీవల మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గుజరాత్‌ అల్లర్లు, ఆ సమయంలో మోదీ తీరును వివరిస్తూ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరుతో బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC Documentary) తీవ్ర వివాదానికి కారణమయ్యింది. ఈ వివాదం కొనసాగుతోన్న సమయంలోనే స్థానికంగా బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ సర్వే (IT Survey) నిర్వహించడం మరింత కలకలం రేపింది. డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిరోధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతోన్న కాంగ్రెస్‌.. ఇది మీడియాపై అణచివేతేనని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో బీబీసీని భారత్‌ నిషేధించిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. 1970ల్లో ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రధానమంత్రిగా ఉన్న సయమంలో బీబీసీపై నిషేధం విధించడంతోపాటు ఎమర్జెన్సీ ఆ తర్వాత సందర్భాల్లో బీబీసీ డాక్యుమెంటరీలను ప్రసారం కాకుండా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..

కలకత్తా వివాదం..

‘కలకత్తా’ (Calcutta) పేరుతో ఫ్రెంచ్‌ డైరెక్టర్‌ లూయీస్‌ మల్లే నిర్మించిన ఓ డాక్యుమెంటరీని జూన్‌ 10, 1970న బీబీసీ ప్రసారం చేసింది. ‘ది బెవిల్డెర్డ్‌ జెయింట్‌’ (The Bewildered Giant) పేరుతో జూన్‌ 23న మరో డాక్యుమెంటరీని టెలికాస్ట్‌ చేసింది. 1968- 69ల మధ్య కాలంలో కలకత్తా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఆ చిత్రంలో.. అక్కడి సంపద, పేదరికం, మురికివాడలు, ప్యాలెస్‌ల వంటి విషయాలను ప్రస్తావించింది. అయితే, భారతదేశ సంస్కృతి, జీవన విధానాన్ని ఆ లఘు చిత్రాల్లో వక్రీకరించారని ఆరోపణలతో వివాదం మొదలయ్యింది. దేశ వ్యాప్తంగా దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో స్పందించిన భారత ప్రభుత్వం.. ఈ విషయాన్ని బీబీసీ సంస్థతోపాటు బ్రిటిష్‌ హై కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీని తర్వాత కూడా మొత్తం ఏడు విభాగాలను ప్రసారం చేయడంతో బీబీసీ కార్యకలాపాలను దేశంలో నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.

పార్లమెంటులో చర్చ..

భారత్‌లో బీబీసీ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ నోటీసులు ఇచ్చిన రెండు వారాల తర్వాత.. ఇదే అంశంపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఆగస్టు 14, 1970న బీబీసీ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆ సంస్థకు నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అనంతరం జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీలు అందుకు మద్దతు పలికారు. వారిలో కొందరు విపక్షాల వారు కూడా మద్దతు పలకగా.. మరికొందరు మాత్రం ఇందిరా గాంధీ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. అయినా బీబీసీ నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోవడంతో ఆగస్టు 29, 1970 నుంచి బీబీసీ కార్యకలాపాలు నిలిపివేసే ఆదేశాలు ఇచ్చినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు ఆ నిషేధం కొనసాగింది.

ఎమర్జెన్సీ సమయంలోనూ..

దీంతోపాటు 1975లో ఎమర్జెన్సీ సమయంలోనూ అప్పటి ప్రభుత్వ ఆగ్రహానికి బీబీసీ గురయ్యింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారని మండిపడింది. దీంతో తమ ప్రతినిధిని రిపోర్టు చేయకుండా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దిల్లీ గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషిగా తేలిన ముకేశ్‌ సింగ్‌పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కూడా 2015లో నిషేధానికి గురయ్యింది. తాజాగా ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరుతో బీబీసీ రూపొందించిన లఘు చిత్రం ప్రసారం కాకుండా ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని