Mood Changers: మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఆహారం!

మానసిక స్థితికి.. ఆహారానికి సంబంధముందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కొంతమంది ఒత్తిడికి గురైతే ఎక్కువ ఆహారం తింటుంటారు.. మరికొందరు అసలు ముద్ద ముట్టరు. అయితే, కొన్ని ఆహార పదార్థాలు తింటే మాత్రం ఒత్తిళ్లు.. అలసట పోయి.. మనసు ఉల్లాసంగా

Updated : 29 Oct 2021 13:12 IST

మానసిక స్థితికి.. ఆహారానికి సంబంధముందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కొంతమంది ఒత్తిడికి గురైతే ఆకలి, రుచి, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అదే పనిగా తింటుంటారు.. మరికొందరు అసలు ముద్ద ముట్టరు. అయితే, కొన్ని ఆహార పదార్థాలు తింటే మాత్రం ఒత్తిళ్లు, అలసట పోయి.. మనసు ఉల్లాసంగా ఉంటుందని, మెదడుపై సానుకూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దాం..!

చేపలు

చేపల్లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. అవి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడతాయి. సాల్మాన్‌, టూనా చేపల్లో ఎక్కువగా ఈ ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి. మెదడు అభివృద్ధి, పనితీరులో, మానస్థిక స్థితి సరిగా ఉంచడంలో ఈ ఆసిడ్స్‌ ముఖ్యపాత్ర వహిస్తాయి.


డార్క్‌ చాక్లెట్‌

డార్క్‌ చాక్లెట్స్‌ తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయి. చాక్లెట్స్‌లో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల ఎండోర్ఫిన్‌ హార్మోన్‌, సెరోటోనిన్‌ అనే మోనోఅమైన్‌ న్యూరోట్రాన్స్‌మీటర్‌ విడుదలవుతాయి. వీటి వల్ల మానసిక ఉల్లాసం, సంతోషం కలుగుతుంది.


అరటిపండ్లు

అరటిపండ్లలో విటమిన్‌ బి6 ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్‌, సెరోటోనిన్‌ న్యూరోట్రాన్స్‌మీటర్ల విడుదలకు దోహదపడతాయి. ఈ రసాయనాలు మెదడు, శరీరం చురుగ్గా ఉండేలా చేస్తాయి. మానస్థిక స్థితిని నియంత్రణలో ఉంచి.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అరటిపండ్లు రక్తంలోని చెక్కరస్థాయిలను సైతం నియంత్రిస్తాయి.


నట్స్‌

బాదం.. జీడిపప్పు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉదయం, సాయంత్రం, అర్ధరాత్రి వేళ అల్పాహారంగా తినొచ్చు. జీడిపప్పు.. నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించి.. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. బాదం వల్ల మెదుడకు సంబంధించే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. బాదంతో మెదడు పనితీరు మెరుగుపడటంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుపై సానుకూల ప్రభావం చూపి, ఒత్తిళ్లను దూరం చేస్తుంది. పార్కిన్సన్‌, అల్జిమర్స్‌ వంటి మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది. 


ఓట్స్‌

ఓట్స్‌లో మెగ్నీషియం ఉంటుంది. దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా ఒత్తిడికి గురికాకుండా మానసిక స్థితి నియంత్రణలో ఉంటుంది. వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండగలుగుతారు. రాత్రిపూట పడుకునే ముందు వీటిని తినడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని