ఒక్క యూరోకే రూ.కోట్ల విలువ చేసే కోటను అమ్మేశాడు!

ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు పోయినా.. పలుదేశాల్లో రాజవంశీయులు రాచరికాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అలా జర్మనీలోని హనోవర్‌ ప్రాంతంలో రాజవంశీయులు రాజవైభోగాలను అనుభవిస్తున్నారు. కాగా.. ఇటీవల హౌజ్‌ ఆఫ్‌ హనోవర్‌ యువరాజు తమ కుటుంబానికి

Updated : 07 Nov 2021 15:26 IST


(ఫొటో: మేరియన్‌ ఫోర్ట్‌ ఫేస్‌బుక్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు పోయినా.. పలుదేశాల్లో రాజవంశీయులు రాచరికాన్ని, ఆనాటి దర్పాన్ని ఇంకా కొనసాగిస్తూ వస్తున్నారు. అలా జర్మనీలోని హనోవర్‌ ప్రాంతంలో రాజవంశీయులు రాజ భోగాలను అనుభవిస్తున్నారు. కాగా.. ఇటీవల హౌస్‌ ఆఫ్‌ హనోవర్‌ యువరాజు తమ కుటుంబానికి చెందిన ఓ కోటను ప్రభుత్వానికి ఒక్క యూరో(దాదాపు రూ.88)కే అమ్మేశాడట. దీంతో యువరాజు తండ్రి ఎర్నెస్ట్‌ ఆగస్టు కుమారుడిపై కోర్టులో దావా వేశాడు. వివరాల్లోకి వెళ్తే..

66ఏళ్ల ఎర్నెస్ట్‌ ఆగస్టు వయసు మీద పడుతుండటంతో తమ ఆస్తుల్లో భాగమైన మేరియన్‌బర్గ్‌ కోట, కాలెబర్గ్‌ ఎస్టేట్‌ సహా పలు ఆస్తులను 2000 సంవత్సరంలో తన కుమారుడి పేరిట రాసిచ్చాడు. మేరియన్‌ బర్గ్‌ కోటను గతంలోనే సందర్శక ప్రాంతంగా మార్చి.. పర్యటకుల ద్వారా వచ్చిన ఆదాయంతో కోట నిర్వహణ చూస్తున్నారు. ఇది చాలా పురాతనమైనది కావడంతో దీన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అందుకే ఎర్నెస్ట్‌ కుమారుడైన జూనియర్‌ ఎర్నెస్ట్‌ ఆగస్టు ఆ కోటను ప్రభుత్వానికి కేవలం ఒక్క యూరోకే విక్రయించాడు.

రూ.కోట్లు విలువ చేసే కోటను ప్రభుత్వానికి అంత చౌకగా అమ్మేశాడన్న విషయం తెలుసుకున్న ఎర్నెస్ట్‌.. కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, కోర్టును ఆశ్రయించాడు. తన కుమారుడికి రాసిచ్చిన ఆస్తులను తిరిగి తనకు అప్పగించాలని దావా వేశాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని తన కుమారుడు దుర్వినియోగం చేస్తున్నాడనీ, తమ కుటుంబానికి చెందిన పురాతన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవట్లేదనీ కోర్టులో వాదనలు వినిపించాడు. మరోవైపు తండ్రి చేసిన ఆరోపణలను యువరాజు కొట్టిపారేశారు. ఆయన వేసిన దావాకు.. విచారణ అర్హత లేదని, కోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని