Railway museum : బుల్లి ట్రైన్లు నడిచే బుజ్జి మ్యూజియం.. ఇక్కడ వందేభారత్ నడుస్తోంది!
జేబులో పట్టే స్టీమ్ ఇంజిన్లు (Steam engine), ఫ్లై ఓవర్లు, స్విమ్మింగ్ ఫూల్, దీప స్తంభాలు, సర్కస్ నమూనా ఇవన్నీ పుణెలోని (Pune) కోత్రుడ్‌లో ఉన్న జోషి మ్యూజియంలో కన్పిస్తాయి. దేశంలోని ఏకైక మినియేచర్ రైల్వే మ్యూజియంగా (Railway museum) ఇది 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Limca book of records) చోటు సంపాదించింది.
(Image : Social media)
చుక్ చుక్ అంటూ పట్టాలపై పరుగులు తీసే రైలు బండిని (Rail) తొలి సారి చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు. అన్ని బోగీలను అదెలా లాగుతోంది? మొత్తం రైల్వే వ్యవస్థ (Railway system) ఎలా పని చేస్తోంది? వంటి సందేహాలు మెదళ్లను తొలుస్తుంటాయి. పుణెలోని ‘జోషి మ్యూజియం ఆఫ్ మినియేచర్ రైల్వేస్’ను (Joshi museum of miniature railways) ఒక సారి సందర్శిస్తే ఆ ప్రశ్నలన్నింటికీ బదులు దొరకుతుంది. ఇక్కడ భారతీయ రైళ్లు (Indian railways) మాత్రమే కాదు.. విదేశీ రైళ్లు ఎలా పరుగులు తీస్తాయో కూడా క్షుణ్నంగా తెలుసుకోవచ్చు.
బీఎస్ జోషి కృషి
పుణెకు చెందిన బీఎస్ జోషికి చిన్నప్పటి నుంచి రైళ్లంటే మహా ఆసక్తి. వివిధ రకాల రైళ్లను గమనిస్తూ వాటిని కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసేవారు. అవి నిజమైన రైళ్లే అనుకునే విధంగా జోషి పనితనం ఉండేది. అందరూ అభినందిస్తుండటంతో ఆయన కోటలు, కొండలు వంటి కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కదిలే కారు, ఫైరింజన్ లాంటివి రూపొందించారు. తీగల సాయంతో వాటిని నడిపిస్తుంటే అందరూ ఔరా అని మెచ్చుకునేవారు. అలా జోషి 1982 ఓ మాస్టర్ పీస్ లే ఔట్‌ను తయారు చేసి గోఖలే హాల్‌లో ప్రదర్శించారు. ఆ బొమ్మల ఆకృతి నిర్మాణం చూసి జోషిని పలువురు అభినందించారు. తరువాత దాన్ని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లడం ఆయన ఓ పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వాటిని తరచూ విడదీయడం, అతికించడం కష్టంగా మారింది. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. అదే మినియేచర్ మ్యూజియం. దేశంలో అప్పటి వరకు ఎవరూ అలాంటి ప్రయత్నం చేయలేదు.
దేశంలో తొలి మినియేచర్ మ్యూజియం నిర్మించాలనే సంకల్పంతో జోషి 1991లో తొలిసారి సౌదామిని ఇన్‌స్ట్రుమెంట్ ఫ్యాక్టరీలో ఒక హాల్‌ను నిర్మించారు. గతంలో రూపొందించిన వాటికి భిన్నంగా కొత్త లే అవుట్ నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దేశీయ, విదేశీ రైలు మోడళ్లు, స్టేషన్లు, ట్రాక్‌లు, కార్లు, ప్రయాణికులు ఇలా ఒక్కో మినియేచర్ రూపొందించడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆయన ఏడేళ్ల కష్టానికి ఫలితం 1998 ఏప్రిల్ 1న దక్కింది. ఆ రోజు ‘జోషి మ్యూజియం ఆఫ్ మినియేచర్ రైల్వేస్’ ప్రారంభమైంది. దురదృష్టవశాత్తూ అదే ఏడాది జోషి కన్నుమూశారు.
(Image : Social media)
మినీ అద్భుతం.. రైల్వే నగరం
జోషి ఒక అద్భుతమైన రైల్వే నగరాన్ని తీర్చిదిద్దారు. అందులో అన్ని దేశాల రైల్వే వ్యవస్థలు నడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. స్టీమ్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, హై స్పీడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, అండర్ గ్రౌండ్ మెట్రో, రోప్ రైల్వే, ఫునిక్యులర్ రైల్వే, వుపర్టర్ హ్యాంగింగ్ రకాల రైళ్లు ఈ మోడల్ నగరంలోని ట్రాక్‌లపై పరుగులు తీస్తుంటాయి. మినియేచర్ నిర్మాణంలో వెలిగే ప్రతి లైటు, మైకుల నుంచి వచ్చే శబ్దం డిజిటల్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. స్టేషన్ పరిధిలో ‘ప్రయాణికులకు విజ్ఞప్తి’ అంటూ అలెర్ట్ చేసే వ్యవస్థ కూడా ఉంది. డిజైన్ మొత్తంలో 65 సిగ్నల్స్, 26 పాయింట్స్, 6 ప్లాట్‌ఫామ్స్, కంచెలు, దీప స్తంభాలు, ఫ్లై ఓవర్లు, రెండు లైన్ల హైవే, అందులో నడిచే కార్లు ఉన్నాయి. ఇందులోనే రివర్సింగ్ స్టేషన్‌తో ఒక ఘాట్ సెక్షన్ నమూనా కూడా కన్పిస్తుంది.
ఈ రైల్వే నగరంలో ఎత్తయిన భవంతులు మరో ప్రధాన ఆకర్షణ. వాటిలో దీపాలు వెలుగుతుంటాయి. చిన్న పక్కా ఇళ్లు కూడా ఉన్నాయి. వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. భారీ హోర్డింగ్‌లతో ఒక రద్దీ కూడలి దర్శనమిస్తుంది. ఇవి మాత్రమే కాదు.. రోలర్ కోస్టర్, ఫెర్రిస్ వీల్ వంటి సౌకర్యాలతో సర్కస్ నమూనాను ఏర్పాటు చేశారు. నగరం మొత్తంలో వివిధ చోట్ల దాదాపు 2వేల బొమ్మలున్నాయి. అవన్నీ రకరకాల పోజుల్లో ఉంటాయి. రాత్రి వాతావరణాన్ని ప్రతిబింబించే ఏర్పాటు కూడా ఈ మినియేచర్ మ్యూజియంలో ఉంది. 1853 ఏప్రిల్ 16న రాత్రి ఆకాశం ఎలా కనిపించిందో అలాంటి నమూనాను ఇక్కడ తీర్చిదిద్దారు. ఎందుకంటే ఆ రోజే మన దేశంలో తొలి రైలు కదిలింది.
వందే భారత్ వచ్చింది!
ప్రస్తుతం ఇదే తరహాలో మరో మ్యూజియాన్ని సతారా జిల్లాలోని వాయ్‌లో నిర్మించారు. జోషి తనయుడు రవి జోషి మరో రెండింటినీ నడిపిస్తున్నారు. కంట్రోల్ ప్యానల్ దాదాపు వెయ్యి తీగలను అనుసంధానం చేసి అందులోని మినియేచర్లను నడిపిస్తున్నారు. అంతే కాదు ఈ మ్యూజియం ఫ్లైష్మన్, రోకో, హాన్బీ వంటి అంతర్జాతీయ కంపెనీల మోడల్ రైళ్లను కూడా రూపొందిస్తోంది. అవసరాన్ని బట్టి వాటిని ఆయా కంపెనీలకు సరఫరా చేస్తోంది. 2007లో ఈ మ్యూజియం స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ జంగ్ ఫ్రా రైల్వే మోడల్‌ను అభివృద్ధి చేసింది. దాంతో 2వేల నకళ్లను పంపాలని అక్కడి నుంచి ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం ఏడాదికి 30 వేల మంది ఈ మ్యూజియాన్ని సందర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవలే ఈ మ్యూజియం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా అందులో వందేభారత్ మినియేచర్ ట్రైన్‌ను ప్రవేశపెట్టారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై