Startups: అంకుర సంస్థల వైఫల్యాలకు ముఖ్య కారణాలు ఇవే..!

వేల సంఖ్యలో అంకుర సంస్థలు పుట్టుకొచ్చినా కొన్ని మాత్రమే విజయవంతమై, ప్రజల ఆదరణ పొందగలుగుతున్నాయి. చాలా  సంస్థలు మార్కెట్లోకి వచ్చాయన్న విషయం కూడా తెలియకుండానే కనుమరుగైపోతున్నాయి. ఇలా అంకుర సంస్థలు వైఫల్యం చెందడానికి ఎనిమిది ముఖ్యమైన కారణాలున్నాయని

Published : 07 Nov 2021 20:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాపార రంగం విస్తరిస్తూనే ఉంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో యువత ఇలాంటి సేవలను గుర్తించి వినూత్న వ్యాపారాలను ప్రారంభిస్తోంది. ప్రభుత్వాలు, కార్పొరేట్‌ సంస్థలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అనేక అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. అయితే వేల సంఖ్యలో అంకుర సంస్థలు పుట్టుకొచ్చినా కొన్ని మాత్రమే విజయవంతమై, ప్రజల ఆదరణ పొందగలుగుతున్నాయి. చాలా సంస్థలు మార్కెట్లోకి వచ్చాయన్న విషయం కూడా తెలియకుండానే కనుమరుగైపోతున్నాయి. ఇలా అంకుర సంస్థలు వైఫల్యం చెందడానికి ఎనిమిది ముఖ్యమైన కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

తక్కువ డిమాండ్‌ ఉన్నవి ఎంచుకోవడం

మార్కెట్లో డిమాండ్‌ అంతగాలేని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవడమే అంకురసంస్థ వైఫల్యానికి మొదటి కారణం. ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే అది వీలైనంత ఎక్కువ మంది అవసరాలను తీర్చేవిధంగా ఉండాలి. వ్యాపార ఆలోచన ఎంత బాగున్నా.. అది మార్కెట్లో కొద్దిమందిని మాత్రమే ఆకర్షించేదయితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఉదాహరణకు ఆహార రంగంలో కేవలం శాకాహారం మాత్రమే అందించే సేవలను ఎంచుకున్నారనుకోండి.. అది కేవలం శాకాహారులు మాత్రమే వినియోగించే అతి తక్కువ పరిధి ఉన్న అంకుర సంస్థగా నిలిచిపోతుంది. విస్తరణకు అవకాశం ఉండదు.

నిధుల కొరత

ఏ వ్యాపారం ప్రారంభించినా.. దాని కార్యకలాపాలు సక్రమంగా కొనసాగాలంటే నిధులు అవసరం. తగినంత నిధులు సమకూరనప్పుడు సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల అంకుర సంస్థలకు చెడ్డపేరు రావొచ్చు. డబ్బులు సమకూరినా సరైన ప్రణాళిక లేని ఖర్చులు అంకుర సంస్థను దెబ్బతీసే అవకాశముంది.

ఉద్యోగుల నియామకం

ఓ సర్వే ప్రకారం 23శాతం అంకురసంస్థలు విఫలం కావడానికి వారు నియమించుకున్న ఉద్యోగులే కారణమని తేలింది. ఒక సంస్థ ఎదగాలంటే అందులో పనిచేసే ఉద్యోగులకు ఎంతో నైపుణ్యం ఉండాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసేవారు కావాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఐక్యంగా పనిచేయాలి. అంకుర సంస్థ ఆలోచనలు, లక్ష్యాలను ఉద్యోగులు తమవిగా భావించగలగాలి. కానీ కొన్ని సంస్థలు సరైన నైపుణ్యం లేనివారిని నియమించుకొని స్వయంకృతాపరాధం చేస్తుంటాయి.

పోటీదారులు ఎక్కువ

పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే అంత సులువు కాదు. ఒక అంకుర సంస్థ వ్యాపార ఆలోచన మరొకరికీ వచ్చి ఉండొచ్చు. లేదా ఆ వ్యాపారం అప్పటికే మార్కెట్లో అందుబాటులోకి రావొచ్చు. దీంతో ఒకేలాంటి సేవలు అందించే సంస్థల మధ్య పోటీ పెరుగుతుంది. పోటీదారులను తట్టుకొని అంకుర సంస్థలు మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమే. ఒకవేళ ఒక కొత్తరకం సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తే వ్యాపారం బాగా జరగొచ్చు. అయితే, వెంటనే ఇలాంటి సేవలు అందించే సంస్థలు అనేకం పుట్టుకొస్తాయి. మళ్లీ పోటీ పెరుగుతుంది. దీంతో సేవలు అందించే విధానాన్ని బట్టే అంకుర సంస్థ విజయం ఆధారపడి ఉంటుంది.

సేవలకు ధర నిర్ణయం

అంకుర సంస్థను భారీ లేదా పరిమిత పెట్టుబడితో ప్రారంభించినా వినియోగదారులకు అందించే సేవలకు ధరలు నిర్ణయించడంలో ఆయా సంస్థలు తప్పటడుగులు వేస్తాయి. ఎల్లప్పుడూ అందుబాటు ధరలు, ప్రత్యేక ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ, సంస్థ పాలసీలు, ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అనుకునే దానికంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తే ఆ అంకుర సంస్థ ఎక్కువకాలం నిలబడలేదు.

వ్యాపార వ్యూహాలు

మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే అంకుర సంస్థలు వ్యూహాలు రచించాలి. పోటీగా ఉండే సంస్థలకు మించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో ఒకే విధానంలో వెళ్తానంటే సరిపోదు. వివిధ రకాలుగా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయాలి. తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకోగలగాలి. సరైన వ్యూహ రచనలు లేకే చాలా అంకుర సంస్థలు అటకెక్కేస్తున్నాయి.

మార్కెటింగ్‌

ఎంతో వినూత్న, విభిన్న సేవలతో వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. కానీ దాని గురించి నలుగురికి తెలియకపోతే లాభం ఏముంది? అందుకే అంకుర సంస్థలు ఏర్పాటు చేయడంపైనే కాదు.. తమ సేవలను ప్రచారం చేసుకొని, మార్కెట్‌ ఏర్పరచుకోవాలి. వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచార మాధ్యమాలు, ఇతర మార్గాలను బాగా ఉపయోగించుకోవాలి. దాదాపు 14శాతం అంకుర సంస్థలు సరైన మార్కెటింగ్‌ చేసుకోలేకే దివాళా తీస్తున్నాయని ఓ సర్వేలో వెల్లడైంది.

నాణ్యత

ఒక అంకుర సంస్థ భారీ పెట్టుబడితో ప్రారంభమై, మార్కెట్లో గుర్తింపు పొందిందనుకుందాం. కానీ, అమ్మే వస్తువు లేదా అందించే సేవల్లో నాణ్యత లేకపోతే ఆ సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. 17శాతం అంకుర సంస్థలు నాణ్యత లోపంతోనే మూతపడిపోతున్నాయట. మార్కెట్లో పోటీని తట్టుకోవడం కోసం ఆఫర్లు ప్రకటించి, తక్కువ ధరకే సేవలు అందిస్తే సరిపోదు. నాణ్యత కూడా సంస్థ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తించాలి. ఈ అంశాలపై యాజమాన్యం దృష్టి పెట్టకపోవడం వల్లే అంకుర సంస్థలు మూతపడుతున్నాయని నిపుణులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని