Indian Railway: 170 ఏళ్ల భారతీయ రైల్వే.. ఆసక్తికర విషయాలెన్నో..!

1853, ఏప్రిల్‌ 16 భారత్‌లో తొలి పాసింజర్‌ రైలును (First Passenger Train) ప్రవేశపెట్టారు. ప్రతియేటా ఏప్రిల్‌ 16న ‘రైలు రవాణా దినోత్సవం’గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా 170 వసంతాలు పూర్తి చేసుకున్న ఇండియన్‌ రైల్వే గురించి ఆసక్తికర విషయాలు.

Updated : 15 Apr 2023 19:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశంలో రైలు ప్రయాణాలకు (Indian Railway Transportation) ప్రత్యేక స్థానముంది. కేవలం సరకు రవాణా మాత్రమే కాకుండా.. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకున్న ప్రయాణికులు  ఎక్కువగా రైలుకే మొగ్గు చూపుతారు. సుఖంగా ప్రయాణించడంతోపాటు దాదాపుగా అనుకున్న సమాయానికి గమ్యం చేర్చడం కూడా దీనికి ఒక కారణమే. తొలిసారిగా 1853, ఏప్రిల్‌ 16న తొలి పాసింజర్‌ రైలును భారతదేశంలో ప్రవేశపెట్టారు. బోరీబందర్‌ (Bori bandar ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్‌) నుంచి థానే (Thane) వరకు 34 కిలోమీటర్ల మేర ఇది తొలి ప్రయాణం చేసింది. అప్పటి నుంచి ఏప్రిల్‌ 16ను ‘రైలు రవాణా దినోత్సవం’గా జరుపుతున్నారు. రేపటితో భారతీయ రైల్వే (Indian Railway) 170 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

 

  • ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన వ్యవస్థగా భారతీయ రైల్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏడాదికి దాదాపు 8.086 బిలియన్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుండగా.. సుమారు 1.208 బిలియన్‌ టన్నుల సరకు రైళ్ల ద్వారా రవాణా అవుతోంది. 
  • 170 ఏళ్లకు ముందే భారత్‌లో రైల్వేమార్గాలకు పథకాలు రూపొందించారు. జెమ్‌సెట్జీ జీజీభోయ్‌, జగ్‌నాథ్‌ సుంకర్‌సేత్‌ తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
  • 1853లో అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ డల్హౌసీ పాలనలో మొదటి రైలు ప్రయాణం ప్రారంభించింది.
  • ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే మూడో స్థానంలో ఉంది. భారత్‌లో 1,27,760 కి.మీ మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా దేశాలున్నాయి.
  • భారత్‌లో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్‌. గంటలకు 180కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అయితే, ట్రాక్‌ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 160కి.మీ వేగం వరకు మాత్రమే నడుపుతున్నారు. అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాళెం-ఊటీ మధ్య నడిచే నీలగిరి పాసింజర్‌.. గంటలకు 10 కి.మీ వేగంతో ఇది ప్రయాణిస్తుంది.
  • భారత్‌లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. దిబ్రూగఢ్‌ నుంచి కన్యాకుమారి వరకు 4,286కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి దాదాపు 82 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. 
  • భారత్‌లో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లో ఉంది. 1507 మీటర్ల పొడవుతో.. ఇది భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్లాట్‌ఫాంగా రికార్డు సృష్టించింది. ఇటీవలే కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఈ ప్లాట్‌ఫాంను జాతికి అంకితం చేశారు.
  • భారత్‌లో మొట్టమొదటి విద్యుత్‌ రైలు 1925 ఫిబ్రవరి 3న పట్టాలపై పరుగులు తీసింది. ముంబయి విక్టోరియా టెర్మినల్‌ నుంచి కుర్లా హార్బర్‌ వరకు ఈ రైలును నడిపించారు. ఆ తర్వాత విద్యుత్‌ లైన్లను నాశిక్‌లోని ఇగాత్‌పురి జిల్లాకు, అక్కడి నుంచి పుణెకు విస్తరించారు.
  • నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ఛైర్మన్‌, ఎండీ సతీశ్‌ అగ్నిహోత్రి వెల్లడించిన వివరాల ప్రకారం..భారత్‌లో మొట్టమొదటి బుల్లెట్‌ రైలును 2027లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 2026లోనే ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నారు. ముంబయి నుంచి అహ్మదాబాద్‌ మధ్య ఈ రైలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు