సకల వస్తువుల కాణాచి.. నుమాయిష్‌

హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. నాంపల్లిలో ఏటా జనవరి 1 నుంచి 45 రోజులపాటు సాగే ఈ ఎగ్జిబిషన్‌కు 8 దశాబ్దాల చరిత్ర ఉంది.

Published : 02 Jan 2023 01:24 IST

నుమాయిష్‌ 8 దశాబ్దాల వైభవం..!
ఏటా 25 లక్షల సందర్శకుల రాక

నూతన సంవత్సరంలో అడుగుపెట్టగానే హైదరాబాద్‌లో ఓ పండగ మొదలవుతుంది. ఇంకా సంక్రాంతికి చాలా సమయం ఉంది కదా అనుకుంటున్నారా..? అది కాదండీ..!

నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద మేళా. ఏటా జనవరి 1 నుంచి 45 రోజులపాటు కొనసాగుతుంది. నాలుగు తరాలకు పరిచయమున్న ఈ ఎగ్జిబిషన్‌కు ఘన చరిత్రే ఉంది. మరి దాని గురించి ఓ లుక్కేయండి..! 

నుమాయిష్‌ మస్నూవత్‌ ఇ ముల్కీ.. అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల. ఇదే పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న కొందరు విద్యావంతులు బృందంగా ఏర్పడి 1938లో తొలిసారిగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలని, ప్రజల ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. నాడు రూ. 2.5లక్షల ఖర్చుతో 100 స్టాళ్లతో ఏర్పాటైన నుమాయిష్‌లో ఇప్పుడు వేల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. రూ. వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. 

తొలి ఎగ్జిబిషన్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో..

ఇప్పుడు నాంపల్లిలో జరుగుతోన్న ఎగ్జిబిషన్‌ను మొదట పబ్లిక్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు వ్యాపారుల స్టాళ్లు, సందర్శనకు వచ్చే ప్రజల సంఖ్య పెరిగింది. స్థలాభావంతో నాంపల్లిలోని 23 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు. దీన్నే నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ అని పిలుస్తుంటారు. నుమాయిష్‌ పేరును కొన్నేళ్ల కిందట ‘ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌’గా మార్చారు. కానీ, అందరూ దీన్ని నుమాయిష్‌గానే పిలుస్తుండటంతో 2009లో తిరిగి పాత పేరునే పెట్టారు.

జమ్ముకశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ కంపెనీలు, స్థానిక సంస్థల ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్‌, చేనేత వస్త్రాలు, ఎలక్ట్రికల్‌ పరికరాలు ఇలా అన్నీ ఇక్కడ కొలువుదీరిన స్టాళ్లలో లభిస్తాయి. రూ. 10 నుంచి రూ. లక్షలు విలువ చేసే వస్తువులు దొరుకుతాయి. దేశీయ ఉత్పత్తులే కాదు.. ఇరాన్‌ కార్పెట్లు, టర్కీ దుప్పట్లు, బంగ్లాదేశ్‌ వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్‌ అమ్మకానికి ఉంటాయి. మహిళలు మాత్రమే నిర్వహించే స్టాళ్లూ కనిపిస్తాయి.  

షాపింగ్‌ మాత్రమేనా మరెన్నో..

కేవలం స్టాల్స్‌ మాత్రమే కాదు.. ఎగ్జిబిషన్‌కు వచ్చిన ప్రజలకు వినోదం అందించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్‌ షోలు నిర్వహిస్తుంటారు. జెయింట్‌వీల్స్‌, ఎగ్జిబిషన్‌ మొత్తం చుట్టి వచ్చేలా టాయ్‌ ట్రెయిన్‌, గేమ్స్‌, ఆహార ప్రియుల కోసం హోటళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్‌ను ఏటా 25 లక్షల మంది సందర్శిస్తుంటారు.

కరోనా నేపథ్యంలో 2021లో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయలేదు. గతేడాది పరిమిత సంఖ్యలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సారి 2వేలకుపైగా స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎప్పుడు వెళ్లొచ్చు? 

జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్‌ ప్రతిరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీజు పెద్దవారికి రూ.40 ఉంటుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం. ఎగ్జిబిషన్‌ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ  ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని