infotainment websites: నేర్చుకుందాం.. పద!

వెబ్‌విహారంలో పడి సమయాన్నే మరచిపోతుంటారు కుర్రకారు. ఖాళీ దొరికితే చాలు సోషల్‌ వేదికల్లో సందడి చేస్తుంటారు. రోజంతా ఇంటర్నెట్‌నే ఇళ్లుగా మార్చేసుకుంటున్నారు. అందులోనే తిరిగేస్తున్నారు. మరి ఆ విహారాన్ని కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విజ్ఞానం కోసమూ ఉపయోగించుకుంటే..

Published : 07 Nov 2021 22:27 IST

 

వెబ్‌విహారంలో పడి సమయాన్నే మరచిపోతుంటారు కుర్రకారు. ఖాళీ దొరికితే చాలు సోషల్‌ వేదికల్లో సందడి చేస్తుంటారు. రోజంతా ఇంటర్నెట్‌నే ఇళ్లుగా మార్చేసుకుంటున్నారు. అందులోనే తిరిగేస్తున్నారు. మరి ఆ విహారాన్ని కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విజ్ఞానం కోసమూ ఉపయోగించుకుంటే.. సమయాన్ని గడిపేయడంతో పాటు సమాచారాన్ని తెలుసుకుంటే..! అందుకే ఈ వెబ్‌సైట్‌లపై ఓ లుక్కేయండి.

ఏదైనా చేసేద్దామంటే..
ఈ గ్యాడ్జెట్‌ని ఎలా తయారు చేసుంటారు అనే సందేహం మీకు కలిగిందా? ఈ చిన్ని రోబోను సృష్టించేందుకు ఏమేం పరికరాలు వాడుంటారో తెలుసుకోవాలనుందా? ఈ క్రాఫ్ట్‌ భలే బాగుంది.. దాన్ని ఎలా చేసుంటారు? ఇంట్లోనే మనమూ ఇలాంటివి చేయాలంటే ఎలా అనిపించిందా? అయితే ఈ వెబ్‌సైట్‌పై ఓ లుక్కేయాల్సిందే. పేరు  www.instructables.com సర్క్యూట్‌లు, క్రాఫ్ట్‌, వంట తదితర వాటిని ఎలా తయారు చేశారు. అందుకు ఏమేం పరికరాలు వాడారో స్టెప్‌ బై స్టెప్‌ వివరణ ఇస్తుంది. వీడియోలు చూస్తూ ఇంట్లో మీరే తయారు చేయొచ్చు. 

చరిత్ర చదివేద్దాం..
మీకు చరిత్ర అంటే ఇష్టమా? చరిత్రకి సంబంధించిన విషయాలంటే ఆసక్తా?అయితే ఈ వెబ్‌సైట్‌ మీ కోసమే. పేరు Ancient History Encyclopedia. ప్రపంచ చరిత్రలోని ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. మానవుని పుట్టుక నుంచి తదితర పరిణామ క్రమాలను చదివేయొచ్చు. మీకు కావాల్సిన చరిత్ర కాలాన్ని వెతికి చదవొచ్చు. అంతేకాదు, ఆ కాలం నాటి వస్తువులు చూడొచ్చు. చారిత్రక స్థలాల విశేషాలనూ తెలుసుకోవచ్చు. ఆడియో రూపంలోనూ వినేయొచ్చు. వీడియోల రూపంలో చూసేయొచ్చు.

 కోర్సులతో కుస్తీకి..
 ఇంట్లో ఖాళీగా ఉన్నాం. ఏదైనా కోర్సు నేర్చుకుందామంటే శిక్షణా శిబిరాలు తెరచుకోలేవు. పోనీ ఆన్‌లైన్‌లో ప్రయత్నిద్దాం అంటే ఎంతో కొంత నగదు చెల్లించాల్సిందే.. అయితే మీ కోసం ఉచితంగా కోర్సులు అందించే ఓ వెబ్‌సైట్‌ ఉంది. పేరు www.openculture.com ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సులు ఆన్‌లైన్‌లో ఉచితంగా నేర్చుకోవచ్చు. సినిమా, ఫొటోగ్రఫీ, చదువు, వంట, ఆరోగ్యం, జర్నలిజం, వ్యాపారం, కంప్యూటర్‌ సైన్స్‌, డాటా సైన్స్‌, తదితర సుమారు 1500 కోర్సులు ఉచితంగా నేర్చుకోవచ్చు. అంతేకాదు ఆడియో బుక్స్‌ చదివేయొచ్చు. సినిమాలూ చూసేయొచ్చు.

కథనాలు చదివేయండి!
మీకు ఆర్ట్‌ అంటే ఇష్టమా? ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ గురించి తెలుసుకోవాలనుందా? మైక్రోబయోలజీ కథనాలు చదవాలనుందా! కానీ ఆ కథనాలకోసం ఇంటర్నెట్‌లో గంటల తరబడి విహరించేస్తున్నారా! అయితే మీకా శ్రమ అక్కర్లేదు.  ఈ వెబ్‌సైట్‌ తెరవండి చాలు. పేరు nautil.us. మీకు నచ్చిన టాపిక్‌లో అనేక కథనాలు అందుబాటులో ఉంటాయి. ఎంచుకుని చదివేయొచ్చు. అంతేకాదు.. ఒక అంశం గురించి వీలైనంత లోతుగా సమాచారం తెలుసుకోవచ్చు. ఓ సారి ప్రయత్నించండి.

వంట చేసేయండి!
వంటకు సరిపడా అన్ని పదార్థాలు ఇంట్లో లేవా! అయినా ఫర్వాలేదు.. మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే వంట పూర్తి చేయొచ్చు. అదెలా సాధ్యం అంటారా? ఈ వెబ్‌సైట్‌తో అది సాధ్యమే. పేరు SuperCook. మీ వంటింట్లో ఏమేం పదార్థాలున్నాయో సింపుల్‌గా ఈ వెబ్‌సైట్‌కి చెప్పండి చాలు. ఆ పదార్థాలతో  ఎలాంటివి, ఎన్ని రకాల వంటలు చేయొచ్చో చెబుతుంది. అంటే ఉన్న పదార్థాలతోనే పసందైన విందును ఆరగించవచ్చన్న మాట. అంతేకాదు, వంట ఎలా చేయాలో స్టెప్‌ బై స్టెప్‌ వివరణ ఇస్తుంది. ఒకవేళ వంట రాకపోయినా నేర్పుతుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని