Robot dog : నిప్పులు చిమ్మే రోబో డాగ్‌.. సినిమా షూటింగ్‌లో వాడొచ్చట!

నిప్పులు చిమ్మే రోబో డాగ్‌లు (Robot dog) త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. వాటిని ఎందుకు అభివృద్ధి చేశారో తెలుసుకోండి. 

Published : 29 Jun 2023 09:55 IST

(Image : Throw Flame)

అమెరికాకు (America) చెందిన ‘త్రో ఫ్లేమ్’ అనే కంపెనీ ఇటీవల తాను అభివృద్ధి చేసిన సరికొత్త రోబోను ప్రదర్శించింది. దాని పేరు ‘థర్మోనేటర్‌’. అది ప్రపంచంలోనే మొట్టమొదటి నిప్పులు చిమ్మే రోబో డాగ్‌ (Robot dog) అని ఆ కంపెనీ ప్రకటించింది. రోబో డాగ్‌లు గత కొన్నేళ్లుగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. చైనా (China) వంటి దేశాలు జంతు ప్రేమికుల కోసం, నిజమైన కుక్కలకు ప్రత్యామ్నాయంగా విభిన్న రకాల రోబో డాగ్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ వైవిధ్యమైన రోబో డాగ్‌ను ఎందుకు రూపొందించారు. అది ఎలాంటి పనులు చేస్తుందో తెలుసుకోండి. 

‘త్రో ఫ్లేమ్’ కంపెనీ మంటలను రప్పించే పరికరాలను ఉత్పత్తి చేస్తుంటుంది. తాజాగా అది ‘థర్మోనేటర్‌’ అనే రోబో డాగ్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడిస్తూ.. దాన్ని ప్రదర్శించింది. ఆ రోబో వీపు భాగంలో అమర్చిన ఫ్లేమ్ త్రోయర్‌ సహాయంతో సుమారు 9 మీటర్ల దూరం వరకు మంటలను వ్యాపింపజేయవచ్చు. మారుమూల ప్రాంతాల్లో నక్కి కూడా దీనిని ఆపరేట్‌ చేయొచ్చని ‘త్రో ఫ్లేమ్’ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

ఎందుకు అభివృద్ధి చేశారు?

ఈ నిప్పులు చిమ్మే రోబో డాగ్‌ వల్ల ఏం ఉపయోగం అనే సందేహం చాలా మందికి వస్తోంది. దీన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ థర్మోనేటర్‌ను ఒక సాధనంగా మాత్రమే తాము అభివృద్ధి చేశామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీనిని వినియోగించి కీటకాల నియంత్రణ, మంచు, హిమపాతాలను కరిగించడం వంటి పనులన్నీ అవలీలగా పూర్తి చేయొచ్చని అంటున్నారు. కొన్ని సినిమా సన్నివేశాలు తీసేందుకు మంటలు అవసరం. ఆ సందర్భంలో మనుషుల ప్రమేయం లేకుండా ఈ రోబోను వాడితే ఎలాంటి ప్రాణ నష్టం ఉండదని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో ‘యూనిట్రీ గో 1’ రోబో డాగ్‌ ధర 3500 డాలర్లు పలుకుతోంది. థర్మోనేటర్‌లో మరిన్ని అదనపు ఫీచర్లున్నాయి. అయితే దాని ధరెంతో కంపెనీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. 

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని