Rs 75 coin: నూతన పార్లమెంట్‌ స్మారక నాణెం ఎలా పొందాలి?

పార్లమెంట్‌ నూతన భవనం (Parliament new Building) ప్రారంభం రోజున రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. వీటిని చలామణిలో ఉపయోగించుకోవచ్చా?పొందడం ఎలా?

Published : 27 May 2023 09:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నూతన పార్లమెంట్‌ భవనాన్ని (Parliament new Building) మే 28న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం రూ.75 నాణేన్ని విడుదల చేయనుంది. ఇలా విడుదల చేయడం కొత్తేం కాదు. ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని స్మారక నాణేలను భారత ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ ప్రత్యేక నాణేలను రూపొందించారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేయనున్న నాణెం ప్రత్యేకతలు ఏంటి? వాటిని రోజువారీ లావాదేవీలకు వినియోగించుకోవచ్చా? స్మారక నాణేలను పొందడం ఎలా? వంటి విషయాలు తెలుసుకుందాం..

రూ.75 నాణెం ప్రత్యేకతలు ఇవే..!

పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవ సందర్భంగా రూ.75 నాణేన్ని విడుదల చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. దీనిపై నూతన పార్లమెంట్‌ భవనం చిత్రం ఉండనుంది. దాని ఎగువన ‘సన్‌సద్‌ సానుకూల్‌’ అని దేవనాగరి లిపిలో.. దిగువన ‘పార్లమెంట్‌ కాంప్లెక్స్‌’ అని ఆంగ్లంలో ముద్రించి ఉంటుంది. ఈ నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. దాని అంచుల వెంట 200 వంకీలు ఉంటాయి. దాదాపు 35 గ్రాముల బరువు ఉంటుంది. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌ కలిపిన మిశ్రమంతో తయారు చేసినట్లు సమాచారం. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ దిగువ భాగంలో ‘2023’ అని రాసి ఉంటుంది. నాణేనికి మరోవైపు మూడు సింహాలతో కూడిన అశోక స్థూపం దాని దిగువన ‘సత్యమేవ జయతే’ అని, దానికి ఇరువైపులా ‘భారత్‌’ అని దేవనాగరి లిపిలో, ఇంగ్లీషులో ‘ఇండియా’ అని రాసి ఉంటుంది. మూడు సింహాల గుర్తు కింద రూపాయి గుర్తు , నాణెం విలువను సూచిస్తూ ‘75’ సంఖ్య అడుగు భాగాన ముద్రిస్తారు. ఇంతకు ముందు కూడా ₹75 నాణేన్ని విడుదల చేశారు. ఫడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) వజ్రోత్సవాలను పురస్కరించుకొని కేంద్రం ఈ నాణేన్ని రూపొందించింది.

లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చా?

సాధారణ కరెన్సీ నోట్లు, నాణేల మాదిరిగా స్మారక నాణేలు వినియోగం కోసం జారీ చేసినవి కాదు. వీటిని బంగారం, వెండి తదితర లోహాలతో తయారు చేయడం వల్ల వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని కేవలం సేకరించడానికి తప్ప.. వినియోగానికి ఉపయోగించరు. మరోవైపు సాధారణ లోహంతో తయారు చేసిన స్మారక నాణేలు కొంతకాలం పాటు చలామణిలో ఉంటాయి.

ఎక్కడెక్కడ దొరుకుతాయి?

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, నోయిడాలోని ముద్రణాలయాల్లో స్మారక నాణేలను రూపొందిస్తారు. వీటి తయారీ ఖర్చు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నందున పరిమిత సంఖ్యలోనే తయారు చేస్తారు. నాణేల సేకరణపై ఆసక్తి ఉన్నవారు దేశంలోని ముద్రణాలయాలు, కొన్ని ఏజెన్సీల ద్వారా మాత్రమే వీటిని పొందేందుకు వీలుంది. అలాగని నేరుగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. Kolkata Mint, Mumbai Mint, Hyderabad Mint అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లోనూ వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, స్మారక నాణేల విలువ ఎక్కువగా ఉన్నందున కేవలం నాణేలు సేకరించే అలవాటు ఉన్నవారు మాత్రమే వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని