Elephant Lover : మహానుభావుడు.. ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి రాసిపోయాడు!

భారతీయ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’(The elephant whisperers) చిత్రానికి ఇటీవల ఆస్కార్‌ అవార్డు(Oscar award) దక్కింది. ఈ చిత్రంలోని దంపతుల్లానే దిక్కులేని ఏనుగులను(Elephants) ఆదరించే వ్యక్తులు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వారిలో మహమ్మద్‌ అక్తర్‌ ఇమామ్‌ ఒకరు.

Published : 20 Mar 2023 18:06 IST

బిహార్‌(Bihar)కు చెందిన ఓ వన్యప్రాణి సంరక్షకుడు రెండు ఏనుగుల(Elephants) పేరిట ఏకంగా రూ.5కోట్ల విలువైన ఆస్తి రాశాడు. కొన్నాళ్లకు ఆయన హత్యకు గురయ్యాడు. ఇటీవల అనారోగ్యంతో ఓ ఏనుగు కూడా మరణించడంతో ‘రాణి’ అనే ఏనుగు యావదాస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతోంది. కానీ, అనుభవించానికి వీలు కావడం లేదు. ఆ కథేంటో చదివేయండి.

ఏనుగులంటే ప్రాణం..

బిహార్‌(Bihar)లోని జానిపూర్‌కు చెందిన మహమ్మద్‌ అక్తర్‌ ఇమామ్‌ వన్యప్రాణి సంరక్షకుడు. చిన్నప్పటి నుంచి ఆయన రెండు ఏనుగులను పెంచుకున్నాడు. వాటికి మోతి, రాణి అని పేర్లు పెట్టాడు. కుటుంబం కంటే మిన్నగా ఏనుగులను ప్రేమించిన అక్తర్‌ వాటి సంరక్షణ కోసం ‘ఏసియన్‌ ఎలిఫెంట్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ వైల్డ్‌ అనిమల్‌ ట్రస్ట్‌’(ఏఈఆర్‌ఏడబ్లూఏటీ)ను స్థాపించాడు. ఒక వేళ తాను చనిపోయినా వాటి మనుగడకు ఎలాంటి లోటు ఉండకూడదని భావించి తనకున్న రూ.5 కోట్ల విలువైన ఆస్తిని ఏనుగుల పేరు మీద వీలునామా రాశాడు. ఇందుకు ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఒకసారి మోతిని ఓ మావటి తీసుకొని భోజ్‌పుర్‌ జిల్లాకు వెళ్లాడు. అక్కడ దానికి జబ్బు చేసింది. దాంతో అక్తర్‌ అక్కడికి పయనమయ్యాడు. వెళ్లి ఏనుగుకు చికిత్స చేయించాడు. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటుండగా అక్తర్‌ను చంపడానికి కొందరు దుండగులు యత్నించారు. ఆ సమయంలో మోతి ఘీంకరిస్తూ తనను మేల్కొల్పింది. అక్తర్‌ నిద్రలేచే సరికే కిటికీ గదిలో నుంచి ఓ వ్యక్తి తుపాకీ ఎక్కుపెట్టాడు.  అదృష్టవశాత్తూ ఎలాగోలా తప్పించుకోగలిగాడు. ఏనుగు అలా చేయకపోతే తాను బతికే వాడిని కాదంటూ జరిగిన సంఘటనను అక్తర్‌ అప్పట్లో వివరించారు.

ఆస్తి కోసం దారుణ హత్య!

ఈ హత్యాయత్నం ఘటన వెనుక తన కుటుంబ సభ్యులే ఉన్నారని అక్తర్‌ అప్పట్లో ఆరోపించారు. తనను చంపి జంతువుల అక్రమ రవాణా ముఠాకు ఏనుగులను అప్పగించాలనే దురాలోచనతో ఈ పని చేశారని చెప్పారు. 2020లో కొవిడ్‌ నిబంధనలు సడలించిన తరువాత అక్తర్‌ రెండు ఏనుగులను రామ్‌నగర్‌ తీసుకొచ్చారు. అప్పటికే తనను ఎవరైనా హతమారుస్తారని అక్తర్‌కు అనుమానం ఉండేది. ఎందుకంటే భార్య, కుమారులతో అక్తర్‌ విడిపోయారు. ఏనుగుల పేరిట ఆస్తి రాయడం వారికి ఎంత మాత్రం నచ్చలేదు. దాంతో అక్తర్‌ ఊహించిందే నిజమైంది. 2021లో ఆయనను దారుణంగా హత్య చేశారు. అయితే అప్పటికే వీలునామా రాయడంతో ఆస్తి మొత్తం ఏనుగులకు దక్కింది. అక్తర్‌ తన జీవితకాలం మొత్తం ఏనుగు సంరక్షణ కోసం కృషి చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఏనుగుల సంరక్షణ దిశగా చర్యలు తీసుకోకపోతే వాటిని పుస్తకాల్లో బొమ్మలుగా మాత్రమే చూడాల్సి వస్తుందని బాధపడేవారు. 

ఏకైక వారసురాలు రాణి

అక్తర్‌ మరణం తరువాత ఏనుగుల సంరక్షణ బాధ్యతలను స్థానిక అటవీ అధికారులు ఇమ్రాన్‌ఖాన్‌ అనే వ్యక్తికి అప్పగించారు. అక్తర్‌ ఆశయం కోసం ఇమ్రాన్‌ ఇప్పుడు పని చేస్తున్నారు. 35 ఏళ్ల ఏనుగు మోతి గత నెలలో  అనారోగ్యంతో మృతిచెందింది. ప్రస్తుతం రాణికి 25 ఏళ్లు. అక్తర్‌కు ఆస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ప్రస్తుతం రాణి ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఉంటోంది. ఆస్తి పట్నాలో ఉంది. అక్తర్‌ స్థాపించిన ఫౌండేషన్‌ నడుస్తున్నప్పటికీ దానికి సరిపడా నిధులు అందడం లేదు. పట్నాలోని రాణి పేరిట ఉన్న ఆస్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే అక్తర్‌ ఆశయం నెరవేరుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని