Mosquirix: ప్రపంచంలోనే తొలి మలేరియా టీకా.. వినియోగానికి WHO సిఫార్సు!

మలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తోన్న Mosquirix టీకాను ఇక నుంచి విస్తృత స్థాయిలో వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ వెల్లడించారు.

Published : 07 Oct 2021 23:46 IST

ప్రజారోగ్య చరిత్ర గతినే మారుస్తుంది - డబ్ల్యూహెచ్‌ఓ

వాషింగ్టన్‌: ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న మలేరియాను ఎదుర్కొనే ఆయుధం అందుబాటులోకి వచ్చింది. ఈ భయంకరమైన వ్యాధిని తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలు సుదీర్ఘకాలంగా వేచిచూస్తోన్న నేపథ్యంలో మలేరియా టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఆమోదం తెలిపింది. మలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తోన్న Mosquirix టీకాను ఇక నుంచి విస్తృత స్థాయిలో వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ వెల్లడించారు. ప్రజారోగ్య చరిత్ర గతిని మార్చే ఈ టీకా ప్రపంచానికి ఓ బహుమతి అని పేర్కొన్నారు.

‘మలేరియా పరిశోధకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన నేను.. భయంకరమైన, ప్రాచీనమైన ఈ వ్యాధిని ఎదుర్కొనే సమర్థవంతమైన టీకా వస్తుందని ఎంతో కాలంగా ఆశగా ఎదిరిచూశాను. ఆ రోజు వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్‌ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ప్రకటించారు. ముఖ్యంగా మలేరియా ప్రాబల్యం అధికంగా ఉన్న ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల్లో చిన్నారులకు విస్తృత స్థాయిలో వీటిని పంపిణీ చేసేందుకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు.

ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు..

దోమకాటు వల్ల సంభవించే ఈ భయంకరమైన మలేరియా వ్యాధి కేసులు అభివృద్ధి చెందుతోన్న, వెనుకబడిన దేశాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటి నిర్మూలన కోసం ఎంతోకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా రూపొందించిన ఈ మలేరియా టీకా తయారీ, ప్రయోగాలపై దాదాపు ముప్పై ఏళ్ల నుంచి కృషి జరుగుతుంది. మలేరియా కేసుల్లో అత్యంత ప్రమాద తీవ్రతకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిపారమ్‌ రకాన్ని ఎదుర్కొనే ఈ వ్యాక్సిన్‌ (RTS,S/AS01)ను గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ (GSK) రూపొందించింది. వీటి తుది దశ ప్రయోగాలు 2009 నుంచి 2014 కొనసాగాయి. క్లినికల్‌ ట్రయల్స్‌లో ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలడంతో పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు ఆఫ్రికన్‌ దేశాల్లో వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో అనుమతి ఇచ్చింది. దీంతో మలేరియా తీవ్రత అధికంగా ఉన్న కెన్యా, మలావీ, ఘానా దేశాల్లో దాదాపు 8 లక్షల మంది చిన్నారులకు నాలుగు డోసుల్లో ఈ వ్యాక్సిన్‌ను అందించారు. వీటి ఫలితాలను విశ్లేషించగా దాదాపు 40శాతం వరకు కేసులు తగ్గినట్లు గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2019లోనే ప్రపంచవ్యాప్తంగా 22కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. వారిలో 4లక్షల మంది మృత్యువాతపడగా..2లక్షల 74 వేల (67శాతం) మంది చిన్నారుల్లోనే ఉండడం ఆందోళనకర విషయం. ఆ ఏడాది కేవలం ఒక్క భారత్‌లోనే 56లక్షల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మలేరియా వ్యాక్సిన్‌కు ఆమోదం లభించడం ప్రజారోగ్యంలో గొప్ప విషయమని ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వీటి పంపిణీ ఒక సవాలేనని పేర్కొంటున్నారు. వైరస్‌ ప్రాబల్యం అధికంగా ఉన్నచోట వీటిని పంపిణీని ప్రారంభించినా.. 2030 నాటికి ప్రతిఏటా 5 నుంచి 11కోట్ల డోసులు అవసరమవుతాయని డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలోని ఓ నివేదిక అంచనా వేసింది. కానీ, 2028 నాటికి ప్రతిఏటా కోటిన్నర డోసుల Mosquirix మాత్రమే ఉత్పత్తి చేయగలమని జీఎస్‌కే ఇదివరకే స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని