Nuclear policy : భారత్‌ అణ్వాయుధాలు ప్రయోగించాల్సి వస్తే..!

అమెరికాతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్‌’ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా తాత్కాలికంగా వైదొలిగింది. మరి భారత్‌ అణ్వాయుధాల వాడకంపై ఎలాంటి కట్టుబాట్లు పాటిస్తోందో చదివేయండి.

Updated : 23 Feb 2023 10:27 IST

ప్రపంచంపై ఆధిపత్యం నిలబెట్టుకొనేందుకు అమెరికా (america) తొలిసారి అణ్వాయుధాలను అభివృద్ధి చేసింది.  అది రెండో ప్రపంచ యుద్ధం వేగంగా ముగించేందుకు జపాన్‌(Japan)లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు ప్రయోగించింది. తదనంతర పరిణామాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ‘తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు’ అనేది సామెత. ఆ తర్వాత రష్యా కొన్నేళ్లలోనే అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో అగ్ర రాజ్యాల మధ్య అణుపోటీ మొదలైంది. అనంతరం రష్యా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ‘జార్‌ బంబా’ను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో అణుయుద్ధ భయం ప్రపంచాన్ని పీడించింది. దీంతో పలు అణు ఒప్పందాలు తెరపైకి వచ్చాయి. 2010లో అమెరికాతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్‌’ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా వైదొలిగింది. దీంతో ఆయా దేశాల అణ్వాయుధ విధానాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్‌ అనుసరిస్తున్న ‘అణు సిద్ధాంతం’(nuclear doctrine) ఎలా ఉందో పరిశీలించండి..

మొదటి దెబ్బ మనది కాదు..!

భారత్‌ తొలిసారి 1974లో.. ఆ తర్వాత 1998లో చేపట్టిన పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతమయ్యాయి. అప్పటి నుంచి ‘నో ఫస్ట్‌ యూజ్‌’ విధానాన్ని అనుసరిస్తోంది. మన దగ్గర ఉన్న అణ్వాయుధాలను.. శత్రు నిరోధకాలుగా మాత్రమే వినియోగిస్తామని నాటి ప్రధాని వాజ్‌పేయీ(Vajpayee) నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం అణ్వాయుధ రహితంగా ఉండాలని భారత్‌ కోరుకుంటోంది. ఏదైనా శత్రుదేశం అణు దాడికి పాల్పడిన సందర్భంలో మాత్రమే ప్రతిదాడికి అణ్వాయుధాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ విధానంలో ఇప్పటివరకూ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. భారత్‌ అణ్వాయుధాల వాడకం ఎలా ఉంటుందో తెలిపేలా 2003లో తన అణు సిద్ధాంతాన్ని(nuclear doctrine) ప్రకటించింది. అందులోనూ ‘నో ఫస్ట్‌ యూజ్‌’ విధానాన్ని నొక్కి చెప్పారు. అయితే, భారత్‌పై కొన్ని రకాల ఆయుధాలతో దాడి జరిగితే మాత్రం ప్రతి దాడి తీవ్రత అధికంగా ఉంటుందని, శత్రుదేశానికి జరిగే నష్టం ఊహించని విధంగా ఉంటుందని వెల్లడించారు. జీవ, రసాయన ఆయుధాలతో దాడి జరిగిన సందర్భంలోనూ అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించవచ్చని భారత్‌ అణు సిద్ధాంతం చెబుతోంది. 

‘నో ఫస్ట్‌ యూజ్‌’ ఎందుకు?

ప్రపంచంలో కొన్ని దేశాల వద్దే అణ్వాయుధాలున్నాయి. ఈ క్రమంలో వీటికి అణ్వాయుధాలు లేని దేశాలతో యుద్ధం తలెత్తితే ఏకపక్షంగా విజయం లభిస్తుంది. ఫలితంగా చిన్న దేశాల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే అణ్వాయుధాల వినియోగంలో కొన్ని నిర్దిష్ట విధానాలను అనుసరిస్తున్నాయి. అందులో ఒకటి ‘నో ఫస్ట్‌ యూజ్‌’. కానీ, ఈ విధానాన్ని పాటించే దేశాలు అతి స్వల్పం. 1964లో చైనా అణు పరీక్షలు చేపట్టింది. కానీ, తాము ఏ యుద్ధంలోనూ తొలుత అణ్వాయుధాలు ఉపయోగించమని వాగ్దానం చేసింది. అది నోటి మాట మాత్రమే. కానీ, ఇది లిఖిత పూర్వకంగా లేదు. దాంతో ఏదైనా ఆపద లేదా సంఘర్షణ జరిగితే చైనా మాట తప్పే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చైనా(china), భారత్‌ మాత్రమే షరతులు లేని ‘నో ఫస్ట్‌ యూజ్‌’ విధానాన్ని అనుసరిస్తున్న దేశాలుగా ఉన్నాయి. 

ఒక్కో దేశానిది.. ఒక్కో తీరు..

అమెరికా వంటి దేశాలు ఎన్‌పీటీ(నాన్‌ ప్రొలిఫరేషన్‌ ట్రీటీ)లో భాగస్వాములుగా ఉన్నాయి. అణ్వాయుధ రహిత దేశాలపై దాడి చేయబోమని అవి ప్రమాణం చేశాయి. ఒక వేళ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంపై వాటిని ప్రయోగించాల్సి వస్తే అమెరికా, దాని మిత్ర దేశాలను కాపాడుకునే క్రమంలో ‘ఆత్మరక్షణ కోసం మాత్రమే’ వినియోగిస్తామని వాషింగ్టన్‌ పేర్కొంది. 1982లో నాటి సోవియట్‌ యూనియన్‌ నేత లియోనిడ్‌ బ్రెజ్‌నెవ్‌ కూడా మాస్కో ‘నో ఫస్ట్‌ యూజ్‌’ పాలసీని పాటిస్తుందని చెప్పారు. 1993లో దీనికి భిన్నంగా అణ్వాయుధాలు లేని దేశాలపై మాత్రమే వాడమని రష్యా చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అవసరమైతే తామే ముందు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఫ్రాన్స్‌ స్పష్టం చేసింది. యూకే మాత్రం అస్పష్టమైన విధానంతో ముందుకెళ్తోంది. 

పాక్‌ వైఖరి ఏంటి?

భారత్ దాయాది దేశం పాక్‌(pak) కూడా అణుశక్తే. ఆ ఆయుధాల వాడకంపై అణు సిద్ధాంతాలేమీ ఆ దేశం ప్రతిపాదించలేదు. పరిస్థితులను బట్టి వాడతామని ఇస్లామాబాద్‌ తరచూ చెబుతూ వస్తోంది. 2002లో అప్పటి అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఒక అడుగు ముందుకేసి పాక్‌ ఉనికిని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వాడాల్సి వస్తే అది ఇండియాపైనేనని వ్యాఖ్యానించాడు. నాటి నుంచి నేటి వరకు ఆ దేశ నాయకులు, సైన్యాధ్యక్షులు బీరాలు పోతూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.

భారత్‌ ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, గత రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌లు ‘నో ఫస్ట్‌ యూజ్‌’ పాలసీలో మార్పులు తీసుకొస్తామనే సంకేతాలు ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని