Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్‌ అద్భుత విజయానికి కారణాలివే!

ఇటీవల యూఎన్‌ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే..

Updated : 22 Mar 2024 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశాల్లో (World Happiness Report) ఫిన్లాండ్‌ మరోసారి అగ్ర స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.  జీవనశైలిలో వస్తోన్న మార్పులతో జీవితాలను ఒత్తిడి, అసంతృప్తి వంటి ప్రతికూలతలు మానవ సమాజాన్ని కమ్మేస్తున్న తరుణంలో వరుసగా ఏడోసారి కూడా ఆ దేశం (Finland).. ‘హ్యాపీలాండ్‌’గా ఘనతను దక్కించుకోవడం విశేషం. మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ సందర్భంగా యూఎన్‌ ఆధారిత సంస్థ విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో మళ్లీ ఫిన్లాండ్‌ అగ్ర స్థానంలో నిలిచి అద్భుతమైన విజయం దక్కించుకోవడం వెనుక ఉన్న కొన్ని కారణాలివే..

  • ఉద్యోగులకు తక్కువ పని గంటలు అమలు చేయడం. కుటుంబాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడంతో పాటు వారికి ఉదారంగా సెలవులు ఇవ్వడం ద్వారా పని-జీవితాన్ని సమతుల్యం చేసుకొనే అవకాశం కల్పించే విధానాలు అనుసరిస్తున్నారు. తద్వారా అక్కడి ప్రజలకు తగిన విశ్రాంతితో పాటు కుటుంబం, వ్యక్తిగత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజల్లో సంతృప్తి స్థాయిలు మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు.
  • ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావ్యవస్థ అమలు చేస్తున్నారు. ప్రీ స్కూల్‌ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఉచిత విద్యను అందించడంతో పాటు ప్రామాణిక పరీక్షల కన్నా సమగ్ర అభివృద్ధిపై దృష్టిసారిస్తారు. పటిష్టమైన విద్యా వ్యవస్థతో నాణ్యమైన విద్యనందించడం ద్వారా పిల్లల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతో వారు అన్నివిధాలా వికాసం చెందేలా చూస్తారు. 
  • ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ద్వారా అధిక నాణ్యతతో కూడిన వైద్య సేవలందించడం ఇక్కడి మరో ప్రత్యేకత. అందరికీ సమానమైన వైద్య సేవలు అందించడంతో అక్కడి ప్రజలు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువ కాలం పాటు జీవిస్తారు. 
  • ప్రపంచ దేశాల్లో ఇక్కడ అవినీతి అత్యల్ప స్థాయిలో ఉంది. ఇది అక్కడి ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై నమ్మకం పెంచడంతో పాటు నిజాయతీ, న్యాయబద్ధమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో దోహదపడుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక పాలన వంటి అంశాలతో విశ్వసనీయమైన సమాజంగా ఫిన్లాండ్‌ కీర్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
  • మహిళా సాధికారికతను ప్రోత్సహించడం, సమాజంలోని వివిధ రంగాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు తగ్గించడమే లక్ష్యంగా అమలుచేస్తోన్న విధానాలు లింగ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వివిధ హోదాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సమాన అవకాశాలు కల్పించడం వంటివి సమాన, సమ్మిళిత సమాజం దిశగా దేశాన్ని నడిపించడంలో దోహదపడుతున్నాయి. 
  • ఫిన్లాండ్‌ సంస్కృతిలో ఆవిరి స్నానాలు (సౌనాస్‌)కు ప్రత్యేక స్థానం ఉంది. శరీరానికి విశ్రాంతినివ్వడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సామాజిక సంబంధాలను పెంచుకొనేందుకు వీలుగా ఈ ఆవిరి స్నానాలను ఉపయోగించుకుంటున్నారు. దేశంలో దాదాపు 30లక్షల ఆవిరి స్నానాల గదులు ఉన్నాయి. 
  • సామూహిక శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రజలు పరస్పరం సన్నిహిత సంబంధాలు కొనసాగించడం ఆ దేశాన్ని ఆనందమయ దేశంగా మార్చడంలో మరో ప్రధాన ప్రామాణికత. ఒక సంఘంగా ఉండటం, ఆనందాన్ని పెంపొందించే వ్యక్తిత్వం, పరస్పర అనుసంధానభావంతో ఉండటం ఇక్కడి ప్రజల్లో ఉన్న మరో ప్రత్యేకత.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని