‘రీ-ఇన్‌ఫెక్షన్’ గా ఎప్పుడు పరిగణిస్తారంటే..?
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి 102 రోజుల్లో మళ్లీ పాజిటివ్ రావడంతో పాటు మధ్యలో ఒకసారి నెగటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని ఐసీఎంఆర్ వెల్లడించింది.
నిర్వచించిన ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. ఇదివరకే కొవిడ్ సోకిన వారికి మళ్లీ పాజిటివ్(రీ-ఇన్‌ఫెక్షన్) వస్తుందనే పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీ-ఇన్‌ఫెక్షన్‌కు సాంకేతికపరంగా స్పష్టమైన నిర్వచనాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కనీసం 102 రోజుల్లోపు మళ్లీ పాజిటివ్ రావడంతో పాటు మధ్యలో ఒకసారి నెగటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని స్పష్టం చేశారు.
భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో రీ-ఇన్‌ఫెక్షన్ కేసులు బయటపడుతుండడంతో శాస్త్రవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు భారత్‌లోనూ కొవిడ్-19 రీ-ఇన్‌ఫెక్షన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ రీ-ఇన్‌ఫెక్షన్‌కు ఇప్పటి వరకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వీటిపై అధ్యయనం చేపట్టింది. 102 రోజుల వ్యవధిలో రెండోసారి పాజిటివ్ రావడంతో పాటు మధ్యలో ఓసారి నెగటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని పేర్కొంది. అంతేకాకుండా కరోనా రీ-ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించాలంటే జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడం అవసరమని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను కేంబ్రిడ్జ్‌కు చెందిన ఎపిడమాలజీ అండ్ ఇన్‌ఫెక్షన్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.
ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు చేపట్టిన రీ-ఇన్‌ఫెక్షన్ అధ్యయనంలో భాగంగా 58మంది కొవిడ్ రోగులపై పరిశోధన చేపట్టారు. వీరిలో 12మంది ఆరోగ్య కార్యకర్తలున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారికి తొలుత పాజిటివ్ వచ్చిన సమయంలో వైరల్ లోడ్ తీవ్రంగా ఉండి, లక్షణాలు కనిపించని వారే అధిక సంఖ్యలో ఉన్నారు. రెండోసారి వైరస్ సోకినపుడు మాత్రం కొందరిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇప్పటి వరకు కరోనా రీ-ఇన్‌ఫెక్షన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఏకాభిప్రాయం లేదని అధ్యయన బృందం పేర్కొంది. అమెరికా వ్యాధుల నియంత్రణ నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకారం, ఓ వ్యక్తికి 90 రోజుల అనంతరం మళ్లీ పాజిటివ్ వస్తే, జీనోమ్ సీక్వెన్స్ ద్వారా రీ-ఇన్‌ఫెక్షన్‌ను నిర్దారించాలని సూచిస్తోంది. తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఐసీఎంఆర్ ఆ వ్యవధి కనీసం 102రోజులుగా ఉండాలని పేర్కొంది. ఇలా వీటిని నిర్ధారించుకునేందుకు పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను లక్షల సంఖ్యలో సేకరించి నిల్వ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదని అధ్యయనం బృందం అభిప్రాయపడింది. అయితే, వైరస్ ప్రమాదం పొంచివున్న పాజిటివ్ వచ్చిన వైద్య ఆరోగ్య సిబ్బంది నమూనాలను తదుపరి పరీక్షల కోసం(రీ-ఇన్‌ఫెక్షన్) భద్రపరచుకోవచ్చని ఐసీఎంఆర్ నివేదిక సూచించింది.
కొవిడ్ రీ-ఇన్‌ఫెక్షన్ అరుదుగా సంభవిస్తుందని.. వృద్ధులు మాత్రం రీ-ఇన్‌ఫెక్షన్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘ది లాన్సెట్’ నివేదిక ఈమధ్యే వెల్లడించింది. ఈ నేపథ్యంలో సార్స్-కోవ్-2 రీ-ఇన్‌ఫెక్షన్ అత్యంత అరుదైన విషయం అయినప్పటికీ, వైరస్ పర్యవేక్షణ వ్యవస్థలను రూపొందించుకోవడంలో రీ-ఇన్‌ఫెక్షన్ నిర్వచనం ఎంతో అవసరమని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అందుకే కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా మరోసారి వైరస్ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్నవారు వ్యక్తిగత శుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం మరిచిపోవద్దని సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!