Manish sisodia : కేజ్రీవాల్‌కు నమ్మినబంటు మనీశ్‌ సిసోదియా.. ఆది నుంచి ఆప్‌తోనే ప్రయాణం!

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అత్యంత ఆత్మీయుడైన నేత మనీశ్‌ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆప్‌లో, దిల్లీ ప్రభుత్వంలో సిసోదియా ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో చదివేయండి. 

Published : 28 Feb 2023 10:26 IST

ఆమ్‌ ఆద్మీ పార్టీ పేరు చెప్పగానే అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) గుర్తొస్తారు. కానీ, కేజ్రీవాల్ ‘ఆప్‌’ ఇంజిన్‌ను ఇన్ని రోజులు సమర్థవంతంగా నడిపించడానికి ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) అందించిన సహకారం ఎంతో ఉంది. పార్టీ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు కేజ్రీవాల్‌ వెన్నంటే సిసోదియా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక సిసోదియా పనితీరు కారణంగానే మెరుగైన దిల్లీ ప్రభుత్వ పాఠశాలల గురించి దేశం మొత్తం తెలిసింది. అటువంటి సిసోదియా ఇప్పుడు మద్యం కుంభకోణంలో చిక్కుకున్నారు. ఆదివారం ఆయనను విచారణకు పిలిచిన సీబీఐ.. సహకరించడం లేదని అరెస్టు చేసింది. దీనిని ముందుగానే ఊహించిన సిసోదియా ‘అసత్య అరోపణల’పై జైలుకు వెళ్లడానికి తనకు ఎలాంటి భయం లేదని సీబీఐ విచారణకు ముందే ప్రకటన చేశారు. 

తొలి నుంచి కేజ్రీవాల్‌ వెన్నంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన మనీశ్‌ రాజకీయాల్లోకి రాకముందు ఓ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసేవారు. కేజ్రీవాల్‌ నడిపిస్తున్న ఎన్‌జీవో సంస్థ ‘పరివర్తన్‌’ ద్వారా ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. దాంతో ఖాళీ సమయాల్లో ఆ సంస్థకు సేవలందించిన సిసోదియా తర్వాతి కాలంలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం కేజ్రీవాల్‌తో ప్రయాణానికి కేటాయించారు. ఆర్టీఐ, యాంటీ కరప్షన్‌, జన్‌లోక్‌పాల్ ఇలా ప్రతి అంశంలో ఇద్దరూ కలిసి నడిచారు. ఆప్‌(AAP) స్థాపించిన తరువాత కూడా ఈ ఇద్దరే తెరపై ఎక్కువగా కనిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని విధంగా పరాజయం ఎదురైనా సిసోదియా ఆప్‌ నేతల్లో మనోబలం నింపారు. ఇక ఆర్థిక(Finance) మంత్రిగా 2015లో సిసోదియా తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అప్పటివరకు విద్యపై(Education) కేటాయిస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దాంతో దిల్లీ ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి. ఆ విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దిల్లీ బడ్జెట్లో నాలుగో వంతు విద్యాభివృద్ధికి కేటాయిస్తున్నారు. దిల్లీలో అధికారం చేపట్టిన తరువాత ఆప్‌ మోడల్‌ను దేశవ్యాప్తగా విస్తరింపజేయాలనే కేజ్రీవాల్‌ వ్యూహంలో సిసోదియా కీలకంగా పనిచేశారు. 

కీలక శాఖలు సిసోదియా చేతుల్లోనే..

దిల్లీ(Delhi) సీఎంగా కేజ్రీవాల్‌ చలామణిలో ఉన్నప్పటికీ మెజారిటీ పోర్ట్‌ఫోలియోలు మనీష్‌ సిసోదియా చేతుల్లో ఉన్నాయి. ఫైనాన్స్‌, ప్లానింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, లోకల్ బాడీస్‌, ల్యాండ్‌ అండ్‌ బిల్డింగ్స్‌, ఎడ్యుకేషన్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌ అండ్‌ టెక్నికల్ ఎడ్యుకేషన్‌, రెవెన్యూ, సర్వీసెస్‌, విజిలెన్స్‌, కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఇలా బోలెడన్ని శాఖలను సర్వం తానే అయి సిసోదియా నడిపిస్తున్నారు. అంతగా కేజ్రీవాల్‌ ఆయనపై నమ్మకం ఉంచారు. 

ఆప్‌ విస్తరణకు బ్రేక్‌! 

ఆప్‌ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలనే ప్రణాళికను కేజ్రీవాల్‌-సిసోదియాలు కలిసి పక్కాగా అమలు చేయడంతో పంజాబ్‌లో అధికారం దక్కింది. గుజరాత్‌లోనూ సానుకూల పవనాలు వీచినట్లు కనిపించినా ఫలితాల దగ్గరికి వచ్చే సరికి నిరాశ ఎదురైంది. కొద్ది రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో కేజ్రీవాల్‌ వచ్చే నెలలో కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో సిసోదియా అరెస్టు కావడం పార్టీ విస్తరణకు పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సత్యేంద్ర జైన్‌ 8నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. ఈ తరుణంలో సిసోదియా అరెస్టు పార్టీని మరింత తీవ్రంగా నష్టపరిచింది. సాఫీగా సాగిపోతున్న సిసోదియా రాజకీయ ప్రయాణంలో ఈ సీబీఐ అరెస్టు ఓ భారీ కుదుపు అని చెప్పొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని