Population : లక్ష జనాభా కూడా లేని దేశాలివి.. ఓ లుక్కేయండి!

ప్రపంచంలోనే (World) అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్‌ (India) అవతరించింది. 142.86 కోట్ల మందితో చైనాను (China) వెనక్కి నెట్టేశాం. ఈ నేపథ్యంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశాలపై ఓ లుక్కేయండి.

Updated : 21 Apr 2023 16:05 IST

భారత్‌లో (India) జనాభా ప్రకారం అతి చిన్న రాష్ట్రం సిక్కిం (Sikkim). అక్కడ జనాభా 6.90 లక్షలు. సరిగ్గా లక్ష జనాభా (Population) లేకున్నా కొన్ని ప్రాంతాలు దేశాలుగా గుర్తింపు పొందాయి. వాటిని పరిశీలించండి.

వాటికన్‌ సిటీ 

ప్రపంచంలో కెల్లా చిన్న దేశంగా పేరున్న వాటికన్‌ సిటీలో 518 మంది నివసిస్తున్నారు. ఈ దేశ విస్తీర్ణం చదరపు కిలోమీటరు లోపే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మతబోధకులు, నన్‌లు కనిపిస్తారు. సిస్టీన్‌ ఛాపెల్, సెయింట్ పీటర్స్‌ బసిలికా, సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ వంటి ముఖ్యమైన నిర్మాణాలున్నాయి. స్క్వేర్‌లో దాదాపు 80 వేల మందికి వసతి కల్పించవచ్చు. పోప్‌ సందేశాన్ని వినేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు ఇక్కడకు తరలివస్తుంటారు.

టువలు

ఈ దేశం హవాయ్‌, ఆస్ట్రేలియా మధ్యలో.. 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇక్కడ 11,396 మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న సముద్ర జలాలు భవిష్యత్తులో ఈ దేశాన్ని ముంచెత్తుతాయనే అందోళన స్థానికుల్లో నెలకొంది. ఈ దేశ జనాభా వారి పూర్వీకులు అనుసరించిన జీవన విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వీరు పడవలు తయారు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు. అంతే కాకుండా క్రికెట్ పోలిన ఆట ‘కిలికిటి’ ఆడుతారు. జనాభా మొత్తం సంతోషంగా ఉంటారు. ఎక్కువగా కొబ్బరితో తయారయ్యే వంటకాలు చేసుకుని తింటారు.

నౌరు

21 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ద్వీప దేశం నౌరు. జనాభా 12,780. వారంతా వ్యవసాయం చేస్తూ పైనాపిల్‌, అరటి, కొబ్బరి, ఇతర కూరగాయలు పండిస్తుంటారు. ఫాస్పేట్‌ తవ్వకాల కారణంగా ఇక్కడున్న 80 శాతం భూమి నాశనమైంది. ఈ దీవిలోకి మానవులు మూడు వేల ఏళ్ల క్రితమే ప్రవేశించారని చెబుతున్నారు. అప్పట్లో తమ ఆహారం కోసం సముద్ర జీవులపై ఆధారపడేవారు. 1800వ సంవత్సరంలో యూరోపియన్లు ఈ దీవిలోకి అడుగుపెట్టారు. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయంలో ఈ దేశ ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి అక్కడ జనాభా మొత్తం సంతోషంగా జీవిస్తున్నట్లు సమాచారం.

పలౌ

పలౌలో 18,058 మంది నివసిస్తున్నారు. 459 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇది పసిఫిక్‌ దీవుల్లోని ప్రాంతం. క్రీస్తుపూర్వం సుమారు 2వేల ఏళ్ల కిందటే ఇక్కడ మనుషుల సంచారం ఉండేదట. 1914-44 వరకు ఇది జపాన్‌ అధీనంలో ఉంది. ఆ తరువాత అమెరికా చేతుల్లోకి వెళ్లింది. 1994లో పలౌ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇక్కడ అందమైన ద్వీపాలున్నాయి. 

శాన్‌ మారినో

శాన్‌ మారినోలో 33,642 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ దేశం 61 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. క్రీస్తు శకం 300 సంవత్సరంలో ఇక్కడున్న ఓ కొండపై చర్చిని నిర్మించారు. క్రమంగా అదే ఇప్పుడు ఓ స్వతంత్ర దేశంగా రూపాంతరం చెందింది. 1862లో గిసెప్పె గారిబాల్డి అనే ఇటాలియన్‌ జనరల్‌ ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇటలీ పునరేకీకరణ సమయంలో గిసెప్పె, అతని భార్య ఇక్కడే తలదాచుకున్నారట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశం అనేక కష్టాలు చవిచూసింది. ఇప్పుడు మాత్రం తలసరి ఆదాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. దేశం నడిబొడ్డున టైటానో పర్వతంపై నిర్మించిన గ్వైటా కోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మొనాకో 

మొనాకో దేశంలో 36,297 మంది నివాసముంటున్నారు. 2 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ దేశం విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 32 శాతం మంది ప్రజలు ధనవంతులే. ఇక్కడ గృహాలు, ఇతర నిర్మాణాలు వైవిధ్యంగా కన్పిస్తాయి. అవి చాలా మందికి వసతి కల్పించడానికి అనువుగా ఉంటాయి. ఈ దేశంలో మొనాకో గ్రాండ్‌ ప్రి రేస్‌ కూడా జరుగుతుంది. మొనాకో క్యాసినోలకు చాలా ఫేమస్‌. ఏటా సెప్టెంబరులో నిర్వహించే పడవల పోటీలను చూసేందుకు విదేశాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తుంటారు. ఇది ఐరోపా సమాఖ్యలో భాగం కానప్పటికీ యూరో ఈ దేశ ప్రధాన కరెన్సీ.

లైకెస్టీన్‌

లైకెస్టీన్‌లో 39,584 మంది నివసిస్తున్నారు. 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇది స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా దేశాల మధ్యలో కన్పిస్తుంది. ఇక్కడి ప్రజలు జర్మన్‌ భాష మాట్లాడతారు. వారి తలసరి ఆదాయం కూడా ఎక్కువే. పర్వతాలు, నదులు, సరస్సులతో కూడిన ఈ ప్రాంత అందాలు పర్యాటకులను మైమరచిపోయేలా చేస్తాయి.

మార్షల్‌ ఐలాండ్స్‌ 

మార్షల్‌ ఐలాండ్స్‌లో 41,996 మంది జీవిస్తున్నారు. 181 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం పసిఫిక్‌ మహాసముద్రంలోని మైక్రోనేషియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ 29 వలయాకార పగడపు దిబ్బలు, 5 దీవులున్నాయి. ఈ దేశ రాజధాని మజురోలోనే సగం జనాభా నివసిస్తున్నారు. పర్యాటకులు స్కూబా డైవింగ్‌ చేసేందుకు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. 1944లో అమెరికా నియంత్రణలోకి వెళ్లినప్పటి నుంచి ఈ దేశం అగ్రరాజ్యంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.

సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌

సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ జనాభా 47,755. 261 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. ఈ కరీబియన్‌ దేశం వెనెజువెలాకు ఉత్తర దిశలో ఉంది. చెరకు ఇక్కడి ప్రధాన ఆహార పంట. ఈ దేశానికి ప్రత్యేకంగా సైన్యం లేనప్పటికీ మాదక ద్రవ్యాల కార్యకలాపాలను అడ్డుకోవడానికి 300 మంది సిబ్బంది పోలీస్‌ ఫోర్స్‌లా పనిచేస్తున్నారు. గతేడాది స్వలింగ సంపర్కాన్ని ఇక్కడ చట్టబద్ధం చేశారు. ఏటా పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఈ దేశం క్రమంగా అభివృద్ధి చెందుతోంది.

డొమినికా

డొమినికాలో 73,040 మంది జనాభా నివసిస్తున్నారు. 751 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ దేశం ఉంది. ఈ అద్భుతమైన ద్వీపంలో వర్షారణ్యాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా కన్పిస్తాయి. గతంలో కాఫీ తోటల్లో పని చేయించుకునేందుకు ఎక్కువ మంది ఆఫ్రికా జాతి ప్రజలను ఇక్కడికి తరలించారు. దాంతో ఇప్పుడు ఆ దేశం నిండా ఆఫ్రికన్లే కన్పిస్తుంటారు. ఈ దేశంలో సంగీత, నృత్యోత్సవాలు అధికంగా జరుగుతుంటాయి.

నోట్‌ : జనాభా వివరాలు వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ.కామ్‌ లెక్కల ఆధారంగా తీసుకున్నవి. వీటిలో స్వల్ప పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు