Raccoon dog : వుహాన్‌ మార్కెట్‌లో రాకూన్‌ జాతి కుక్కలు.. ఎలా ఉంటాయో తెలుసా!

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఎక్కడ పుట్టింది అనే ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం దొరకలేదు. వుహాన్‌ ల్యాబ్‌, చేపలు, గబ్బిలాలు, అలుగు.. ఈ జాబితాలోకి తాజాగా రాకూన్‌ జాతి కుక్కలు చేరిపోయాయి.

Published : 20 Mar 2023 16:25 IST

ఇటీవల చైనా(China)లోని వుహాన్‌(wuhan)లో హువానాన్‌ టోకు చేపల మార్కెట్ నుంచి సేకరించిన డేటాను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. మార్కెట్లో విక్రయించే రాకూన్‌ జాతి కుక్కల(Raccoon dog) జన్యుపదార్థంలో కొవిడ్‌(Covid) కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని తేలింది. దీన్నిబట్టి కొవిడ్‌ కారక కరోనా వైరస్‌ ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించినది కాదనీ, అది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకూన్‌ జాతి కుక్కలు(Raccoon dog) ఎలా ఉంటాయి? ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

ఏంటీ రాకూన్‌ జాతి కుక్కలు?

రాకూన్‌ జాతి కుక్కలు క్యానిడ్‌ ఫ్యామిలీకి చెందినవి. ఇవి ఇంచు మించు నక్క జాతితో సంబంధం కలిగి ఉంటాయి. చలికాలంలో నిద్రాణ స్థితిలోకి వెళతాయి. వీటిలో రెండు రకాలున్నాయి 1.నిక్టెయూట్స్‌ ప్రాసీ అనాయిడీస్‌(ది కామన్‌ రాకూన్‌ డాగ్‌) 2.నిక్టెయూట్స్‌ పి. వివర్రినస్‌(ది జపనీస్‌ రాకూన్‌ డాగ్‌). వుహాన్‌ మార్కెట్‌లో దొరికే కుక్కలు ఒక్కొక్కటి దాదాపు 7 కేజీలకు పైగా బరువుంటాయి. ఈ జంతువులు సర్వభక్షకాలు.. అన్ని రకాల ఆహార పదార్థాలు తింటాయి. ఎలుకలు మొదలుకొని బెర్రీల వరకు ఏవైనా సరే ఆరగిస్తాయి. వేసవిలో చురుగ్గా తిరుగుతూ ఆహారం సేకరిస్తాయి. చలికాలంలో స్థిరంగా ఒక చోట ఉండిపోతాయి. వీటి జుట్టు కూడా మందంగా ఉంటుంది. జతలు జతలుగా కలిసి ఉండే ఈ కుక్కలు ఒక దాంతో మరొకటి మాత్రమే సహజీవనం చేయడానికి ఇష్టపడతాయని సమాచారం.

ఎక్కడున్నాయి?

రాకూన్‌ జాతి కుక్కలు తూర్పు ఆసియాకు చెందినవి. చైనా(China), కొరియా, జపాన్‌(Japan)లో ఎక్కువగా కన్పిస్తాయి. వాటిని ‘తనుకి’ అని కూడా పిలుస్తారు. ఐరోపాలోనూ వీటి సంచారం ఉంది. 1920 నుంచే రాకూన్‌ కుక్కల వెంట్రుకలతో వ్యాపారం చేశారు. ప్రస్తుతం ఐరోపా పర్యావరణ వ్యవస్థకు రాకూన్‌ కుక్కలు హాని చేస్తున్నాయని భావిస్తున్నారు. జపాన్‌లో మాత్రం రాకూన్‌ కుక్కలను గౌరవంగా చూస్తున్నారు.

వుహాన్‌లో అత్యధిక విక్రయాలు

రాకూన్‌ కుక్కల వెంట్రుకల కోసం కొన్ని దశాబ్దాలుగా చైనాలో వీటిని పెంచుతున్నారు. అలా కొన్ని వేల జంతువులను ఇప్పటి వరకు వధించారు. వాటి మాంసాన్ని కూడా విక్రయించారు. వీటి నుంచి తీసిన వెంట్రుకలను ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. డిమాండ్ బాగా ఉండటంతో ఈ కుక్కలను చిన్నపాటి బోనుల్లో ఉంచి పెంచుతున్నారు. కొన్నిసార్లు ఇతర జంతువులను కూడా వీటితో కలిపి ఉంచుతారు. ఈ కారణం చేతనే వివిధ రకాల కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయి.

వ్యాధులకు కారణం!

చైనాలో 2003లో సార్స్‌ కరోనా వైరస్‌ ప్రబలిన సమయంలోనే ఆ ఆనవాళ్లు ఈ రాకూన్‌ జాతి కుక్కల్లో కూడా కన్పించినట్లు ఎన్‌పీఆర్‌ నివేదికలో వెల్లడైంది. 2022లో చైనాలోని 18 రకాల జాతులకు చెందిన 2వేల జంతువుల నుంచి శాంపిళ్లు తీశారు. అందులో రాకూన్‌ జాతి కుక్కలు కూడా ఉన్నాయి. మొత్తంగా 13 వైరల్‌ ఫ్యామిలీకి చెందిన 102 రకాల వైరస్‌లు వాటిలో ఉన్నట్లు తేలింది. అందులో 21 రకాలు మానవులకు అత్యంత ప్రమాదకరం అని వెల్లడైంది. రాకూన్‌లలో.. కుక్క జాతులకు సంబంధించిన నాలుగు రకాల కరోనా వైరస్‌ల ఆనవాళ్లున్నాయని ఆ నివేదిక తెలిపింది. మానవుల్లో బయటపడిన కరోనాకు దీనికి కొంచెం సంబంధం ఉన్నట్లు అందులో ప్రస్తావించారు.

కరోనాపై స్పష్టత కరవు

వుహాన్‌లో సేకరించిన జన్యు నమూనాలో రాకూన్‌ కుక్క న్యూక్లిక్‌ ఆమ్లం, వైరస్‌ న్యూక్లిక్‌ ఆమ్లం కలిసి ఉన్నాయని కనిపెట్టారు. ఒకవేళ రాకూన్‌ కుక్కకు కొవిడ్‌ వైరస్‌ సోకినా దాని నుంచి అది నేరుగా మానవులకు వ్యాపించి ఉండకపోవచ్చనీ, అసలు మానవుల ద్వారానే కుక్కకు వైరస్‌ సోకి ఉండవచ్చనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరేదైనా జంతువు నుంచి కూడా రాకూన్‌ కుక్కకు కొవిడ్‌ వైరస్‌ సోకి ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతానికి జంతువుల నుంచే మానవులకు వైరస్‌ సోకిందన్న వాదనకే మొగ్గు చూపుతున్నారు. ఈ డేటా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రస్‌ అథనోమ్‌ మాట్లాడుతూ ‘మహమ్మారి ఎలా ప్రబలింది అనే ప్రశ్నకు ఈ డేటాలో సమాధానం దొరకట్లేదు. కానీ ప్రతి చిన్న సమాచారం కూడా సమాధానం కనుక్కునేందుకు దోహదపడుతుందని’ ఆయన అభిప్రాయపడ్డారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని