Israel: ఇజ్రాయెల్‌.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్‌!

కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి..  

Updated : 24 Oct 2023 09:27 IST

ఇజ్రాయెల్‌(Israel) ఓ చిన్న దేశం.. కానీ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశం. ముఖ్యంగా టెక్నాలజీ వంటి విషయాల్లో అమెరికా,దక్షిణ కొరియా, జపాన్‌ వంటి దేశాలతో పోటీ పడుతోంది. ఈ రోజున నిత్యజీవితంలో మనం వాడే ఎన్నో టెక్నాలజీలు ఇక్కడే జీవం పోసుకొన్నాయి. ఆధునికత హడావుడిలో పడి సంప్రదాయాలను వదిలిపెట్టలేదు. అత్యంత పురాతన సంస్కృతిని ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకొంటూనే.. టెక్‌ యుగంలో దూసుకుపోతోంది. అత్యంత తీవ్రమైన పొడివాతావరణం ఉండే ఈ దేశంలోని వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఈ దేశం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

  • ఇజ్రాయెల్‌ (Israel) విస్తీర్ణం అమెరికాలోని న్యూజెర్సీ అంత ఉంటుంది. రోడ్డు మార్గాన ఈ దేశం ఉత్తరం నుంచి దక్షిణ భాగానికి చేరడానికి కేవలం ఆరుగంటలు చాలు. అడ్డంగా.. ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లేందుకు కేవలం 90 నిమిషాల సమయం పడుతుంది. కానీ, ఈ దేశంలో ఒక వైపు పూర్తిగా ఎడారి, ఇసుక బీచ్‌లు ఉంటే.. మరో వైపు మంచుపడే పర్వతం (మౌంట్‌ హెర్మొన్‌) ఉండటం విశేషం. ఈ దేశ జనాభా 97లక్షలు. వీరిలో యూదులు, అరబ్బులు, క్రిస్టియన్లు సహా ఇతర మతస్థులు ఉన్నారు.   
  • ఇజ్రాయెల్‌-జోర్డాన్‌ మధ్యలో ఉన్న మృత సముద్రం ( డెడ్‌సీ) భూమిపైనే అత్యంత పల్లపు ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 1300 అడుగుల దిగువున ఉంటుంది. ఈ దేశంలో మొత్తం  100కిపైగా బీచ్‌లు ఉన్నాయి. ఇవి మధ్యధరా సముద్రం, డెడ్‌సీ, రెడ్‌ సీ తీరాల్లో ఉన్నాయి. సందర్శకులకు డెడ్‌సీ ఓ పర్యటక ప్రాంతం. ఎర్ర సముద్రంలోని దిబ్బలు డైవర్లను బాగా ఆకర్షిస్తాయి. ఇక్కడ బీచ్‌ల్లో కృత్రిమ మేధతో పనిచేసే లైఫ్‌గార్డ్‌లు ఉంటాయి. 
  • వజ్రాల వ్యాపారానికి ఇజ్రాయెల్‌ (Israel) పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న డైమండ్‌ ఎక్స్ఛేంజి ప్రపంచంలోనే అతిపెద్దది. దీనిలో పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. సంపన్నులు, వ్యాపారులు వజ్రాల కొనుగోళ్లకు ఇక్కడికి డైమండ్‌ టూర్లు నిర్వహిస్తారు. 
  • సాధారణంగా మనం విమానాశ్రయాల్లో డ్యూటీఫ్రీ ఏరియాలను చూస్తుంటాము. కానీ, ఇజ్రాయెల్‌ (Israel)లో ఏకంగా ఒక నగరం మొత్తం డ్యూటీ ఫ్రీయే. ఎర్ర సముద్రం తీరంలోని ఎలాట్‌ నగరంలో  ఏమి కొనుగోలు చేసినా.. వ్యాట్‌ పడదు. ఎలక్ట్రానిక్స్‌, కాస్మోటిక్స్‌, నగలు ఇలా యాత్రికులు భారీగా కొనుగోళ్లు చేస్తుంటారు. 

  • మరణం అంచున ఉన్న తమ భాషకు ఇజ్రాయెల్‌ (Israel) ప్రాణం పోసింది. ఈ దేశంలో రెండు అధికారిక భాషలున్నాయి. ఒకటి హిబ్రూ కాగా.. రెండోది అరబిక్‌ . దాదాపు 2,000 ఏళ్ల పూర్వం నాటి హిబ్రూ భాష దాదాపు అంపశయ్యపైకి చేరింది. కానీ, దీనిని జాతీయ భాషగా చేసి పునరుజ్జీవం కల్పించింది. ప్రపంచంలో మరణం అంచుల వరకు వెళ్లి బతికిన భాషగా దీనికి గుర్తింపు లభించింది. 
  • ఇజ్రాయెల్‌ (Israel) చరిత్రను భద్రపర్చడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ తలసరి మ్యూజియాల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఇంత చిన్న దేశంలో 230కి పైగా పురావస్తుశాలలు ఉన్నాయి. వీటిల్లో చరిత్ర, పురాతన వస్తువులు, సైన్స్‌కు సంబంధించిన జ్ఞాపకాలు దర్శనమిస్తాయి. ఒక్క జెరూసలెంలోనే 2,000కుపైగా పురాతత్వ విలువ ఉన్న స్థలాలు ఉన్నాయి. గోలన్‌ హైట్స్‌లో ఉన్న 2,000 ఏళ్ల నాటి హమాత్‌ జిడెర్‌ అనే వేడినీటి బుగ్గల వద్ద ఉన్న పురాతన స్నానాల కాంప్లెక్స్‌ను ఇప్పటికీ వాడుతున్నారు. 
  • ఇజ్రాయెల్‌ (Israel) పోస్టల్‌ శాఖలో భగవంతుడికి ఉత్తరాలు పంపే డిపార్ట్‌మెంట్‌ ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా భగవంతుడి పేరిట జెరూసలెంకు చేరుకొనే లేఖలను సేకరిస్తుంది. దీనిని పవిత్రమైన ‘వెస్ట్రర్న్‌ వాల్‌’ పగుళ్లలో ఉంచుతుంది. ఏటా 10 లక్షలకుపైగా నోట్‌లను ఇక్కడ ఉంచుతుంది. లక్షల్లో వచ్చిపడే లేఖలను ఏటా రెండుసార్లు తొలగించి ఆ గోడను శుభ్రపరుస్తారు. ఈ దేశంలో 90 శాతం వ్యర్థ జలాలను రీసైక్లింగ్‌ చేస్తారు. అమెరికా వంటి దేశాల్లోనే 1శాతం వ్యర్థ జలాలను రీసైక్లింగ్‌ చేయగలుతున్నాయంటే.. ఈ రంగంలో ఇజ్రాయెల్‌ (Israel) శక్తిని అర్థం చేసుకోవచ్చు. 
  • ఇజ్రాయెల్‌ (Israel)లో చాల వేడి వాతావరణం ఉంటుంది. 1942లో ఇక్కడ టిరాట్‌ జ్వీ అనే కిబుట్జ్‌లో 54 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. డెత్‌ వ్యాలీలో 1913లో నమోదైన 56.7 సెంటీగ్రేడ్‌ కంటే 2 పాయింట్లే తక్కువ. ఇక్కడ ఎడారీకరణను అడ్డుకోవడానికి దేశం ఏర్పడిన నాటి నుంచి వృక్షాలను నాటడంపై విపరీతమైన శ్రద్ధ చూపారు. 25 కోట్ల మొక్కలను నాటారు. ప్రస్తుతం దేశంలో 8శాతం భూభాగంలో అటవీ ప్రాంతం విస్తరించింది. 
  • శాకాహార పర్యాటకులకు ఇజ్రాయెల్‌ (Israel) ఓ స్వర్గం వంటిది. ఇక్కడి ప్రజలు అత్యధిక మంది శాకాహారమే తింటారు. ముఖ్యంగా టెల్‌ అవీవ్‌లో రెస్టారెంట్‌లు, కేఫ్‌ల్లో వెజిటేరియన్‌ డిషెస్‌ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. ఇక్కడ రెస్టారంట్ల నిబంధనలు ఉంటాయి. అందుకే డిష్‌ల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకొంటారు.  
  • అందంగా ఉండాలనే పిచ్చిలో పడి కడుపుమాడ్చుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం ఇజ్రాయెల్‌(Israel)లో కుదరదు. ఇందుకోసం ఓ చట్టమే ఉంది. అక్కడ మోడల్స్‌ ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌ చేయాలన్నా.. తమ ఎత్తుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్‌ వద్ద నుంచి ధ్రువీకరణలు తీసుకోవాలి. అనోరెక్సియా, బులీమియా అనే ఆహార రుగ్మతలతో పోరాడేందుకు 2012లో ఈ నిర్ణయం తీసుకొంది.
  • ఇజ్రాయెల్‌లో కుక్కలకు ప్రత్యేకమైన శ్మశానం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద కుక్కల శ్మశానం దక్షిణ ఇజ్రాయెల్‌(Israel)లోని అష్కెలోన్‌లో ఉంది.  

ఇక టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్‌ (Israel) ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఇంత చిన్న దేశంలో ఏకంగా 3,000 హైటెక్‌ స్టార్టప్‌లు ఉన్నాయి. సిలికాన్‌ వ్యాలీ కాకుండా ఈ స్థాయిలో స్టార్టప్‌లు మరెక్కడా లేవు. విండోస్‌ ఎన్‌టీ వర్క్‌స్టేషన్‌, ఎక్స్‌పీలను మైక్రోసాఫ్ట్‌-ఇజ్రాయెల్‌లో విభాగంలోనే అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్‌లో ఇజ్రాయెల్‌ ఆర్‌అండ్‌డీ విభాగం అత్యంత శక్తిమంతమైనది. ఇక పెంటియం ఎంఎంఎక్స్‌ చిప్‌ డిజైన్‌ ఇజ్రాయెల్‌లోనే జరిగింది. వాయిస్‌ మెయిల్‌ టెక్నాలజీని ఇక్కడే అభివృద్ధి చేశారు. మోటొరోలా ఇజ్రాయెల్‌ విభాగం ఇంజినీర్లు సెల్‌ఫోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. పిల్‌కామ్‌, ఎక్సోస్కెలిటన్‌, డెస్క్‌ కీ (యూఎస్‌బీ), అమెజాన్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ కిండిల్‌, ఇండిగో ప్రింటర్‌ ఇలా చెబుతూ పోతే పెద్ద జాబితానే అవుతుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌, త్రీడీ ప్రింటింగ్‌ వంటి వాటిల్లో విప్లవాత్మక టెక్నాలజీ పురుడు పోసుకొంది ఇక్కడే. 

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని