ఆ ఇంట్లో 480 పిల్లులు.. 12 కుక్కలు..!

మూగజీవాలపై మానవులకు రోజురోజుకూ ప్రేమ పెరుగుతోంది. కాపలా, కాలక్షేపం, ఆత్మీయత, అనురాగం, ఒంటరితనం నుంచి వెసులుబాటు.. కారణం ఏదైనా మనిషికి జీవన గమనంలో పెంపుడు జంతువులు ఓ భాగంగా మారిపోయాయి.

Published : 05 Dec 2020 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూగజీవాలతో మానవులకు ఉన్న అనుబంధం తెలిసిందే. కాపలా, కాలక్షేపం, ఆత్మీయత, అనురాగం, ఒంటరితనం నుంచి వెసులుబాటు.. కారణం ఏదైనా మనిషికి జీవన గమనంలో పెంపుడు జంతువులు ఓ భాగంగా మారిపోయాయి. అయితే ఎక్కువ మంది తమ ఇళ్లలో కుక్కలను, పక్షులను పెంచుకోవడానికి ఇష్టపడతారు.  ఒమన్‌ దేశానికి చెందిన 51 ఏళ్ల జంతు ప్రేమికురాలు మర్యం-అల్‌-బలూషీ తన ఇంట్లో ఏకంగా 480 పిల్లులు, 12 కుక్కలను పెంచి పోషిస్తున్నారు. వాటి ఆహారం, బాగోగులు తీర్చేందుకు  ఏకంగా  నెలకు 8000 అమెరికా డాలర్లు (దాదాపు 6 లక్షలు) ఖర్చు చేస్తున్నారు. 
జంతుప్రేమికురాలిగా మారారిలా..
2008లో ఆమె కుమారుడు ఒక చిన్న పర్షియన్‌ పిల్లిని తీసుకొచ్చాడు. అప్పుడు దాన్ని పెంచుకోవడానికి బలూషీ ఒప్పుకోలేదు. క్రమంగా ఆమె కుమారుడు ఆ పిల్లిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో రోజులు గడిచేకొద్దీ ఆమె దానికి ఆహారం తినిపించడం, స్నానం చేయించడంతోపాటు ఎక్కువ సమయం దానితోనే గడిపింది. 2011లో అల్‌-బలూషీ డిప్రెషన్‌కు గురయ్యారు. ఆ సమయంలో తాను పెంచిన పిల్లి తోడుగా ఉండటంతో ఆమె జంతువులపై ప్రేమను పెంచుకున్నారు.  అప్పటి నుంచి వందల సంఖ్యలో పిల్లులను, కుక్కలను తీసుకొచ్చి తన ఇంట్లోనే పెంచడం అలవాటుగా మార్చుకున్నారు.


దేశవిదేశాల నుంచి ఆర్థిక సాయం
అయితే మొదట్లో ఆమెకు ఎవరూ ఆర్థిక సాయం చేయలేదు. పైగా ఎక్కువ సంఖ్యలో పెంపుడు జంతువులు ఉన్నందున అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇరుగుపొరుగు వారు సైతం ఆమెపై తరచూ అధికారులకు ఫిర్యాదు చేసేవారు. అయినా అమె బెదరలేదు. పైగా మరింత సమయం వాటికోసం కేటాయించేవారు. ఈ క్రమంలోనే ఆమె సామాజిక మాధ్యమాల్లో వాటి ఫొటోలను పోస్ట్‌ చేయడం ప్రారంభించారు. దీంతో దేశవిదేశాల్లో ఉన్న జంతు ప్రేమికులు ఆమెకు విరాళాలు  పంపడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ విరాళాలతోనే వాటి  బాగోగులు చూస్తున్నారు.
" ప్రతి ఒక్కరు మూగజీవాలను కరుణతో చూడాలి. దేవుడు మనకు తెలివి, ప్రేమించే హృదయం ఇచ్చాడు.  దీంతో ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే తోటివారితో పంచుకుంటాం. కానీ మూగజీవాలు అలా కాదు. ఆకలైనా, అనారోగ్యంగా ఉన్నా మనతో చెప్పుకోలేవు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో జంతువులను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలంటూ లేవు. అందుకే సాధ్యమైనంత మేరకు మూగజీవాలకు ఆశ్రయం కల్పిస్తున్నా’నని ఆమె వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని