Caribbean sea: కరేబియన్ సముద్రంలో కదలని పడవ.. కెచప్ తింటూ 24రోజులు గడిపిన నావికుడు
ఓ నావికుడు వాతావరణం అనుకూలించక కరేబియన్ సముద్రంలో చిక్కుకుపోయాడు. కెచప్ మాత్రమే తింటూ అదృష్టవశాత్తూ చివరికి బతికి బయటపడ్డాడు.
ప్రతికూల వాతావరణం ఓ నావికుడిని(sailor) కరేబియన్ సముద్రం(caribbean sea)లో మధ్యలోకి తీసుకెళ్లింది. నావిగేషన్(navigation) వ్యవస్థ పని చేయకపోవడంతో అతడికి గమ్యం చేరే మార్గం తెలియలేదు. ఆహారం(food) లేక కెచప్ తింటూ అక్కడే కొన్ని రోజులు కాలం గడిపాడు. చివరికి ఓ హెలికాప్టర్ అటుగా రావడంతో సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డాడు. ఇంతకీ ఆ కరేబియన్ దీవిలో ఏం జరిగిందో చదివేయండి.
డొమినికా(dominica) వాసి ఎల్విస్ ఫ్రాంకోయిస్ ఓ నావికుడు. గత ఏడాది డిసెంబరులో అతడు పడవలో కరేబియన్ సముద్ర ద్వీపం సెయింట్ మార్టిన్ వద్ద ఉన్న సమయంలో వాతావరణం(weather)లో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయి. భారీగా పెనుగాలులు వీస్తూ అతడి పడవ ఒడ్డు నుంచి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో పడవలోని నావిగేషన్ వ్యవస్థ కూడా పనిచేయలేదు. ఫ్రాంకోయిస్ వద్ద మొబైల్(mobile) ఉన్నా దానికి సిగ్నల్ అందలేదు. అలా పడవ ఎంత దూరం వరకు కొట్టుకెళ్తోందో కూడా అతనికి తెలియరాలేదు. ఫ్రాంకోయిస్ పడవలో ఒక కెచప్(ketchup) సీసా, వెల్లుల్లి పౌడర్, కొంచెం మ్యాగీ మాత్రమే ఉన్నాయి. వాటిపై నీటిని చల్లుకొని తిని మొదటి రోజు గడిపాడు. కను చూపు మేరలో నేల కనిపించడం లేదు. చుట్టూ నీరే.. దాంతో తనకు సమీపంగా ఎవరైనా వస్తారనే నమ్మకం కూడా ఫ్రాంకోయిస్ సన్నగిల్లింది. ఎవరైనా వస్తే వారు సహాయం చేయడానికి వీలుంటుందని కష్టపడి తన పడవపై ‘హెల్ప్’ అనే అక్షరాలు చెక్కాడు. అయినా అటుగా ఎవరూ రాలేదు. రోజులు, వారాలు గడుస్తున్నాయి. తినడానికి ఏమీ లేదు. కెచప్ తప్ప. దాంతో ఆకలి వేస్తే కెచప్‌ను కొద్ది కొద్దిగా తింటూ పడవలోనే ఒంటరిగా కాలం గడిపాడు. అలా 24 రోజులు గడిచిపోయాయి.
జనవరి 15న ఓ హెలికాప్టర్(helicopter) తన పడవపై ఎగురుతూ వెళ్లడం ఫ్రాంకోయిస్ గమనించాడు. అప్పటికి పడవ ప్యూర్టో బొలివర్‌కు 120 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతం ఫ్రాంకోయిస్ మొదట ఉన్న ప్రదేశానికి దాదాపు వెయ్యి మైళ్ల దూరంలో ఉంది. హెలికాప్టర్‌ను చూడగానే ఫ్రాంకోయిస్ ఆశలు మళ్లీ చిగురించాయి. ముఖం చూసుకునేందుకు పడవలో ఉంచుకున్న చిన్నపాటి అద్దం బయటకు తీశాడు. దానిపై సూర్యరశ్మి పడి ఆ వెలుతురు హెలికాప్టర్‌లో ఉన్నవారికి తాకేలా కదిపాడు. పైన ఎగురుతోంది కొలంబియా నేవీ హెలికాప్టర్. వారు ఫ్రాంకోయిస్ కదలికలపై దృష్టిపెట్టారు. తనకు సహాయం అవసరం ఉందని భావించి హెలికాప్టర్ కాస్త కిందకి దించి ఫ్రాంకోయిస్‌ను రక్షించారు.
(Image : Armada de Colombia)
సరైన తిండి, నీరు లేకపోవడంతో ఫ్రాంకోయిస్ బాగా బలహీనపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం కార్టాజెనా మెడికల్ కేర్‌కు(medical care) తరలించారు. సముద్రంలో చిక్కుకున్న ఒంటరి నావికుడు 24 రోజులు కెచప్ తింటూ బతికాడనే విషయం ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. తాను పడవలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఫ్రాంకోయిస్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘అదో కష్ట సమయం. ఎలాంటి ఆహారం లేదు. ఒక కెచప్ బాటిల్, గార్లిక్ పౌడర్, మ్యాగీ మాత్రమే ఉండేది. వాటినే నీళ్లలో నానబెట్టుకొని తిన్నానని’ తన అనుభవాన్ని వివరించాడు. చికిత్స తరువాత పూర్తిగా కోలుకున్న ఫ్రాంకోయిస్ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు.
ఫ్రాంకోయిస్ కెచప్ తింటూ 24 రోజులు జీవనం సాగించిన విషయం సంచలనం కావడంతో హీన్జ్ అనే కెచప్ కంపెనీ తన కోసం వెతుకులాట ప్రారంభించింది. సామాజిక మాధ్యమాల్లో #findtheketchupboatguy హ్యాష్‌ట్యాగ్ జోడించి ఫ్రాంకోయిస్ ఆచూకీ తెలిస్తే చెప్పాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అంతటి సాహస చరిత్ర కలిగిన నావికుడికి తమ కంపెనీ తరఫున అధునాతన నావిగేషన్ వ్యవస్థ కలిగిన ఓ పడవను బహూకరించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఆ పిలుపునకు ఓ స్థానిక వార్తా సంస్థతో పాటు నెటిజన్లు స్పందించారు. లైక్‌లు, కామెంట్స్, షేర్స్ చేస్తూ ఆ పోస్టును వైరల్ చేశారు. దాంతో ఎట్టకేలకు ఫ్రాంకోయిస్ ఆచూకీ తెలిసింది. కంపెనీ తమ ప్రతినిధుల సహాయంతో రెండ్రోజుల క్రితం నావికుడికి బోటును అందజేసింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా
-
India News
Kerala: మహిళల వేషధారణలో పురుషుల పూజలు
-
World News
Injury: గాయం ‘స్మార్ట్’గా మానిపోతుంది
-
Politics News
Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్: ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి