Plane crash : అంతు చిక్కని మిస్టరీ.. ఆ విమానాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు!
లోహ విహంగాలు (Planes) గాల్లో ఎగిరిన తొలినాళ్లలో అవి ప్రమాదానికి గురయితే ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారేది. అలా ఇప్పటిదాకా జాడ లేకుండా పోయిన కొన్ని విమాన ప్రమాదాల (Plane crashes) గురించి తెలుసుకోండి.
ఇటీవల అమెజాన్ అడవుల్లో (Amazon forest) జరిగిన ఓ విమాన ప్రమాదం (Plane crash) వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రమాదం జరిగిన వెంటనే ‘ఆపరేషన్ హోప్’ పేరిట అడవిని జల్లెడ పట్టి 16 రోజుల తర్వాత విమాన శకలాలను గుర్తించారు. పైలట్, మహిళ, గైడ్ మరణించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. అదే విమానంలో ప్రయాణించిన మరో నలుగురు చిన్నారులు బతికే ఉన్నారన్న ఆశతో అడవిని జల్లెడ పట్టారు. సుమారు 40 రోజులు తర్వాత ఎట్టకేలకు చిన్నారుల ఆచూకీ తెలిసింది. వారంతా క్షేమంగా ఉండటం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనే ఒక విమానం జాడ కనుగొనడానికి 16 రోజులు పట్టింది. మరి అవేవీ లేని కాలంలో గల్లంతైన ఆ విమానాలు ఏమైపోయాయి? అందులో ప్రయాణించిన వారి ఆచూకీ తెలిసిందా? లేదా? పరిశీలించండి.
క్యాంప్‌బెల్ ఎయిర్‌షిప్
విమానాల కంటే ముందు ఎయిర్‌షిప్‌లు గాల్లో ఎగురుతున్న కాలం అది. ఆ ఎయిర్ షిప్ పేరు క్యాంప్‌బెల్. ఓ గాలిబుడగ తరహాలో ఉండే ఆ విమానాన్ని 1880 ప్రాంతంలో పీటర్ క్యాంప్‌బెల్ అనే వ్యక్తి రూపొందించాడు. విమానంలాగే ఇదీ తొలినాళ్లలో విజయవంతంగా గాల్లో ప్రయాణించలేకపోయింది. 1889వ సంవత్సరం జులై 16న ఎడ్వర్డ్ డి. హోగన్ అనే ప్రొఫెసర్ ప్రదర్శనకు ఉంచిన ఎయిర్ షిప్‌ను నడుపుతూ న్యూయార్క్ నగరం నుంచి బయలుదేరాడు. ఆ ఎయిర్‌షిప్ చివరిసారి ఉత్తర అట్లాంటిక్ మీద ఎగురుతూ కనిపించింది. తరువాత నుంచి దాని ఆచూకీ తెలియరాలేదు. అది అట్లాంటిక్ సిటీ సమీపంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి ఎయిర్‌షిప్ చాలా పెద్దగా ఉంటుంది. అయినా ఇప్పటివరకు దాని జాడ గానీ, పైలట్ మృతదేహం కానీ దొరకలేదు.
సెసిల్ గ్రేస్ విమానం
1903లో రైట్ బ్రదర్స్ విమానాన్ని నిర్మించి, దాన్ని విజయవంతగా గాల్లో చక్కర్లు కొట్టించారు. ఇది జరిగిన ఏడేళ్ల తరువాత సెసిల్ గ్రేస్ అనే వైమానికుడు బారన్ డి ఫారెస్ట్ పోటీలో పాల్గొన్నాడు. ఈ పోటీలో పాల్గొనే వారు ఇంగ్లాండ్ నుంచి ఐరోపాలోని మిగిలిన ప్రాంతాలకు వీలయినంత ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. గెలుపొందిన వారికి 2వేల పౌండ్లు బహుమతిగా ఇస్తారు. ఈ ప్రయత్నం చేసి చాలా మంది వైమానికులు అప్పటికే విఫలమయ్యారు. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సెసిల్ బరిలోకి దిగాడు. 1910వ సంవత్సరం డిసెంబర్ 22న అతడు ఇంగ్లాండ్ నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లగానే బలమైన వేడిగాలులు వీచాయి. దాంతో తాను ముందుకెళ్లడం అసాధ్యమని భావించిన సెసిల్ ఫ్రాన్స్‌లోని ఓ తీరంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. అక్కడ భోజనం చేసి తిరిగి ఇంగ్లాండ్‌కు వెనుదిరిగాడు. 40 నిమిషాల తరువాత అతడి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. మొదట ఆ పైలట్ ఒక చోట ల్యాండ్ అయ్యాడని వార్తలు వినిపించాయి. కానీ, చివరకు 1911 మార్చి 14న అతడి టోపీ, కళ్లద్దాలు బెల్జియంలోని ఓస్టెండ్ తీరానికి కొట్టుకొచ్చాయి. మరికొన్ని రోజుల తరువాత సెసిల్ మృతదేహం కనుగొన్నారు. అయితే విమానం ఏమైందో, ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ తెలియరాలేదు.
ఆల్బర్ట్ జువెల్స్ విమానం
ఆల్బర్ట్ జువెల్స్ 1886లో అమెరికాలో జన్మించాడు. ఏరో క్లబ్ ఆఫ్ అమెరికా నుంచి 1913లో పైలట్ లైసెన్స్ పొందాడు. ఆ తరువాత కొన్ని నెలలకే అమెరికన్ ఏరియల్ డెర్బీ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. విమానాన్ని కనుగొని పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రేసు ఇది. మోయిసాంట్ బ్లెరియట్ మోనోప్లేన్‌తో అతడు రంగంలోకి దిగాడు. ఎలాగైనా రేసులో విజయం సాధించాలనే పట్టుదలతో స్టాంటన్ ఐలాండ్ నుంచి బయలుదేరాడు. కొద్ది సేపటికే విమానం సముద్రంలో మునిగిపోయింది. చివరిసారి ఆ విమానాన్ని ఓ మత్స్యకారుల నౌక కెప్టెన్ చూశాడు. ఆ తరువాత నుంచి పైలట్, విమానం ఆచూకీ లభించలేదు.
అమెలియా ఇయర్‌హార్ట్-లాక్‌హీడ్ ఎలక్ట్రా 10 ఈ
1937లో అమెలియా ఇయర్‌హార్ట్ తన సహాయకుడు ఫ్రెడ్ నూనన్‌తో కలిసి ‘లాక్‌హీడ్ ఎలక్ట్రా 10 ఈ’ విమానంలో ఓక్లాండ్ నుంచి బయలుదేరింది. ప్రపంచాన్ని చుట్టి రావాలనే బలమైన కోరికతో వారు ఆ ప్రయాణం మొదలుపెట్టారు. నెలలోపే ఆస్ట్రేలియా సమీపంలోని న్యూగినియా చేరుకున్నారు. అప్పటికే 22 వేల మైళ్లు సాగిన ప్రయాణం.. మరో 7 వేల మైళ్లు వెళితే ఓక్లాండ్ చేరుకుంటుంది. పసిఫిక్ మహా సముద్రంలోని ఓ దీవిలో ఇంధనం నింపుకోవడానికి వెళ్తుండగా వారి విమానం ఆచూకీ గల్లంతైంది. ఎంత గాలించినా జాడ దొరకక పోవడంతో 1939 జనవరి 5న వారిద్దరూ మరణించినట్లు ప్రకటించారు. ఇంధనం అయిపోవడంతోనే వారి విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. 1991లో దొరికిన ఓ విమాన శకలం అమెలియా ప్రయాణించిన విమానంలోని భాగమని పరిశోధకులు 2022లో గుర్తించారు. అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీ వినియోగించి దీన్ని కనుగొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది.
ఫ్లైట్ 19
‘ఫ్లైట్ 19’ అనేది యునైటెడ్ స్టేట్స్ నేవీ శిక్షణ విమానం. 1945 డిసెంబరు 5న అది టార్పెడో బాంబర్ల సమూహంతో బయలుదేరింది. ఆ విమానంలో మొత్తం 14 మంది ఉన్నారు. బెర్ముడా ట్రయాంగిల్ చేరుకోగానే బేస్‌కు ఆ విమానం నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. దాంతో అమెరికా నేవీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. సహాయక చర్యల్లో భాగంగా ఓ మెరైనర్ ఫ్లయింగ్ బోట్‌ను పంపించగా.. అది కూడా కనిపించకుండాపోయింది. 1986 నుంచి 2015 వరకు అదే ప్రాంతంలో వివిధ విమాన ప్రమాదాలు జరిగాయి. వాటి శకలాలు బయటపడినా ‘ఫ్లైట్ 19’ శిథిలాలు మాత్రం దొరకలేదు. ఏదోక రోజు అవి దొరకుతాయనే ఆశతో అప్పుడప్పుడూ వెతుకులాట సాగిస్తున్నారు.
ది పాట్రీ
‘పాట్రీ’ అనేది ఫ్రెంచ్ ఎయిర్ షిప్. సైన్యం అవసరాల నిమిత్తం దీనిని తయారు చేశారు. అనేక విజయవంతమైన యాత్రలు చేసిన ఈ విమానం 1907లో ప్రమాదానికి గురైంది. ఓ చోట లంగరు వేసి నిలిపి ఉంచగా.. భారీ తుపాను ధాటికి అది కొట్టుకుపోయింది. అడ్డుకునేందుకు వందలాది మంది సైనికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అది తేలుతూనే కనిపించకుండా పోయింది. తరువాత ఇంగ్లిష్ ఛానల్‌లో కనిపించినట్లు కొందరు చెప్పారు. తరువాత మళ్లీ దాని ఆచూకీ దొరకలేదు. ఆ ఎయిర్‌షిప్ అంట్లాంటిక్ మహాసముద్రం దిగువన ఎక్కడో ఒక చోట ఉండొచ్చని భావిస్తున్నారు.
కెనడియన్ పసిఫిక్ ఎయిర్‌లైన్స్ డగ్లస్ డీసీ-4
ది వాంకోవర్ డగ్లస్ డీసీ-4 అనే విమానాన్ని కెనడియన్ పసిఫిక్ ఎయిర్‌లైన్స్ ఆపరేట్ చేస్తుండేది. 1951 జులై 21న విమానం వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం అలస్కా సమీపించగానే భారీ వర్షం, మంచు కురవడం మొదలైంది. రెండు గంటలైనా విమానం ల్యాండింగ్‌కు రాకపోవడంతో యూఎస్, కెనడా వైమానిక దళాలు వెతుకులాట ప్రారంభించాయి. అయినా ప్రయాణికులు, విమానం జాడ తెలియలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆ విమానం ఎక్కడో ఒక చోట కూలిపోయింటుందని నిపుణులు భావిస్తున్నారు.
గుస్తావ్ హామెల్ మోనోప్లేన్
గుస్తావ్ హామెల్ బ్రిటిష్ వైమానికుడు. 1914 మే 23న అతడు ‘మొరాన్ సాల్నియర్ మోనోప్లేన్’లో ఇంగ్లిష్ ఛానల్‌పై ప్రయాణిస్తున్నాడు. బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్లేన్‌పై అతడు నియంత్రణ కోల్పోయాడు. విమానం ఆచూకీ గల్లంతైంది. సుమారు 48 గంటలు శోధించిన తరువాత పైలట్ చనిపోయాడని ప్రకటించారు. ఈ ప్రమాదంలో గుస్తావ్ మృతదేహం లభించినా.. విమానం శకలాలు దొరకలేదు.
ట్రాన్స్ టాస్మాన్ ఫ్లైట్
లెఫ్టినెంట్ జాన్ మోన్‌క్రీఫ్, కెప్టెన్ జార్జ్ హుడ్‌లు ‘ట్రాన్స్ టాస్మాన్’ ఫ్లైట్‌లో ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్‌కు ప్రయాణించి రికార్డు నెలకొల్పాలని భావించారు. 1928 జనవరి 10న వారిద్దరూ సిడ్నీలో ఉదయం 2 గంటలకు బయలుదేరారు. 12 గంటలు గడిచిన తరువాత కూడా వారి విమానం న్యూజిలాండ్ చేరుకోలేదు. అంతకుముందే ఆ విమానం నుంచి రేడియో సిగ్నల్స్ అందాయి. వెంటనే విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అవేవీ ఫలించలేదు. విమానం, ఆ ఇద్దరి ఆచూకీ మిస్టరీగా మిగిలిపోయింది.
డ్రాగన్ ఫ్లై జడ్‌కే-ఏఎఫ్‌బీ
1962 ఫిబ్రవరి 12న పైలట్ బ్రియాన్ చాడ్విక్ నలుగురు ప్రయాణికులతో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నుంచి మిల్‌ఫోర్డ్ సౌండ్ వైపు బయలుదేరాడు. వాతావరణం కాస్త అనుకూలంగా లేకపోయినప్పటికీ తాను గమ్యం చేరుకోగలననే నమ్మకంతో పైలట్ ముందుకు కదిలాడు. కానీ, అతడిని దురదృష్టం వెంటాడింది. సమయం ముగుస్తున్నా విమానం రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 34 విమానాలు 400 గంటల పాటు వెతికినా ఆ విమానం ఆచూకీ లభించలేదు. న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో సుదీర్ఘ వెతుకులాటగా నిలిచింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
USA: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. విచారణకు సహకరించాలని కోరిన విదేశాంగ శాఖ
-
Manipur Violence: అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్లో వెలుగులోకి మరో ఘోరం..!
-
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం
-
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmothsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం