హనీమూన్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులు చేయకండి!

ఆనందంగా.. అన్యోన్యంగా ఉండాలి అనుకుంటూ ఎన్నో ఆశలతో యువతీయువకులు వివాహజీవితంలోకి అడుగుపెడుతుంటారు. పెళ్లిముందు ఎలా ఉన్నా.. వివాహమయ్యాక భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండాలి. అయితే, ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా సంతోషంగా ఉండాలంటే ఒకరి

Published : 07 Mar 2021 10:18 IST

ఆనందంగా.. అన్యోన్యంగా ఉండాలి అనుకుంటూ ఎన్నో ఆశలతో యువతీయువకులు వివాహజీవితంలోకి అడుగుపెడుతుంటారు. పెళ్లిముందు ఎలా ఉన్నా.. వివాహమయ్యాక భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండాలి. అయితే, ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా సంతోషంగా ఉండాలంటే ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకు హనీమూన్‌ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కానీ, కొందరు జీవిత భాగస్వామి ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తూ అసంతృప్తికి గురి చేస్తారు. దీంతో ఎంత డబ్బు పెట్టి, ఎంత మంచి ప్రాంతానికి వెళ్లినా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. కాబట్టి.. అలా జరక్కుండా ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు. అవేంటంటే..

ఒక్కరే ప్రణాళిక వేయొద్దు

సర్‌ప్రైజ్‌ చేద్దామనో లేక పురుషహంకారంతోనో భార్యకు చెప్పకుండా హానీమూన్‌ ప్లాన్‌ చేయకండి. మీకు నచ్చిన ప్రాంతం.. మీ భార్యకు నచ్చకపోవచ్చు. మీరు విమానంలో వెళ్లాలనుకుంటే.. మీ భార్య రైలు ప్రయాణాన్ని ఇష్టపడొచ్చు. మీకు ఇది వరకే మీ జీవిత భాగస్వామి ఇష్టాలు తెలిసి ఉంటే పర్వాలేదు. కానీ, వారి ఇష్టాలను తెలుసుకోకుండా మీకు నచ్చిన ప్రాంతానికి, ప్రయాణానికి టిక్కెట్లు బుక్‌ చేస్తే వారు అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. అందుకే.. ఇద్దరూ చర్చించుకొని ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోండి. హనీమూన్‌కు వెళ్లండి.


బోర్‌ కట్టించే పనులు చేయొద్దు

హనీమూన్‌కు వెళ్లిన చోట సందర్శక ప్రాంతాలను, ప్రత్యేకతలను కచ్చితంగా చూడాల్సిందే. అయితే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని, సమయాన్ని కేటాయించుకొని వెళితే మంచింది. లేకపోతే ఇద్దరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉదాహరణకు మీకు కొత్త రుచులు చూడటం ఇష్టం అనుకోండి.. వీధుల్లో కనిపించే ప్రతిదాన్ని తినడానికి ప్రయత్నిస్తారు. మీ జీవితభాగస్వామికి వంటకాల రుచులు చూసే ఇష్టం లేకపోయినా మీ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. దీంతో వారికి బోర్‌ కొట్టొచ్చు. ఒకవేళ.. మీ భార్య షాపింగ్‌ చేస్తుందనుకోండి.. ఆ సమయంలో షాపింగ్‌ పూర్తయ్యే వరకు మీరు వేచి చూడాల్సి ఉంటుంది. అందుకే చేయబోయే పనులకు సమయం కేటాయించుకొని బయటకు వెళ్తే ఏ సమస్యా ఉండదు.


తగినంత సమయం కేటాయించండి..

హనీమూన్‌ వెళ్లడానికి వీలైనన్నీ ఎక్కువ రోజులు కేటాయించండి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు భార్యాభర్తలకు వ్యక్తిగత సమయం అవసరం. కొన్ని సార్లు హనీమూన్‌కు వెళ్లిన ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలను సందర్శించాల్సి రావొచ్చు. చూడాల్సినవి.. వెళ్లాల్సినవి అన్ని పూర్తయినా.. కేవలం విశ్రాంతి తీసుకోవడం కోసం మరో రోజు అక్కడే ఉండండి. హనీమూన్‌ ఎలా జరిగిందో మాట్లాడుకోండి. మరోసారి చూడాలనిపించే ప్రాంతాలను చూసిరండి. అప్పుడే హనీమూన్‌ సంతృప్తికరంగా ఉంటుంది.


ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త

కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు వివిధ ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులు తారసపడుతుంటారు. వారితో మాట్లాడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. కేవలం సంభాషణ అయితే ఫర్వాలేదు.. కానీ, మితిమీరి చనువుగా మాట్లాడే ప్రయత్నం చేస్తే జీవిత భాగస్వామి నొచ్చుకోవచ్చు. ఇతరులతో మీ సంభాషణలు మీ భార్య/భర్తకు కోపం తెప్పించేలా ఉండకుండా జాగ్రత్త పడండి.


భయాలుంటే ముందే చెప్పండి

పర్యటక ప్రాంతాల్లో సాధారణంగా సాహస కార్యక్రమాలు బాగానే ఉంటాయి. ప్రాంతాలను బట్టి కొండలు ఎక్కడం, బోటింగ్‌ చేయడం, పారాగ్లైండింగ్‌ వంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీటిలో ఏది చేయడానికి మీకు భయంగా అనిపించినా ముందుగానే జీవితభాగస్వామికి తెలపండి. అక్కడి వరకు వెళ్లి నేను రాలేను.. నాకు భయం అని చెబితే.. జంటగా చేయాలని కోరుకున్న వారు ఒంటరిగా చేయాల్సి ఉంటుంది. దీంతో వారి మనసు బాధపడుతుంది.


లెక్కలు చూసుకోకండి..

హనీమూన్‌ అంటేనే మొత్తం ఖర్చుతో కూడుకున్నది. ప్రయాణాలతో మొదలుపెట్టి.. హోటళ్లలో బస, భోజనం, షాపింగ్‌ ఇలా అన్నింటికి డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. కాబట్టి.. హనీమూన్‌కు ముందే మీరు ఎంత ఖర్చు పెట్టగలరో లెక్క తేల్చుకొని అందుకు తగ్గట్టుగా హనీమూన్‌ ప్లాన్‌ చేసుకోండి. అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బు ఖర్చవుతుందని బాధపడుతూ.. ప్రతీది లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే.. హనీమూన్‌కు అర్థం ఉండదు. అందుకే, అనుకున్న దానికన్న ఇంకొంత ఎక్కువ డబ్బు వెంట ఉంచుకోవడం మంచిది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని