Manipur Violence: జాతుల ఘర్షణ.. మంటల్లో మణిపుర్‌!

Manipur Violence: మణిపుర్‌లో జరుగుతున్న ఘర్షణలు రాష్ట్రాన్ని అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. కనిపిస్తే కాల్చివేత, సైనిక పారామిలటరీ బలగాల రంగ ప్రవేశంతో అల్లర్లు తగ్గినా అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.

Published : 09 May 2023 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : భారతదేశానికి విలువైన ఆభరణంగా ఖ్యాతికెక్కిన ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌(Manipur)లో జరుగుతున్న ఘర్షణలు రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చాయి. కనిపిస్తే కాల్చివేత, సైనిక పారామిలటరీ బలగాల రంగ ప్రవేశంతో అల్లర్లు తగ్గినా అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అల్లర్లలో ఇప్పటికే 60 మంది ప్రాణాలు కోల్పోగా, 1700 ఇళ్లు దహనం కావడంతో వేలాదిమంది ఆశ్రయం కోల్పోయారు.

కారణమేంటి?

మణిపుర్‌ భౌగోళికంగా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. లోయ, కొండ ప్రాంతాలని రెండు విభాగాలుగా చెప్పవచ్చు. రాష్ట్రం మధ్యలో ఉన్న ఇంఫాల్‌ లోయ ప్రాంతం అత్యంత సారవంతమైనది కేవలం 10 శాతం ఉన్న ఈ భూభాగంలో రాష్ట్రంలోని దాదాపు తొంభై శాతం ప్రజలు నివసిస్తున్నారు. అనాదిగా మెయిటీలు ఇక్కడ నివాసముంటున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా శాతం దాదాపు 53 శాతం. దీంతో రాజకీయాల్లో వీరిదే ప్రాబల్యం. రాష్ట్రంలోని 60 మంది శాసనసభ్యుల్లో ఇక్కడ నుంచే 40 సీట్లున్నాయి. ఇక మిగిలిన కొండప్రాంతాల్లో కుకీ, నాగాలతో పాటు దాదాపు 30కు పైగా ఆదివాసీ తెగలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలుండగా ఐదు జిల్లాల్లో మెయిటీ తెగవారు అధికంగా ఉన్నారు. మెయిటీలకు ఆదివాసీ రిజర్వేషన్లు లేకపోవడంతో వారు కొండప్రాంతాల్లో భూములను కొనేందుకు సౌలభ్యం లేదు. అయితే కొండప్రాంతాల వారు లోయలోని భూములను కొనవచ్చు. మెయిటీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుండగా వారికి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని  కొండప్రాంతాల ప్రజలైన కుకీ, నాగాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రిజర్వేషన్ల అంశంతో..

మెయిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని  పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. మెయిటీలకు రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఆదివాసీ తెగలు డిమాండ్‌ చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి మెయిటీలకు కుకీ, నాగాలతో వైరుధ్యాలున్నాయి. మెయిటీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల వాటా తగ్గిపోతుందన్నది వారి ఆందోళన. కొన్ని నెలల ముందు చురచంద్రపూర్‌లో సీఎం బీరెన్‌సింగ్‌ పర్యటనకు వ్యతిరేకంగా అక్కడ ఆదివాసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం మెయిటీల రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి ఈ జిల్లానే కేంద్ర స్థానం కావడం గమనార్హం.

అటవీ ప్రాంతాలను రిజర్వ్‌ ప్రాంతాలుగా ప్రకటించడంపై..

రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలను రిజర్వ్‌ ప్రాంతాలుగా ప్రకటిచండంతో కొండలపై నివాసమున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పునరావాసం కల్పించకుండా తమను తరలించడంపై నిరసన వ్యక్తం చేశారు. దీనికి తోడు రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో నిరసనలు ఘర్షణ రూపం దాల్చాయి. వాస్తవానికి మెయిటీలకు కుకీ, నాగాలకు మధ్య గత పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు లేవు. మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాలను మహానాగాలింలో చేర్చాలని నాగా సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. నాగాలకు, కుకీలకు మధ్య వైరం ఉంది. అయితే మెయిటీలకు రిజర్వేషన్ అంశంపై రెండు వర్గాలు కలవడం విశేషం. 1948 కన్నా ముందు మెయిటీలను ఆదివాసీలుగా పరిగణించేవారని మెయిటీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదని గతంలో ఉన్నదాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని మాత్రమే కోరుతున్నామని వారు చెబుతున్నారు.

మయన్మార్‌ నుంచి కాందిశీకుల రాక

మయన్మార్‌లో జరుగుతున్న అల్లర్లతో మణిపుర్‌లోకి అనేకమంది మయన్మార్‌ వాసులు ఆశ్రయం కోసం వచ్చారు. ఇప్పటివరకు దాదాపు ఐదువేలమంది వచ్చి ఉంటారని అంచనా. అయితే ఈ ముసుగులో మయన్మార్‌ కుకీలు సైతం రాష్ట్రానికి వస్తున్నారని మెయిటీలు ఆరోపిస్తున్నారు. వీరి రాకను అడ్డుకోవడంతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలతో చర్చించి సమస్యకు పరిష్కారం దిశగా ప్రయత్నిస్తే మేలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని