Andreas Cahling : ‘థోర్‌’ @ 70.. తాత మిస్టర్‌ ఫిట్‌

ప్రముఖ బాడీ బిల్డర్‌ ఆండ్రియాస్‌ కాలింగ్‌ తనకు వయసు మీద పడుతున్నా ఉత్సాహంగా కండలు పెంచుతున్నారు.

Updated : 08 Mar 2023 10:28 IST

(Image : Andreas Cahling insta)

బాడీ బిల్డింగ్‌(body building) పేరు చెప్పగానే ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌(arnald schwarzenegger) గుర్తుకొస్తారు. ఆండ్రియాస్‌ కాలింగ్‌ ఆయన సమకాలీకుల్లో ఒకరు. ఎన్నో బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన ఈ కండల తాత ఇప్పటికీ తన శరీరంపై పట్టు సడలకుండా చూసుకుంటున్నారు. 

ఎవరీ ఆండ్రియాస్‌?

ప్రపంచంలోని ప్రసిద్ధ బాడీబిల్డర్లలో ఆండ్రియాస్‌ కాలింగ్‌ ఒకరు. చిన్నవయసులోనే బాడీ బిల్డింగ్‌ వైపు అడుగులు వేసిన అండ్రియాస్‌ ప్రస్తుతం 70వ పడిలోకి అడుగుపెట్టినా దాన్ని వీడలేదు. ఈయన కేవలం బాడీ బిల్డింగ్‌ మాత్రమే కాదు... జూడో, రెజ్లింగ్‌ క్రీడల్లోనూ సత్తా చాటి తానేంటో ప్రపంచానికి తెలియజేశాడు.

ఆండ్రియాస్‌ స్వీడన్‌(sweedan)లో జన్మించారు. 11 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్‌(wrestling)లో శిక్షణ తీసుకున్నారు. ఫ్రీస్టైల్‌, గ్రీకో-రోమన్‌ రకాల రెజ్లింగ్‌లో ఆయన ఆరితేరారు. 17 ఏళ్ల వయసులో జపాన్‌(japan) వెళ్లి అక్కడ అనేక జూడో పోటీల్లో పాల్గొన్నారు. జపాన్‌ ఆండ్రియాస్‌కు బాగా నచ్చడంతో అక్కడే ఉండి జపనీస్‌ భాష నేర్చుకున్నారు. ఒసాకాలోని ఓ జర్మన్‌ బార్‌లో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో రెజ్లింగ్ సాధన చేశారు. రెజ్లింగ్‌కు జపాన్‌లో మంచి ఆదరణ ఉండటంతో మోమోయామా యూనివర్సిటీ తరపున పోటీల్లో పాల్గొన్నారు. క్రమంగా సీనియర్‌ లెవెల్లోకి వెళ్లారు. కానీ ఆండ్రియాస్‌ నాకౌట్‌ అయ్యారు. ఆ తరువాత స్వీడన్‌ తిరిగి వచ్చిన ఆండ్రియోస్‌ స్వీడిష్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని యూత్ టైటిల్‌ గెలిచారు. ఈ క్రమంలోనే ఆండ్రియాస్‌కు బాడీబిల్డింగ్‌ ప్రాముఖ్యత తెలిసింది. ఏ ఆట గెలవడానికి అయినా శరీర సౌష్టవం ముఖ్యమని ఆయన గ్రహించారు.

బాడీ బిల్డింగ్‌ వైపు అడుగులు

అమెరికా(america)లో 70వ దశకంలో బాడీ బిల్డింగ్‌కు విశేష ఆదరణ ఉండేది. దాంతో ఆండ్రియాస్‌ అమెరికా పయనమయ్యారు. కాలిఫోర్నియా పరిధిలోని లాంగ్‌బీచ్‌ పట్టణంలో ప్రసిద్ధి చెందిన గోల్డ్‌ జిమ్‌(zym)లో చేరాలని నిర్ణయించుకున్నారు. విమానం దిగిన రెండు గంటల్లోనే ఆండ్రియాస్‌ జిమ్‌ దగ్గర వాలిపోయారంటే.. ఆయన తాను చేయాల్సిన పని గురించి ఎంత కసిగా ఆలోచించేవారో అర్థమవుతుంది. అలా జిమ్‌లో అడుగుపెట్టిన ఆండ్రియాస్‌ బాడీబిల్డింగ్‌లో పేరొందిన ఆర్నాల్డ్, రిక్‌ డ్రాసిన్‌ తదితర ప్రముఖులతో కలిసి శిక్షణ పొందారు. మంచి కండలు తిరిగిన దేహం సొంతం చేసుకోవడంతో ఆండ్రియాస్‌ ఫొటోలు కొన్ని ప్రసిద్ధ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. దాంతో అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్‌(fitness) ప్రకటనల్లో నటించి ఆండ్రియాస్‌ మంచి ఆదాయం గడించారు.

(Image : Andreas Cahling insta)

వరుసగా పోటీల్లో నిలిచి..

అద్భుతమైన ఫిట్‌నెస్‌ సాధించిన ఆండ్రియాస్‌ 1976లో నిర్వహించిన మిస్టర్‌ వెనిస్‌ బీచ్‌ పోటీల్లో తొలిస్థానం కైవసం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది ఇంటర్నేషనల్ ఫెడరేషన్‌ ఆఫ్‌ బాడీ బిల్డింగ్‌ అండ్‌ ఫిట్‌నెస్‌(IFBB) నిర్వహించిన మిస్టర్‌ వరల్డ్‌ పోటీల్లో ఆయనకు రెండో స్థానం దక్కింది. 1978లో ఐఎఫ్‌బీబీ మిస్టర్‌ వరల్డ్‌ అమెచూర్‌లో 5 స్థానంలో నిలిచారు. అదే ఏడాది ఐఎఫ్‌బీబీ మిస్టర్‌ ఇంటర్నేషనల్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో ఆండ్రియాస్‌ నిరాశ చెందలేదు. మరింతగా కష్టపడ్డారు. ఫలితంగా 1979లో ఐఎఫ్‌బీబీ మిస్టర్‌ ఇంటర్నేషనల్‌లో రెండో స్థానంలో నిలిచారు. అలా వరుసగా పోటీల్లో పాల్గొంటూ ఆండ్రియాస్‌ 1980లో ఐఎఫ్‌బీబీ మిస్టర్‌ ఇంటర్నేషనల్‌లో తొలిస్థానం దక్కించుకున్నారు. తన జీవితాన్ని బాడీబిల్డింగ్‌ పోటీలకు అంకితం చేసిన ఆయన 59 ఏళ్ల వయసులో.. 2012 ఐఎఫ్‌బీబీ మాస్టర్స్‌ ఒలింపియా&ప్రో వరల్డ్‌లో పాల్గొని 16వ స్థానం పొందారు.

కుంగ్‌ ఫురీ’.. ‘థోర్‌’ 

బాడీ బిల్డింగ్‌లో తన విజయానికి జన్యుపరమైన హార్మోన్లు ఎక్కువ దోహదం చేశాయని ఆండ్రియాస్‌ చెబుతారు. పోషకాహారం తీసుకుంటూ వ్యాయాయం చేయడంతోపాటు సానుకూల దృక్పథంతో ఉండేవాడినని ఆయన వివరించారు. కొత్త ఖరీదైన కారు కొన్నప్పుడు దాన్ని ఎలా చూసుకుంటామో.. నిత్యం మనల్ని నడిపిస్తున్న శరీరానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. ఆండ్రియాస్‌ ఫిట్‌నెస్‌ చూసి ముగ్ధులైన వారు అనేక మంది ఉన్నారు. దర్శకుడు డేవిస్‌ సాండ్‌బర్గ్స్‌ తాను తీసిన ‘కుంగ్‌ ఫురీ’లో ఆండ్రియాస్‌కు ‘థోర్‌’ పాత్ర ఇచ్చారు. 

ముఖం వంకర పోయి..

ఇంత ఆరోగ్యకరమైన జీవితం గడిపిన ఆండ్రియాస్‌కు స్ట్రోక్‌ వచ్చిందనే వదంతులున్నాయి. ఎందుకంటే ఆయన ముఖం ఎడమ వైపు కొద్దిగా పక్కకు జరిగి ఉంటుంది. దానిపై స్పందించిన ఆండ్రియాస్‌ తనకు ఓ సమయంలో ట్యూమర్‌ వచ్చిందని తెలిపారు. వైద్యులు ట్యూమర్‌ను తొలగించే క్రమంలో ముఖంలోని నరాలు దెబ్బతినడంతో అలా పక్కకు జరిగిందని వివరించారు. 

ఇప్పటికీ మిస్టర్‌ ఫిట్‌నెస్‌

ప్రస్తుతం ఆండ్రియాస్‌ వయసు 70ఏళ్లు. ఇప్పటికీ ఆయన ఎనిమిది పలకల దేహాంతో కనిపిస్తున్నారు. శరీరం ఏం చెబుతుందో వింటూ దానికి కావాల్సిన సహజమైన పోషకాలను అందిస్తే ఆరోగ్యకరమైన జీవనం సొంతమవుతుందని ఆయన చెబుతున్నారు. నిరంతరం ఒకే రకమైన వ్యాయామాలు కాకుండా కాస్త భిన్నంగా సాధన చేస్తే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాడీబిల్డింగ్‌ మాత్రమే కాకుండా అండ్రియాస్‌ తన మెదడును ప్రశాంతంగా ఉంచడానికి డ్యాన్స్‌, సైక్లింగ్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌(instagram), ఓన్లీ ఫ్యాన్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తన వర్కౌట్లకు సంబంధించిన విషయాలను పోస్ట్‌ చేస్తూ ఉన్నారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని