Jayalalithaa: ‘శశి.. నాకు తలతిరుగుతోంది..’

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ ఇచ్చిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అక్రమాస్తుల కేసులో నేరారోపణలు రుజువైన తర్వాత జయలలిత తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని కమిషన్‌ ముందు లిఖితపూర్వకంగా ఇచ్చిన నివేదికలో శశికళ పేర్కొన్నారు.

Published : 21 Oct 2022 02:14 IST

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి (Jayalalithaa Death) దారితీసిన కారణాలపై జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ (Arumughaswamy Report) ఇచ్చిన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టింది. ‘అమ్మ’ మరణంపై ఇప్పటికే అనేక అనుమానాలు నెలకొన్న తరుణంలో 480 పేజీల ఈ నివేదిక.. ఆమె నెచ్చెలి శశికళతో సహా మొత్తం 8 మందిపై కమిషన్‌ అభియోగాలు మోపడం సంచలనం రేపుతోంది. జయలలితకు అందిన చికిత్స తీరుపై విచారణ కమిషన్‌ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. మరోవైపు.. విచారణ క్రమంలో కమిషన్‌ ముందు జయలలిత సన్నిహితురాలు శశికళ (Sasikala) లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరాలు ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో జయలలిత నేరారోపణలు రుజువైన తర్వాత ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు శశికళ అందులో పేర్కొన్నారు. ఇలా ఆస్పత్రిలో చేరక ముందు.. చికిత్స సమయంలో జయలలితకు అందించిన సపర్యలు.. చివరకు ఆమె తుది ఘడియలను ఓసారి పరిశీలిస్తే..

‘శశి.. నాకు తలతిరుగుతోంది..’

‘2016 నుంచి అక్క(జయలలిత) శరీరంపై బొబ్బలు, దురదతోపాటు చాలాచోట్ల సోరియాసిస్‌ మొదలయ్యింది. ఇబ్బందితోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కొంతకాలం పాటు స్వల్ప మోతాదులో స్టెరాయిడ్‌లు ఇవ్వాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో చర్మ సమస్యలు తగ్గాయి. వైద్యులు కూడా స్టెరాయిడ్లను క్రమంగా తగ్గించారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 21న జరిగిన ఓ అధికారిక కార్యక్రమం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర జ్వరం వచ్చింది. చాలా అలసటగా ఉండటాన్ని గమనించి.. ఆస్పత్రికి వెళ్దామని చెప్పా. కానీ, అక్క నిరాకరించింది. నీరసంగా ఉండడంతో ఆ రోజు రాత్రి అక్కతోనే ఉన్నా. బ్రష్‌ చేసుకునేందుకు వెళ్లిన అక్క.. శశి, నాకు తలతిరుగుతోంది.. ఇక్కడికి రా అని పిలిచింది. బాత్‌రూంలోకి వెళ్లి ఆమెను తీసుకొచ్చి బెడ్‌ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నా. కొద్దిసేపటికే మూర్ఛపోయినట్లు అకస్మాత్తుగా నా భుజం మీద ఒరిగిపోయింది’ అని శశికళ అందులో పేర్కొన్నారు.

భక్తిగీతాలు.. గదిలో దేవుళ్ల ఫొటోలు..

75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయలలిత.. పరిస్థితి విషమించే ముందు వరకు తనకు ఇష్టమైన భక్తి గీతాలు వినేవారు. ఆమెకు ఇష్టమైన దేవుళ్ల ఫొటోలను గది గోడలపై అంటించాం. ఆమె కళ్లకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు వీలుగా గది సమీపంలో పచ్చని మొక్కలు ఏర్పాటు చేశాం.

డాక్టర్‌ గారు.. ‘మావో’ గురించి తెలుసుకోండి..

చైనా మాజీ అధ్యక్షుడు, పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ గురించి జయలలిత ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి ‘ప్రైవేట్‌ లైఫ్‌ ఆఫ్‌ ఛైర్మన్‌ మావో’ పుస్తకాన్ని చదవాలని.. నాయకత్వ లక్షణాలు తెలుస్తాయని తనకు చికిత్స చేసిన వైద్యుడికి సూచించారు. అయితే, కొన్నిరోజులకు జయలలిత ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న సమయంలో ఆమెకు ట్రాకియోస్టోమీ చికిత్స చేశారు. ఓ పది రోజుల తర్వాత సర్జరీ సమయంలో ఏర్పాటు చేసిన ఆహార పైపును తొలగించాలని కోరారు. అక్క కోరిక మేరకు, వైద్యుల సూచనతో ఇడ్లీ, పొంగల్‌, వడను స్వల్ప మొత్తంలో అందించాం’ అని శశికళ పేర్కొన్నారు.

చివరి ఘడియల్లో..

రెండు నెలలకు పైగా చికిత్స కొనసాగుతోన్న సమయంలో.. డిసెంబర్‌ 4న ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ సాయంత్రం 4.20 గంటలకు ‘జయ వీర హనుమాన్‌’ సీరియల్‌ చూస్తున్నారు. అది పూర్తయిన కొద్ది సేపటికే హఠాత్తుగా అక్క శరీరం ఒక్కసారి వణికిపోయింది. అప్పటికే ఓ వైద్యురాలు, నర్సు అక్కడే ఉన్నారు. నాలుక బయటకు పెట్టి, పళ్లు కరుస్తూ ఏదో అరిచింది. ఆమె రెండు చేతులను నాపై వేయబోగా.. ఆమెను పట్టుకొని బెడ్‌ మీద పడుకోబెట్టాం. వెంటనే వైద్యులు వచ్చి అత్యవసర చికిత్స అందించారు’ అని శశికళ తన నివేదికలో చెప్పింది.

కొద్ది సేపటి తర్వాత ఆమె చెవి వద్ద ‘అక్కా..’ అని గట్టిగా అరవమని వైద్యులు చెప్పారు. నేను అలాగే అరవడం మొదలు పెట్టాను. ఆ సమయంలో రెండుసార్లు నావైపు చూసింది. అనంతరం కళ్లు మూసింది. ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పిన వైద్యులు.. వెంటనే నన్ను బయటకు వెళ్లమన్నారు. భరించలేని దుఃఖంతో నేనూ కుప్పకూలిపోయా. లేచి చూసేసరికి అక్కకు ECMO పరికరం అమర్చి ఉంచారు. చాలా మంది వైద్యులు వచ్చి చికిత్స కొనసాగించారు. ఏదో అద్భుతం జరుగుతుంది.. అక్క ప్రాణాలు నిలుస్తాయని భావించా. మరుసటి రోజు రాత్రి వరకు వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది’ అని నాటి ఘటనను విచారణ కమిషన్‌ ముందు శశికళ వివరించింది. కాగా.. డిసెంబర్‌ 5న రాత్రి 11.30కు జయలలిత కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని