School in Desert : ఎడారిలో చదువుల కోవెల.. ఏసీ లేకున్నా చల్లగా ఉంటుందట!
ఎడారి మధ్యలో కట్టిన ఓ బడి మండు వేసవిలోనూ చల్లగా ఉంటోంది. దాని నిర్మాణం వెనకున్న విశేషాలేంటో చదివేయండి.
(Image : Facebook)
రాజస్థాన్(Rajasthan)లోని థార్ ఎడారి(Thar desert) గురించి చాలా మంది పాఠ్య పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. వేసవి(Summer)లో అక్కడ ఉష్ణోగ్రత(Temperature) దాదాపుగా 50 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రోజంతా వేడి గాలులు వీస్తూ.. ఇసుక ఎగసి మీద పడుతుండటంతో 10 నిమిషాలు కుదురుగా నిల్చోవటానికి కూడా వీలుకాదు. అలాంటి ప్రతికూల వాతావరణంలో ఓ సుందరమైన విద్యాలయం వెలిసింది. దాని ఆకారం, నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తల కారణంగా ఏసీ లేకుండానే గదులు చల్లగా(Cooling) ఉంటున్నాయి. దాంతో విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఆ చదువుల కోవెల(School) విశేషాలేంటో తెలుసుకోండి.
కోడిగుడ్డులా నిర్మాణ శైలి!
రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్‌కు సమీపంలోని కనోయ్ గ్రామంలో ‘రాజ్‌కుమారి రత్నావతి బాలికల పాఠశాల’ను సిట్టా ఫౌండేషన్ నిర్మించింది. ఈ పాఠశాల అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణం నిర్మాణ శైలి. పై నుంచి చూస్తే ఓ కోడి గుడ్డు ఆకారంలో పచ్చని రాళ్లతో ముచ్చటగా కన్పిస్తుంది. ఇందులో కిండర్‌గార్డెన్ మొదలు 10వ తరగతి వరకు 400 మంది బాలికలకు విద్యాబోధన జరుగుతోంది. బాలికలు విద్యనభ్యసించే విభాగాన్ని జ్ఞాన కేంద్రంగా పిలుస్తున్నారు. ఈ ప్రాంగణంలోనే మహిళా ఆర్థికాభివృద్ధి కేంద్రాన్ని నడిపిస్తున్నారు. కుట్లు, అల్లికలు, తదితర హస్తకళల్లో స్థానిక మహిళలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు.
రాజస్థాన్ కట్టడాలే స్ఫూర్తి
‘సిట్టా’ వ్యవస్థాపకుడు మైఖేల్ డూబే ఈ నిర్మాణం చేపట్టడానికి 10 ఏళ్లు తర్జనభర్జన పడ్డారు. న్యూయార్క్‌కు చెందిన ఆర్కిటెక్ట్ డయానా కెల్లోగ్ సహకారంతో ఎట్టకేలకు అద్భుతమైన నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. 2014లో భారత్‌లో అడుగుపెట్టిన ఆమె తొలుత ఎడారిలో నిర్మాణం అనగానే ఆందోళన చెందారు. తరువాత రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాలు తిరుగుతూ వివిధ నిర్మాణాలను అధ్యయనం చేశారు. స్థానిక కోటలు, ఇళ్లు, బావులు, మెట్ల నిర్మాణ శైలిని నిశితంగా గమనిస్తూ ప్రణాళిక రూపొందించారు. అమెరికా తరహా నిర్మాణాలు ఎడారిలో చేపడితే కుదరదని గ్రహించిన ఆమె కట్టడంలో స్థానిక సంప్రదాయ పద్ధతులను అవలంబించారు.
(Image : Facebook)
డయానా ప్రణాళిక ప్రకారం పాఠశాల నిర్మాణం దీర్ఘవృత్తాకారంలోకి వచ్చింది. ఈ ఆకారం మూలంగా నిర్మాణం దృఢత్వం పెరిగింది. ఇసుకరాయి, సున్నం వినియోగించి గదులను నిర్మించారు. పైన పందిరి వంటి కట్టడం, గోడలకు వేసిన జాలీలు ఇసుకను లోనికి రాకుండా కట్టడి చేశాయి. సూర్యుడి కిరణాలు కొంచెం సేపు మాత్రమే గోడలపై పడటంతో వేడి పెరగలేదు. చల్లగాలి మాత్రమే గదుల్లోకి ప్రవేశించడంతో ఏసీలు లేకుండానే విద్యార్థులు చక్కటి అనుభూతి పొందుతున్నారు. వృత్తాకారం వల్ల ఒక గది నుంచి మరో గదికి వెళ్లేందుకు దూరం తగ్గింది. చిన్నారులు ఆడుకోవడానికి కోర్టుయార్డు స్థలం ఉపయోగపడింది. నిర్మాణం పై భాగంలో సౌరఫలకాలు ఏర్పాటు చేయడంతో విద్యుత్తు అవసరాలు కూడా తీరుతున్నాయి.
స్థానిక కాంట్రాక్టర్ చొరవతో..
ఎడారిలో కట్టడం అని తెలిసి కాంట్రాక్టర్లు పాఠశాల నిర్మాణానికి ముందుకురాలేదు. ఓ స్నేహితుడి ద్వారా ఈ కాంట్రాక్టు గురించి తెలుసుకొన్న స్థానిక కాంట్రాక్టర్ కరీంఖాన్ డయానాను సంప్రదించారు. ఇతర బిల్డర్లు తటపటాయిస్తున్న నేపథ్యంలో కరీంఖాన్ ధైర్యంగా ఆ ప్రాజెక్టులో భాగం కావడానికి ముందుకొచ్చారు. మొదట్లో డయానా గీసిన ప్లాన్ కరీంకు అర్థం కాలేదు. తరువాత 3D మోడల్ ద్వారా ఆమె ప్రజెంటేషన్ చేయడంతో ఆ ప్లాన్‌ను అవగతం చేసుకున్నారు. నిర్మాణ రంగంలో తనకున్న అనుభవంతో కొన్ని మార్పులు సూచించారు. అలా 2018 అక్టోబరులో ప్రారంభమైన ఈ పాఠశాల నిర్మాణం ఏడాదికి పూర్తయింది. అప్పటి నుంచి ఈ వైవిధ్యమైన పాఠశాలను చూడటానికి అనేక మంది పర్యాటకులు వస్తున్నారు.
జైసల్మేర్‌లోనే ఎందుకు?
వైశాల్యపరంగా రాజస్థాన్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. 8 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 80% శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కానీ అక్షరాస్యతలో స్త్రీ, పురుష వ్యత్యాసం చాలా ఉంది. మహిళల్లో అక్షరాస్యత 60% లోపే కన్పిస్తుంది. జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత కేవలం 32%శాతంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఎన్జీవో సంస్థ సిట్టా ఫౌండేషన్ దృష్టికి వచ్చింది. బాల్య వివాహాలు కూడా అధికంగా జరుగుతున్నట్లు తెలుసుకొన్న ఆ సంస్థ వారికి తోడ్పాటునందించేందుకు ముందుకొచ్చింది. బాలికలకు విద్య, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలను నిర్మించింది. ఈ ప్రయత్నానికి కొందరు రాజవంశస్థులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సహకరించారని ‘సిట్టా’ వ్యవస్థాపకుడు మైఖేల్ డూబే తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC Paper Leak: చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు