Mistakes: అక్షరం తారుమారైతే భారీ నష్టాలెలా?!  

పని త్వరగా పూర్తి చేయాలన్న ఆరాటం కావొచ్చు.. నిర్లక్ష్యం కావొచ్చు.. అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. అయితే, అవి చిన్నవే కదా అని వదిలేసినా, గుర్తించలేకపోయినా భారీ నష్టాలను తెచ్చి పెట్టే ఆస్కారం ఉంది. గతంలో అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.

Updated : 12 Nov 2021 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పని త్వరగా పూర్తి చేయాలన్న ఆరాటం కావొచ్చు.. నిర్లక్ష్యం కావొచ్చు.. అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. అయితే, అవి చిన్నవే కదా అని వదిలేసినా, గుర్తించలేకపోయినా భారీ నష్టాలను తెచ్చి పెట్టే ఆస్కారం ఉంది. గతంలో అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో ఒక అక్షరం తప్పు టైప్‌ చేయడం వల్ల నాసాకు చెందిన భారీ రాకెట్‌ మధ్యలోనే కుప్పకూలింది. ఒక అక్షరం మూలంగా శతాబ్దకాలంగా ఉనికిలో ఉన్న సంస్థ మూతపడింది. కోట్ల విలువ చేసే షేర్లు ఒక్క యెన్‌కు అమ్ముడుపోయాయి. ఆశ్చర్యంగా ఉంది కదా..! వివరాల్లోకి వెళితే..

సంఖ్యలు అటు ఇటై..

చిన్న తప్పు వల్ల జపాన్‌కు చెందిన మిజుహొ సెక్యూరిటీస్‌ కంపెనీ 2005లో 225 మిలియన్‌ డాలర్లు నష్టపోయింది. స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ లిస్టులో మిజుహొ సంస్థ షేర్లలో ఒక్క షేరు 6,10,000యెన్లు అని రాయాల్సిన చోట 6,10,000 షేర్లు ఒక్క యెన్‌గా రాశారు. దీంతో షేర్ల కొనుగోలు విపరీతంగా పెరిగింది. తప్పు తెలుసుకున్న సంస్థ షేర్ల కొనుగోలును రద్దు చేయాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ టోక్యో ఎక్స్‌ఛేంజ్‌ రద్దు చేయలేదు. దీంతో మిజుహో కంపెనీ 225మిలియన్‌ డాలర్లు నష్టం చవిచూడాల్సి వచ్చింది.

ఒకదానికి బదులు మరొకటి

‘టేలర్‌ అండ్‌ సన్స్‌’ అనే ఇంజినీరింగ్‌ వర్క్స్‌ సంస్థ వేల్స్‌లో మంచి ఆదరణ పొందింది. అయితే, ‘టేలర్‌ అండ్‌ సన్‌’ పేరుతో మరో సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ కార్యకలాపాలు వేరే అయినా.. దీని మూలంగా టేలర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ మూతపడింది. దీనికి కారణం మరో సంస్థ చేసిన చిన్న తప్పు. కంపెనీస్‌ హౌజ్‌ అనే సంస్థ యూకెలోని వ్యాపారాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూ ఉంటుంది. ఏ సంస్థలు నడుస్తున్నాయి.. ఏ సంస్థలు మూతపడ్డాయనే విషయాలను ఎప్పటికప్పుడు జాబితా రూపొందిస్తుంటుంది. ఈ క్రమంలో 2009లో ‘టేలర్‌ అండ్‌ సన్‌’ అనే సంస్థ మూతపడగా.. పొరపాటున ‘టేలర్‌ అండ్‌ సన్స్‌’ కంపెనీ మూతపడినట్లు జాబితాలో పేర్కొంది. దీంతో ఆ కంపెనీ మూతపడిందనుకొని కస్టమర్లు రావడం మానేశారు. అలా 124 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ తీవ్రంగా నష్టపోయి 2014లో నిజంగానే మూతపడింది. 

కామా(,) తెచ్చిన నష్టం

1872లో అమెరికా ప్రభుత్వం దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌ ట్యాక్స్‌ చట్టానికి సవరణలు చేసింది. ఇందులో భాగంగా దిగుమతి చేసుకునే పండ్లు, మొక్కల్లో వేటికి ట్యాక్స్ వర్తిస్తుంది.. వేటికి వర్తించదనే జాబితాను సిద్ధం చేసింది. అయితే, ట్యాక్స్‌ వర్తించని జాబితాలో పండ్లమొక్కలు అని రాయాల్సిన చోట.. పొరపాటున పండ్లు, మొక్కలు అని రాశారు. దీంతో వ్యాపారులు ఈ పొరపాటును ఆసరా చేసుకొని పండ్లు, మొక్కలు ట్యాక్స్‌ లేకుండానే దిగుమతి చేసుకున్నారు. దీనివల్ల అప్పట్లోనే అమెరికా 2 మిలియన్‌ డాలర్లు నష్టపోయింది. 

ఒక్క అక్షరం.. రాకెట్‌ ప్రయోగం నాశనం

శుక్ర గ్రహంపై పరిశోధన కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) 1962లో మెరినర్‌-1 అనే రాకెట్‌ను ప్రయోగించింది. రాకెట్‌ గాల్లోకి దూసుకెళ్లిన ఐదు నిమిషాలకే పేలిపోయింది. ఎందుకలా జరిగిందో పరిశీలించగా కంప్యూటర్‌ కోడింగ్‌లో అక్షర దోషం వల్లేనని తేలింది. రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కోడింగ్‌లో R- అని ఉండాల్సిన చోట కేవలం R మాత్రమే ఉండటాన్ని గుర్తించారు. చేతితో కోడింగ్‌ రాసి తర్వాత దాన్ని కంప్యూటర్‌లో ప్రోగ్రామ్‌ చేసే సమయంలో R అక్షరం పక్కన -(హైఫన్‌) పెట్టడం మరచిపోయారు. దీంతోనే రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. దీనివల్ల అమెరికాకు అప్పట్లోనే 80 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.

617 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి

టోక్యో స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ఓ ట్రేడర్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లో ఒక బటన్‌ నొక్కాల్సింది పొరపాటున షేర్ల కొనుగోలును రద్దు చేసే బటన్‌ నొక్కేశాడు. దీంతో ట్రేడింగ్‌లో దాదాపు 42 లావాదేవీలు రద్దయ్యాయి. ఫలితంగా 617 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఈ ఘటన 2014 సెప్టెంబర్‌లో జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని