Nizam: నిజాం కాలంలో పోలీస్‌ వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసా?

తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముందు.. నిజాం పాలించిన హైదరాబాద్‌ రాష్ట్రంలో పోలీస్‌ బాస్‌గా ఎవరుండేవారు? అసలు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసేది? ఎప్పుడైనా ఈ సందేహాలు కలిగాయా? అయితే.. ఆ సంగతులు చదివేయండి..

Updated : 17 Jan 2023 09:48 IST

తెలంగాణ పోలీసు (TS Police) శాఖలో నియామకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆ శాఖకు కొత్త బాస్‌ వచ్చారు. ఇటీవల రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ పోలీస్‌(డీజీపీ)గా అంజనీ కుమార్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో ఉంటూ పోలీసులకు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడే బాధ్యత డీజీపీదే. 

మరి.. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముందు.. నిజాం పాలించిన హైదరాబాద్‌ రాష్ట్రంలో పోలీస్‌ బాస్‌గా ఎవరుండేవారు? అసలు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసేది? ఎప్పుడైనా ఈ సందేహాలు కలిగాయా? అయితే.. ఆ సంగతులు చదివేయండి..

ఒకప్పుడు హైదరాబాద్‌ (Hyderabad) రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంతోపాటు ఇప్పటి కర్ణాటకలోని బీదర్‌, రాయ్‌చూర్‌, గుల్బర్గా జిల్లాలు.. మహారాష్ట్రలోని ఉస్మాన్‌బాద్‌, బీద్‌, నాందేడ్‌, లాతుర్‌, ఔరంగాబాద్‌, పర్భాని జిల్లాలు కలిసి ఉండేవి. హైదరాబాద్‌ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన నిజాం రాజులే పోలీస్‌ శాఖకు చీఫ్‌ను నియమించేవారు.

కొత్వాలే పోలీస్‌ బాస్‌..

ప్రస్తుతం ఉన్న కమిషనరేట్‌ వ్యవస్థ.. 1847 నుంచే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రజలను కాపాడేందుకు నిజాం.. పోలీస్‌ కమిషనర్లను నియమించేవారు. వారిని ‘కొత్వాల్‌-ఇ-బల్దా’ అని పిలిచేవారు. ఈ కొత్వాల్‌ శాంతి, భద్రతలను పరిరక్షిస్తూ.. నేరాలను అరికట్టాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అన్ని నివేదికలను నేరుగా నిజాం రాజుకు తెలియజేయొచ్చు. కానీ, హోంశాఖతో సమన్వయం చేసుకునేవారు. రాజదర్బార్‌లో కొత్వాల్‌కి అత్యున్నత స్థానం ఉండేది. ఆయన.. తన పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల నుంచి ఎప్పటికప్పుడు జరిగిన నేరాలకు సంబంధించి నివేదికలు(రోజ్‌నమచాస్‌) తెప్పించుకొని పరిశీలించేవారు.

హైదరాబాద్‌ రాష్ట్రంలో చివరగా నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌(నిజాం-VII) హయాంలో కొత్వాల్‌గా రాజా బహదూర్‌ వెంకటరామ రెడ్డి పనిచేశారు. తన పదవీకాలంలో గద్వాల్‌, వనపర్తి సంస్థానాల మధ్య ఉన్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించారు. 

పోలీస్‌ స్టేషన్‌ స్వరూపమిదీ..
 

ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్లే అప్పట్లో ‘అమిన్‌’లు ఉండేవారు. వారిని ‘సర్దార్‌ అమిన్‌’అనేవారు. ఇక అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ను ‘మదద్‌గర్‌ కొత్వాల్‌’అని, డిప్యూటీ కమిషనర్‌ని ‘నయిబ్‌ కొత్వాల్‌’అని పిలిచేవారు.

పోలీస్‌స్టేషన్‌లో జనరల్‌ డ్యూటీలో ఉండే హెడ్‌ కానిస్టేబుల్‌ను ‘జిమేదార్‌’ అని, ఫిర్యాదు రాసుకునే రైటర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ను మోహ్రిరి అని, కానిస్టేబుల్‌ను ‘బార్కందాజ్‌’అని పిలిచేవారు. ఆ తర్వాత కానిస్టేబుల్‌ను ‘జవాన్‌’గా పిలవడం మొదలుపెట్టారు. 1902 కాలంలో ఒక కానిస్టేబుల్‌ జీతం 6 రూపాయాలు మాత్రమే. హైదరాబాద్‌ నగరం దాటి బయటకు వెళ్లాల్సి వస్తే.. భత్యం కింద రోజుకు రెండు అణాలు ఇచ్చేవారట. 

ఇక ఇన్‌స్పెక్టర్‌(అమిన్‌) ర్యాంక్‌ పోలీసులంతా నయిబ్‌ కొత్వాల్‌ ఆదేశాలతో పనిచేసేవారు. 1900లో హైదరాబాద్‌ జనాభా సుమారు 2.5లక్షలు మాత్రమే. దీంతో పోలీసుల సంఖ్య వేలల్లోనే ఉండేది.

హైదరాబాద్‌లో జనాభాతోపాటు నగర పరిధి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థలోనూ మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌ కమిషనరేట్‌ మాత్రమే ఉండేది. ఆ తర్వాత 2003లో సైబరాబాద్‌ కమిషనరేట్‌.. 2016లో రాచకొండ కమిషనరేట్‌ ఇలా తెలంగాణలో మొత్తం తొమ్మిది కమిషనరేట్‌లు ఏర్పడ్డాయి. ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని