American Road Trip : పందెం కట్టి కారుతో సాహస యాత్ర.. 120 ఏళ్ల కిందటి ఘనత ఇది!

ఆ అమెరికా (America) వైద్యుడికి (Doctor) ఆటోమొబైల్ (Automobile) రంగంపై విపరీతమైన నమ్మకం.  అందుకే కార్ల (Cars) సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలియజేస్తానని పందెం కాశాడు. 120 ఏళ్ల కిందటే ఓ సాహస యాత్ర చేసి చరిత్ర సృష్టించాడు.

Updated : 29 May 2023 15:49 IST

అమెరికా (America) మ్యాప్‌ను గమనిస్తే శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco) ఓ చివర.. న్యూయార్క్‌ (New York) మరో చివర ఉంటాయి. 120 ఏళ్ల కిందట ఓ వైద్యుడు ఈ రెండు నగరాల మధ్య కారు ప్రయాణం చేసి సంచలనం సృష్టించాడు. ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోండి. 

50 డాలర్ల పందెం

అమెరికాలో కార్ల విక్రయాలు అప్పుడప్పుడే ఊపందుకుంటున్నాయి. 1900వ సంవత్సరంలో 8000 కార్లు ఉంటే 1903 నాటికి ఆ సంఖ్య 32,920కి చేరింది. అప్పటికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కార్లు తిరగడానికి అనువైన రోడ్లు ఉన్నాయి. అలాంటి సమయంలో గుర్రపు బగ్గీల కన్నా కార్లు మెరుగైనవని హరేషియో నెల్సన్‌ జాక్సన్‌ అనే వ్యక్తి వాదించాడు. తన వాదనను నిరూపించడానికి 50 డాలర్ల పందెం కాసి ఓ అరుదైన సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. 

హరేషియో నెల్సన్‌ జాక్సన్‌ ఒక వైద్యుడు. ఆయన సోదరుల్లో ఒకరు బర్లింగ్టన్‌ మేయర్‌గా, మరొకరు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా పని చేశారు. జాక్సన్‌కు మొదట్నుంచీ ఆటోమొబైల్‌ రంగంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ క్లబ్‌లో కూర్చొని సరదాగా మాట్లాడుతూ కార్ల సామర్థ్యం గురించి ఓ పందెం కాశాడు. అదేంటంటే అమెరికా మ్యాప్‌లో ఈ చివరన ఉన్న శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆ చివరన ఉన్న న్యూయార్క్‌ వరకు కారులో ప్రయాణించడం. అప్పటికి తన వద్ద కారు లేదు. సరిగా డ్రైవింగ్‌ రాదు. పైగా ఆ యాత్ర చేయడానికి తోడ్పడే మ్యాప్‌ కూడా అందుబాటులో లేదు.

కొత్త కారుతో సరికొత్త ప్రయాణం

ఈ సాహస యాత్ర విషయంలో తనకు సహాయం చేయాలని జాక్సన్‌..  సువెల్‌ కె. క్రాకర్‌ను సంప్రదించాడు. ఆయన ఓ మెకానిక్‌. పైగా తనకు డ్రైవింగ్‌ కూడా వచ్చు. అతడి సలహా మేరకు జాక్సన్ ‘1903 మోడల్‌ వింటన్‌’ కారు కొనుగోలు చేశాడు. రెండు సిలిండర్లు, 20 హార్స్‌పవర్‌ సామర్థ్యంతో నడిచే ఆ కారుకు ‘ది వెర్మోంట్‌’ అని పేరు పెట్టాడు. కొత్తగా కొన్న కారులో మే 23న వారిద్దరూ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరారు. ఆ వాహనంలో స్లీపింగ్‌ బ్యాగ్స్‌, దుప్పట్లు, దుస్తులు, గొడ్డలి, పార, కొడాక్‌ కెమెరా, టెలిస్కోప్‌, రైఫిల్‌, షాట్‌గన్‌, స్పేర్‌ పార్ట్స్‌, ఇంధనం క్యాన్లు ఇలా మొత్తం సరంజామా సర్దిపెట్టారు. 

అడుగడుగునా అవాంతరాలు

తొలిసారి ప్రయాణం చేస్తున్నప్పటికీ వారికి కొన్ని ప్రాంతాలపై ముందే అవగాహన ఉంది. అందుకే ఎడారి ప్రాంతాలైన నెవడా, యూటా గుండా ప్రయాణం చేయొద్దని నిశ్చయించుకున్నారు. అలాగే సియెర్రా నెవడాలోని ఎత్తయిన ప్రాంతాలు, పర్వతాలకు వెళ్లొద్దని అనుకున్నారు. అలా యాత్ర ప్రారంభమై 15 మైళ్లు దాటిందో లేదో కారు టైరు ఒకటి పాడైంది. దాంతో స్పేర్‌గా ఉన్న మరో టైరు తగిలించి ముందుకు సాగారు. శాక్రమెంటో నగరం చేరుకోగానే ఓ మహిళ వారిని తప్పు దోవ పట్టించింది. సుమారు 108 మైళ్లు వెళ్లిన తరువాత అది సరైన మార్గం కాదని వారు గ్రహించారు. ఇక ఒరెగాన్‌ మార్గంలో అనేక సార్లు టైర్లు పంక్చర్‌ అయ్యాయి. ఏం చేయాలో పాలుపోక చక్రాల చుట్టూ తాడు చుట్టుకొని మరీ ముందుకు సాగేవారు. కొన్ని సార్లు ఇంధనం అయిపోతే నడుచుకుంటూ లేదా సైకిల్‌పై వెళ్లి తెచ్చుకునేవారు. స్పేర్‌ పార్ట్స్‌ కోసం కూడా ఇదే పద్ధతిని అనుసరించారు.

మీడియా దృష్టిలో పడ్డారు!

ఐడహో వద్దకు రాగానే వారు ఒక బుల్‌ డాగ్‌ను తమ ప్రయాణంలో తోడుగా చేర్చుకున్నారు. దానికి బడ్‌ అని పేరు పెట్టారు. ఆ శునకం కళ్లలో దుమ్ము పడకుండా కళ్లద్దాలు పెట్టి తీసుకెళ్లేవారు. ఈ చర్య మీడియాను ఆకర్షించింది. దాంతో జాక్సన్‌, క్రాకర్‌, బడ్‌ సెలబ్రిటీలుగా మారిపోయారు. ఎక్కడికెళ్లినా వీరిని మీడియా, చుట్టుపక్కలి జనాలు వింతగా చూడటం ప్రారంభించారు. ఇన్ని అడ్డంకులు దాటుతున్న క్రమంలో ఓ చోట నగదు పోగొట్టుకున్నారు. అందువల్ల సుమారు 36 గంటలపాటు ఏమీ తినకుండానే ప్రయాణించాల్సి వచ్చింది. మిస్సిసిపి దాటిన తరువాత వారి కష్టాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అక్కడి నుంచి మెరుగైన రహదారులు ఉండటంతో ప్రయాణం సాఫీగా సాగిపోయింది.

అమెరికా చరిత్రలో అరుదైన రికార్డు

అలా 63 రోజులు ప్రయాణం చేసి జులై 26న వీరు న్యూయార్క్‌ చేరుకున్నారు. దాంతో ఇది అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ‘క్రాస్‌ కంట్రీ రోడ్ ట్రిప్‌’గా రికార్డుకెక్కింది. యాత్ర మొత్తానికి జాక్సన్‌కు 8వేల డాలర్లు ఖర్చయింది. మూడు వేల లీటర్ల ఇంధనం వాడారు. అయితే జాక్సన్‌ తాను పందెం కాసిన 50 డాలర్ల గురించి తరువాత పట్టించుకోలేదు. ఈ యాత్ర ముగిసిన తరువాత జాక్సన్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. విశిష్ట సేవలందించి కొన్ని మెడల్స్‌ పొందాడు. ఆ తరువాత ఒక వ్యాపార వేత్తగా ఎదిగాడు. 1944లో తన కారును స్మిత్‌సోనియన్‌ సంస్థకు విరాళంగా ఇచ్చాడు. దాన్ని వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఆమెరికన్‌ హిస్టరీలో ప్రదర్శనకు ఉంచారు. డ్రైవర్‌గా, మెకానిక్‌గా సేవలందించిన క్రాకర్‌ 1913లోనే మరణించాడు. అప్పటికి అతని వయసు 30 సంవత్సరాలు. తరువాతి కాలంలో వీరిని అనుసరిస్తూ అనేక మంది ఇలాంటి యాత్రలు చేయడం ప్రారంభించారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని