Pure honey : ప్రపంచంలోనే స్వచ్ఛమైన తేనె.. ఇక్కడ దొరుకుతుందట!

చిలీకి (Chile) సమీపంలోని ఒక ద్వీపంలో (Island) స్వచ్ఛమైన తేనె దొరుకుతుందట. ఇక్కడి తేనెటీగలపై (Honey bees) కొన్ని రకాల పరిశోధనలు కూడా చేశారు. 

Updated : 12 Apr 2023 15:26 IST

ఆగ్నేయ పసిఫిక్‌ మహా సముద్రం (Pacific ocean) మధ్యలో ఒక ద్వీపం (Island) ప్రపంచానికి ఒక మూలకు విసిరేసినట్టుగా ఉంటుంది. చిలీకి (Chile) సమీపంలోని ఆ ప్రాంతాన్ని ఈస్టర్‌ ఐలాండ్‌ (Easter island) అని పిలుస్తుంటారు. ఆ ద్వీపంలో పెరిగే మొక్కలు, చెట్లపై ఎలాంటి పురుగు మందులు చల్లరు. దాంతో అక్కడ తేనెటీగలు (Honey bees) ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యకర జీవనం సాగిస్తున్నాయి. ఫలితంగా అవి ఈ భూ ప్రపంచంలోనే స్వచ్ఛమైన తేనెను (Honey) ఉత్పత్తి చేయగలుగుతున్నాయి.

ఎందుకంత ప్రత్యేకం?

ప్రపంచ నలుమూలల్లో పెరిగే అన్ని రకాల తేనెటీగలు విషపూరిత రసాయనాలు చల్లిన మొక్కలపై వాలుతున్నాయి. దాంతో వాటికి కొత్త కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాతావరణ మార్పులు కూడా తేనెటీగల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. కానీ.. ఇలాంటి ప్రమాదాలేవీ ఈస్టర్‌ ఐలాండ్‌ తేనెటీగలకు లేవు. వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పెంపకందారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఇతర ప్రాంతాల నుంచి తేనెటీగలను దిగుమతి చేసుకోకుండా స్థానిక ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. కొత్త రకాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే స్థానిక తేనెటీగల ప్రత్యేక గుణం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతులు.. ప్రకృతి సహకారం

ఈ ప్రాంత తేనెటీగలు సురక్షితంగా పెరగడానికి కారణం రైతులు. వారు ఎలాంటి పురుగుమందులు చల్లకుండానే వ్యవసాయం చేస్తున్నారు. అందుకోసం కొన్ని రకాల పురాతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇక ఇక్కడ పారే నీరు కూడా చాలా సహజంగా.. స్వచ్ఛంగా ఉంటుంది. నీటి అవసరాలు ఎక్కువగా ఉంటే వర్షపునీటిని పోగు చేసి దాచుకుంటారు. దాంతో ఈ ద్వీపం అంతటా స్వచ్ఛమైన నీరు మాత్రమే ప్రవహిస్తోంది. అందువల్లే తేనెటీగలకు ఎలాంటి జబ్బులు సోకడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వ్యాధులు లేకపోవడంతో తేనె తయారీదారులు కూడా యాంటీ బయోటిక్స్‌ వాడటం లేదు. ద్వీపంలోని మరో ప్రత్యేకత ఏంటంటే అధిక తేమతో కూడిన వాతావరణం. అది తేనెలో అధిక ద్రవ స్థిరత్వాన్ని పోగు చేస్తోంది. ఆ చర్య స్ఫటికీకరణను నిరోధిస్తోంది.

పరిశోధనలు ఏం తేల్చాయంటే..!

ఈస్టర్‌ ద్వీపంలోని తేనెటీగలు నిజంగా అంత ప్రత్యేకమైనవా? అని తేల్చేందుకు కొన్ని రకాల పరిశోధనలు చేశారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచంలోని మిగతా ఏ తేనెటీగల జాతితోనూ వీటికి సంబంధం లేదని తేలింది. ఇక్కడ పరాగ సంపర్కాలు జరిగే తీరు కూడా భిన్నంగా ఉన్నట్లు కనుగొన్నారు. అందుకే ఈ అరుదైన జాతి తేనెటీగలను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈస్టర్‌ ద్వీపంలో పెరిగే తేనెటీగలు అత్యంత ఆరోగ్యవంతమైనవి మాత్రమే కాదు. వీటిలో ఉత్పాదక సామర్థ్యం కూడా ఎక్కువేనని వెల్లడైంది. ఈ ద్వీపంలోని ఆహ్లాదకరమైన వాతావరణం వాటికి చాలా అనువుగా ఉన్నట్లు తెలిసింది. ఏడాది పొడవునా వసంతకాలంలా ఉంటుంది. అందువల్ల తేనెటీగలు నిత్యం చురుగ్గా కదులుతుంటాయి. పుష్పించే మొక్కలపై వాలుతూ మకరందాన్ని జుర్రుతుంటాయి. సంవత్సర కాలంలో ఒక తేనెటీగల సమూహం 90 నుంచి 120 కిలోల తేనెను ఉత్పత్తి చేయగలుగుతాయట. ఇదే పరిమాణంలోని మిగతా తేనెటీగలకు 20 కిలోల ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని