Iron pillar : 1600 ఏళ్లయినా.. చెక్కు చెదరని ఉక్కు స్తంభం!

దిల్లీలోని (Delhi) అతి పురాతన ఉక్కు స్తంభం (Iron pillar) 1600 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదర్లేదు. దాని దృఢత్వాన్ని చూసి పురాతత్వ, లోహ శాస్త్రవేత్తలు (Scientists) నివ్వెరపోతున్నారు.

Published : 19 Apr 2023 10:40 IST

 (Image : ASME.org twitter)

దిల్లీ (Delhi) మెహ్రౌలీలోని కుతుబ్‌ కాంప్లెక్స్‌ వద్దనున్న ఉక్కు స్తంభం (Iron pillar) 1600 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదర్లేదు. ఎక్కడా తుప్పు (Rust) పట్టలేదు. ఈ ఉక్కు స్తంభం దాదాపు 7.21 మీటర్ల పొడవుంది. దాని వ్యాసార్థం 41 సెంటీమీటర్లు. బరువు దాదాపు 6వేల కేజీలుంటుందని అంచనా. చారిత్రక ఆధారాల ప్రకారం దీనిని చంద్రగుప్తుడు-2 (Chandragupta II) నిర్మించాడని తెలుస్తోంది. గుప్త వంశంలో ఆయనో గొప్ప రాజు. 

గుప్తుల కాలంలో..

చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఇనుప స్తంభం 1600 ఏళ్ల క్రితమే దిల్లీలో ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఈ స్తంభాన్ని దిల్లీకి తీసుకొచ్చారనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ఇది గుప్తుల కాలం నాటిదని తెలుస్తోంది. అయితే వారిలో ఎవరు నిర్మించారనేది సరిగ్గా తెలియరాలేదు. ఈ స్తంభంపై చాలా శాసనాలు చెక్కారు. వాటిపై సంస్కృతంలో రాజు చంద్రగుప్త-2 విక్రమాదిత్య పేరు కన్పిస్తుంది. ఆయన 375 నుంచి 415 మధ్య కాలంలో పరిపాలన సాగించాడు. కాబట్టి ఆయనే దీన్ని నిర్మించి ఉంటారని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. ఇది హిందువుల దైవం విష్ణువు గౌరవార్థం నిర్మించారని కూడా ప్రచారం సాగుతోంది. 

రహస్యం ఛేదించారు

2003లో ఈ ఉక్కు స్తంభం రహస్యాన్ని కొందరు పరిశోధకులు ఛేదించారు. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన లోహ శాస్త్రవేత్తలు ఆ పరిశోధన గురించి ఓ జర్నల్‌లో ప్రచురించారు. ఇది ప్రాచీన భారతదేశంలోని లోహ శాస్త్రవేత్తల నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని అందులో కీర్తించారు. ఈ ఉక్కు స్తంభం ‘మిసావైట్‌’ అనే రక్షిత పొరను కలిగి ఉందని వెల్లడించారు. మిసావైట్‌ తయారు కావడానికి ఇనుములో అధికశాతం ఫాస్పరస్‌ ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న ఇనుములో 0.05 శాతం ఫాస్పరస్‌ మాత్రమే ఉంటుంది. కానీ, కుతుబ్‌ మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన స్తంభంలో 1 శాతానికి మించి ఫాస్పరస్‌ ఉందట. 

ఈ ఉక్కు స్తంభాన్ని చేతులతో చుట్టేసి కౌగిలించుకుంటే తమకు అదృష్టం కలిసి వస్తుందని కొందరు నమ్మేవారు. అలా కొన్ని సంవత్సరాలపాటు చేయడంతో కింది భాగంలో రంగు పోవడం ప్రారంభమైంది. చాలా పలుచగా ఉండే ‘మిసావైట్‌’ పొరను పర్యాటకులు తమకు తెలియకుండానే అరిగిపోయేలా చేశారు. జరిగిన తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు స్తంభం చుట్టూ 1997లో రక్షణ కంచె ఏర్పాటు చేశారు. దిల్లీలో ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ ఈ స్తంభం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని