Rotating Homes : ఈ ఇళ్లు అటూ ఇటూ తిరుగుతాయట.. ఎందుకో తెలుసా!

నిరంతరం సూర్యకాంతిని (Sun light) వినియోగించుకునేందుకు కొన్ని దేశాల్లో వివిధ కోణాల్లో తిరిగే ఇళ్లను (Rotating Homes) అభివృద్ధి చేశారు. వాటి విశేషాలివి..

Published : 23 May 2023 10:16 IST

(Image : SunHouse360)

ప్రపంచంలోని (World) కొన్ని దేశాల్లో సూర్యుడి వెలుతురు (Sun light) తక్కువ సమయమే ఉంటుంది. అందువల్ల అక్కడి ఇళ్లలో (Homes) చీకటిగా అనిపిస్తుంది. నిత్యం విద్యుద్దీపాలు  (lights) వెలిగించుకోవాలి. దాంతో కరెంటు బిల్లు (Power bill) ఎక్కువగా వస్తుంది. సౌర ఫలకాలు వాడి విద్యుత్తు ఆదా చేద్దామన్నా భానుడి గమనం పూటపూటకీ మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి తిరిగే ఇళ్లను (Rotating Homes) అభివృద్ధి చేశారు. వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

గిరాసోల్‌ హౌస్‌

మ్యాగ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిల్డర్‌ జాన్‌ ఆండ్రియోలో కొంతమంది వాస్తు శిల్పుల సహాయంతో సూర్యుడు తిరిగే దిశకు అనుకూలంగా మారే ఇంటిని అభివృద్ధి చేశాడు. దాని పేరు ‘గిరాసోల్ హౌస్’. ఇటాలియన్‌ భాషలో ‘గిరారే’ అంటే ‘తిరగడం’, ‘సోల్‌’ అంటే ‘సూర్యుడని’ అర్థం. సౌర విద్యుత్తు సహాయంతో తిరిగే ఈ ఇల్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశంలోని కాన్‌బెర్రాలో ఉంది. 28 చక్రాల స్టీల్‌ ఫ్రేమ్‌పై దీనిని నిర్మించారు. కేవలం ఒక బల్బు వెలగడానికి ఎంత విద్యుత్తు ఖర్చు అవుతుందో అంతే శక్తితో ఇందులో అమర్చిన మోటార్లు పని చేస్తాయి. ఐప్యాడ్‌ను ఉపయోగించి కూడా ఇంటి యజమాని తనకు నచ్చిన దిశలోకి ఇంటిని మార్చుకోవచ్చు.

డోమ్ హౌస్‌

ఫ్రాన్స్‌కు చెందిన డోమ్‌స్పేస్‌ కంపెనీ 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో డోమ్‌ హౌస్‌ను నిర్మించింది. చెక్కతో చేసిన ఈ ఇల్లు పేరుకు తగ్గట్లే గుమ్మటం ఆకారంలో ఉంటుంది. ప్రస్తుతం దీన్ని న్యూయార్క్‌లోని న్యూపాల్ట్జ్‌ వద్ద ప్రదర్శనకు ఉంచారు. మధ్యలో అమర్చిన ఇరుసు ద్వారా ఇది 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ సూర్యరశ్మిని వినియోగించుకుంటుంది. ఈ ఇంటి నిర్మాణంలో దేవదారు, వెదురు చెక్కలను, సున్నపురాయిని వాడారు. తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా దీనిని తీర్చిదిద్దారు. ఆసక్తి ఉన్నవారికి ఈ ఇంటిని రోజుల లెక్కన అద్దెకిస్తున్నారు.

ది 359 హౌస్‌

ఒరెగాన్‌కు చెందిన పాత్‌ ఆర్కిటెక్చర్‌ కంపెనీ నిర్మించిన ఈ ఇల్లు కేవలం 144 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. చాలా చిన్నగా ఉంటుంది. యంత్రాల సహాయం లేకుండానే ఈ ఇంటిని మనుషులే కదిలించొచ్చు. దాంతో సమయానుకూలంగా సూర్యరశ్మిని ఇంటిలోకి వచ్చేలా చూసుకోవచ్చు. ఇంటి కింద అమర్చిన వ్యవస్థ చాలా తేలికగా, సులువుగా కదిలేలా తయారు చేశారు. దాంతో చిన్నపిల్లలు కూడా ఈ ఇంటిని కదిలించవచ్చని నిర్మాణదారులు చెబుతున్నారు.

సన్‌హౌస్‌ 360

‘సన్‌హౌస్‌ 360’ ఇరుసు ఆధారం చేసుకొని సొంతంగా చుట్టూ తిరుగుతుంది. దాంతో కావాల్సినంత సౌరశక్తిని సంగ్రహించుకుంటుంది. అందువల్ల సాధారణ ఇంటితో పోలిస్తే ఈ ఇంటిలో నివసించే వారికి 70శాతం విద్యుత్తు బిల్లు ఆదా అవుతుందని దాని తయారీదారులు వెల్లడించారు. మొబైల్‌ యాప్‌ ద్వారానూ ఇంటి దిక్కును మార్చుకునే వెసులుబాటు కల్పించారు.

ఎవెరింగమ్‌ హౌస్‌

ఈ ఇల్లు అష్టభుజి ఆకారంలో కన్పిస్తుంది. అందువల్ల సూర్యుడి నుంచి పడే ఎండ మొదలుకొని, వ్యతిరేక దిశలోని నీడనూ సరి సమానంగా వినియోగించుకోవచ్చు. ఇంటి గోడలపై అమర్చిన టచ్‌ ప్యానెళ్ల సాయంతో అవసరాలకు తగ్గట్లుగా దిశను మార్చుకోవచ్చు. 

భార్య కోసం తిరిగే ఇల్లు

బెల్జియంకు చెందిన ఫ్రాంకోయిస్‌ మసావు అనే వ్యక్తి 1958లోనే 1400 అడుగుల చదరపు విస్తీర్ణం కలిగిన ఇంటిని నిర్మించాడు. ఏడాది మొత్తం ఈ ఇంట్లో సూర్యుడి వెలుతురు పడేలా దాన్ని డిజైన్‌ చేశాడు. ఇటుక, సిమెంటు వినియోగించి బలమైన పునాది కట్టాడు. మోటార్‌ అమర్చి దానిపై స్ట్రీల్‌ ట్రాక్‌ తిరిగే ఏర్పాట్లు చేశాడు. అనారోగ్యం బారిన పడిన తన భార్య త్వరగా కోలుకునేందుకు ఎండ కావాలనే ఉద్దేశంతో ఫ్రాంకోయిస్‌ ఈ నిర్మాణాన్ని చేపట్టాడట.

రొటేటింగ్‌ హోమ్‌, శాన్‌ డియాగో

మౌంట్ హెలిక్స్‌ వాలుపై నిర్మించిన ఈ ఇంటి విస్తీర్ణం 5300 చదరపు అడుగులు. ఇందులోని ఒక అంతస్తులో ఉండి 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ చుట్టు పక్కలి ప్రదేశాలను చూడొచ్చు. మరో విశేషం ఏమిటంటే ఇందులో కార్‌ను ఒక దిశలో పార్క్‌ చేసి కావాల్సినప్పుడు స్విచ్‌ వేసి మరో దిశలోకి మార్చుకోవచ్చు. 1.5 హార్స్‌ పవర్‌ డీసీ మోటార్‌ సాయంతో ఈ ఇంటి రొటేషన్‌ వ్యవస్థ పని చేస్తుంది.

డి ఏంజెలో హౌస్‌

కాలిఫోర్నియాలోని స్నో క్రీక్‌ విలేజ్‌లో రొటేటింగ్‌ డి ఏంజెలో హౌస్‌ కన్పిస్తుంది. దీనిని 130 డిగ్రీల కోణంలో తిప్పి.. చుట్టూ ఉన్న పర్వతాల అందాలను వీక్షించొచ్చు. అల్యూమినియం స్కైలైట్ అండ్‌ స్పెషాలిటీ కార్పొరేషన్‌ వ్యాపారవేత్త ఫ్లాయిడ్‌ డి ఏంజెలో దీనిని తయారు చేశాడు. 857 చదరపు అడుగుల విస్తీర్ణం కల ఈ ఇల్లు పూర్తిగా తెలుపురంగులో ఉంటుంది. లోపల మాత్రం లగ్జరీ సదుపాయాలు కల్పించారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు