Longest neck : పొడవైన మెడలు ఈ మహిళల ప్రత్యేకత.. ఎందుకు రింగులు ధరిస్తున్నారంటే!
మయన్మార్ (Myanmar), థాయ్‌లాండ్‌లో కయాన్ తెగ స్త్రీలు మెడకు పొడవైన రింగులు ధరించడం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. అలా వారు రింగులు ధరించడం వెనకున్న కథేంటో చదివేయండి.
మయన్మార్ (Myanmar), థాయ్‌లాండ్ (Thailand)లోని కయాన్ తెగకు చెందిన స్త్రీలు మెడ చుట్టూ ఇత్తడి రింగులు ధరిస్తారు. వాటిని కాయిల్స్ అని కూడా పిలుస్తారు. తమ మెడ సుందరంగా, ప్రత్యేకంగా కనిపించడానికి గత కొన్ని శతాబ్దాలుగా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు కొన్నిసార్లు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఎప్పుడు మొదలైందీ ఆచారం!
ప్రపంచంలోనే అతి పొడవైన మెడలు కలిగిన మహిళలుగా కయాన్ జాతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ మాత్రమే కాకుండా వివిధ సంస్కృతుల్లోనూ ఈ తరహా రింగులను ధరిస్తారు. ఆసియాలో 11వ శతాబ్దం నుంచే మెడను పొడిగించే పద్ధతి అమల్లో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకు ముందు కూడా ఈ ఆచారం ఉండొచ్చని వారు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాలకు చెందిన సెల్టిక్ జాతి ప్రజలు కూడా మెడకు రింగులు ధరించేవారు. అయితే వారి పద్ధతి కొంచెం భిన్నంగా ఉండేది. ఈ జాతి పురుషులు తమ సంపద, అధికారం, దర్పానికి ప్రతీకగా ‘టార్క్స్’ అనే రింగులను ధరించారు. వాటిని మెడ పొడిగింపు కోసం వాడలేదు.
ఐదేళ్లకే మెడ రింగు
మెడ రింగులు ధరించే గిరిజన మహిళలు ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల కన్పిస్తారు. మయన్మార్‌లోని కయాన్ ప్రజలు, ఆఫ్రికాలోనే ఎండబేలా తెగలు ఇప్పటికీ రింగులు ధరిస్తున్నారు. కయాన్ తెగలోని బాలికలకు 5 సంవత్సరాలు రాగానే మెడకు రింగును అలంకరిస్తారు. ప్రతి ఏడాది వాటిని మార్చి కాస్త పెద్దవి వేస్తూ పోతారు. అలా వృద్ధాప్యం వచ్చేసరికి ఒక్కో మహిళ మెడలో సుమారు 15 కేజీల బరువైన రింగులుంటాయి. వైద్య చికిత్స చేయించుకోవాల్సి వస్తే తప్ప వాటిని ఏ సందర్భంలోనూ తొలగించరు. కయాన్ ప్రజలను ‘పడాంగ్ ’అని కూడా పిలుస్తారు. 1990 ప్రాంతంలో వీరు మిలటరీ బారి నుంచి తప్పించుకోవడానికి థాయిలాండ్ సరిహద్దుకు చేరారు. అక్కడే స్థిరపడి పోవడంతో ‘పొడవైన మెడ తెగ’గా వారికి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఈ తెగను చూసేందుకు అనేక మంది పర్యాటకులు వెళ్తుంటారు. పర్యాటకుల ప్రోత్సాహం కారణంగానే ఈ తెగ మనుగడ సాగిస్తోందని అంటారు.
మూడు సిద్ధాంతాలు
కయాన్ జాతి మహిళలు మెడ రింగులు ఎందుకు ధరిస్తున్నారు? దాని వెనుక ఎలాంటి కారణాలున్నాయనే విషయంపై కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో ఒక సిద్ధాంతం ప్రకారం.. కయాన్ స్త్రీలను అంద విహీనంగా చేయడం వల్ల శత్రువులు వారిని విక్రయించడం, అపహరించడం, బానిసత్వం కోసం వినియోగించడం వంటి చర్యలను అరికట్టవచ్చని భావించారు. రెండోది పులుల దాడి నుంచి రక్షించుకోవడం. అంటే అటవీ ప్రాంతంలో నివసించే వీరిపై పులులు దాడి చేస్తే మెడకు ఉన్న రింగుతో ప్రాణాపాయం తప్పుతుందని తెలుసుకున్నారు. మూడో సిద్ధాంతం ఏమిటంటే వీరి సంస్కృతి చిహ్నం డ్రాగన్. దాన్ని పోలి ఉండేలా రింగులను ధరించడం. ప్రస్తుతం చాలా మంది కయాన్ మహిళలకు తాము ఎందుకు రింగులు ధరిస్తున్నామో తెలియనప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
గిన్నిస్ బుక్‌లో జిరాఫీ మహిళ..
మయన్మార్‌లోని కయాన్ తెగకు చెందిన ఓ మహిళను ‘జిరాఫీ మహిళ’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆమె మెడ జిరాఫీలాగే చాలా పొడవుగా ఉంటుంది. ఆమెను చూడటానికి వచ్చిన విదేశీయులు ఈ పేరు పెట్టారు. ఆ పేరే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అందులో ఆమె మెడ పొడవును 19.7 సెంటీమీటర్లుగా పేర్కొన్నారు. ఈ రికార్డ్స్ తరువాత ఆ ప్రాంతంలో పర్యాటకం మరింత ఊపందుకుంది. పొడవైన మెడతో ఆకట్టుకుంటున్న ఈ ప్రజలు థాయ్‌లాండ్‌లో కొంత వివక్ష కూడా ఎదుర్కొంటున్నారు. వీరిని ఇంకా మయన్మార్ శరణార్థులుగానే అక్కడి ప్రభుత్వం గుర్తిస్తోంది. దాంతో వారి పిల్లలకు థాయ్ పౌరసత్వం దక్కడం లేదు. ఫలితంగా విద్య, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు.
అనేక ఆరోగ్య సమస్యలు
పురాతన ఆచార సంప్రదాయాన్ని కొనసాగించడం వల్ల ఈ తెగ మహిళలకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. సుదీర్ఘ కాలం వాటిని వేసుకోవడం వల్ల కాలర్ బోన్‌కు గాయాలవుతున్నాయి. ఒక వేళ ఉన్నట్లుండి తీసి వేస్తే సొంతంగా మెడ నిలపడం కష్టమైపోతోంది. ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతోంది. గడిచిన దశాబ్దం కాలంలో ఈ ఆచారాన్ని పాటించే మహిళల సంఖ్య తగ్గిపోయింది. దాన్ని కచ్చితంగా పాటించాలని ఆ తెగ పెద్దలు కూడా బలవంతం చేయట్లేదు.
కయాన్ మహిళలను స్ఫూర్తిగా తీసుకొని సిడ్నీ స్మిత్ అనే యువతి తనను తాను ‘జిరాఫీ మహిళ’గా ప్రకటించుకొని గతంలో ఇలాంటి రింగులను ధరించింది. అనారోగ్య సమస్యలు రావడంతో ఐదేళ్ల తర్వాత వాటిని తొలగించింది. అవి ధరించడం వల్ల డ్రైవింగ్ చేయలేకపోయానని, కనీసం సొంత పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాలేదని ఆమె మీడియాకు వెల్లడించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!