Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?

అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు.

Updated : 23 Mar 2024 12:40 IST

(Photo Credit:@Subhajit)

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మానవాళిపై దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు బెంగళూరు నగరంలో ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం. ఒకప్పుడు ఈ నగరంలో బావుల వినియోగం ఎక్కువగా ఉండేది. క్రమేపీ బోర్లు పెరగడం, నగర విస్తరణలో బావులు ఆక్రమణలకు గురవ్వడంతో ఇప్పుడు నీటి కటకటతో జనం అల్లాడుతున్నారు. బెంగళూరులో దుస్థితి ఇలా ఉంటే.. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ముంబయి నగరంలో ఇంకో రకమైన పరిస్థితి. ఇక్కడ ఏటా వర్షపాతం ఎక్కువగా ఉన్నా.. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటంతో మిలియన్ల లీటర్ల నీర్లు వృథాగా పోతోంది. ఈ పరిస్థితిని గమనించిన ఐఐటీ పట్టభద్రుడు ఒకరు తక్కువ ఖర్చుతో ఇంట్లోనే వర్షపు నీటిని సంరక్షించే ప్రక్రియకు నడుం బిగించారు. కేవలం ప్లాస్టిక్ డ్రమ్ము, పీవీసీ పైప్‌ల సాయంతో భూగర్భ జలాలను కాపాడేందుకు గత కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. 

ముంబయికి చెందిన సుభజిత్ ముఖర్జీ (Subhajit Mukherjee) ఐఐటీ బాంబే నుంచి ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. నీటి వృథా గురించి ఒకానొక సందర్భంలో మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ తనతో పంచకున్న ఆలోచనకు కార్యరూపం ఇస్తూ తక్కువ ఖర్చుతో ‘రెయిన్‌ వాటర్‌ హర్వెస్టింగ్‌’ను రూపొందించినట్లు తెలిపారు. అంతేకాకుండా భూగర్భ జలాలను పెంచేందుకు  ‘గ్రీన్‌ ముంబయి’ పేరిట ఓ ఎన్జీవోను నెలకొల్పి వేలాది మంది పాఠశాల విద్యార్థులతో కలిసి కృషి చేస్తున్నారు. హౌసింగ్ సొసైటీలు, పాఠశాలలు, పార్కులు తదితర ప్రదేశాల్లో కేవలం రూ.2,500 ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సుభజిత్‌ డిజైన్‌ చేసిన సిస్టమ్‌ను ఎలా ఏర్పాటు చేయాలో చూద్దాం.

  • పట్టణాల్లో చాలా మంది ఇళ్లలో నీటి నిల్వ కోసం ప్లాస్టిక్‌ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. అలాంటి డ్రమ్ము ఒకదాన్ని తీసుకొని దాని చుట్టూ పైనుంచి కింద వరకు రంధ్రాలు చేయాలి. 
  • తర్వాత ఇంటి పరిసరాల్లో 3×3 లేదా 5×5 అడుగుల గొయ్యిని తవ్వాలి. అందులో రంధ్రాలు చేసిన డ్రమ్మును ఉంచాలి. ఆ డ్రమ్ము పై భాగంలో రంధ్రం చేసి అందులో పీవీసీ పైపును ఉంచాలి. మరోవైపు ఇంటి పైనుంచి వాన నీరు పైపులోకి వచ్చేలా కనెక్షన్‌ ఇవ్వాలి. 
  • తర్వాత గుంతలో ఉన్న డ్రమ్ము చుట్టూ పైభాగం వరకు కంకర రాళ్లు లేదా ఇతర రాళ్లతో నింపాలి. వర్షం పడిన ప్రతిసారీ పైపు నుంచి నీరు డ్రమ్ము ఉన్న గుంతలోకి చేరుతుంది. దాంతోపాటు చుట్టుపక్కల వాన నీరు కూడా అందులోకి చేరి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని సుభజిత్‌ తెలిపారు. 
  • ఇదే కాకుండా భూమిలో పది రోజులపాటు నీటిని నిల్వ చేసే విధానాన్ని కూడా సుభజిత్‌ అభివృద్ధి చేశారు. అయితే, వీటిని తాగడానికి మినహా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దీని ఏర్పాటుకు రూ. 2,500 నుంచి రూ.5,000 ఖర్చవుతుందని ఆయన వివరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని