Earthquakes : ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కు చెదరని భవనం!
అమెరికాలో (America) ఓ 10 అంతస్తుల భవనం 100 కృత్రిమ భూకంపాలను (Earthquakes) తట్టుకొని నిలబడింది. భవిష్యత్తులో ఎన్ని భూకంపాలు వచ్చినా ఆ భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లదని దాని నిర్మాణదారులు చెబుతున్నారు.
Image : Englekirk Structural Engineering Center (ESEC)
అమెరికాలోని (America) శాన్ డియాగో పట్టణ శివారులో గత నెలలో ఓ భారీ భూకంపం (Earthquake) సంభవించింది. కొన్ని నిమిషాల తరువాత మరో భూకంపం వచ్చింది. ఈ రెండు విపత్తుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. విచిత్రంగా ఉంది కదూ! నిజానికి అవి కృత్రిమ భూకంపాలు. కలపతో రూపొందించిన ఓ 10 అంతస్తుల భవన (Wooden Building) సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆ ప్రయోగం చేపట్టారు. ఆ విశేషాలేంటో తెలుసుకోండి.
ఎందుకీ ప్రయోగం?
సిమెంటు, ఇసుక, కంకర వినియోగించి నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు భూకంపాలను తట్టుకోలేవు. అమెరికాలో టోర్నడోల విజృంభణ కూడా ఎక్కువే. కాబట్టి అలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఆ ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ 10 అంతస్తుల కలప భవనాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు సుమారు 100 కృత్రిమ భూకంపాలు సృష్టించి దీనిపై ప్రయోగాలు చేశారు. వాటన్నింటినీ ఈ భవనం తట్టుకుంది. ఆగస్టులోగా మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నారు. అలా చేయడం వల్ల ఈ కలప భవనం నాణ్యత ఏంటో బయటి ప్రపంచానికి తెలుస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం సుమారు 3.7 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 10 అంతస్తుల భవనం గట్టిదని తేలితే దాని ఎత్తు 18 అంతస్తుల వరకు పెంచే యోచనలో ఉన్నారు.
రెండు భయంకర భూకంపాలతో ప్రారంభం
కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్ (సీఎస్‌ఎం) ఆధ్వర్యంలో యూసీఎస్డీ షేక్ టేబుల్‌ను వినియోగించి కృత్రిమ భూకంప ప్రయోగాలు చేపట్టారు. వెయ్యి చదరపు అడుగుల్లోని షేక్ టేబుల్‌కు అమర్చిన హైడ్రాలిక్ యాక్యుయేటర్లు ఆరు డిగ్రీల కోణంలో కదులుతూ భూకంపం తరహా తీవ్రతను కృత్రిమంగా సృష్టిస్తాయి. అందులో భాగంగా తొలుత 6.7 తీవ్రతతో ‘నార్త్ రిడ్జ్’ భూకంపాన్ని సిములేటర్ల సాయంతో సృష్టించారు. 1994 ప్రాంతంలో లాస్ ఏంజెలెస్‌లో 20 నిమిషాలపాటు వచ్చిన భూకంపం ధాటికి సుమారు 60 మంది మరణించారు. అప్పట్లోనే 40 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. కానీ, ఇటీవల ఇంజినీర్లు రూపొందించిన ఈ 10 అంతస్తుల భవనానికి ఏమీ కాలేదు. అటూఇటూ ఊగిపోయి అది మళ్లీ యథాస్థానంలోకి వచ్చింది. కాసేపటి తరువాత 1999లో తైవాన్‌లో సంభవించిన ‘ఛి ఛి’ భూకంపం తరహాలో ప్రకంపనలు సృష్టించారు. రిక్టార్ స్కేల్‌పై దాని తీవ్రత 7.7. తాజాగా అటువంటి భారీ ప్రకంపనలు సృష్టించి చూసినా ఈ కలప భవనం చెక్కు చెదర్లేదు.
ప్రయోగం కెమెరాల్లో నిక్షిప్తం
ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు వాస్తుశిల్పులు, ఇంజినీర్లు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక భవనం చుట్టూ కెమెరాలు అమర్చి ఆ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయించారు. డ్రోన్ కెమెరాలను వినియోగించి భవనం కదులుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. తొలి మూడు అంతస్తుల చుట్టూ కిటికీలు అమర్చారు. మిగిలిన అంతస్తులను బహిరంగంగానే ఉంచారు. అయితే ప్రతి అంతస్తులో నాలుగు ‘రాకింగ్ వాల్స్’ను ఏర్పాటు చేశారు. భూకంపం వల్ల అధిక నష్టం జరగకుండా ఇంజినీర్లు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవే కాకుండా లోపల గోడలు, మెట్లను కూడా ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేశారు. భవనం మొత్తం సెన్సార్లను అమర్చారు. ప్రయోగం మధ్యలో భవనం అమరికలు చెదిరి నేలపై పడిపోకుండా వాటిని తీగలతో బిగించారు.
కృత్రిమ భూకంపం సృష్టించి తాము చేసిన ఈ ప్రయోగాల్లో ఆశించిన ఫలితమే వచ్చిందని సీఎస్‌ఎం మైన్స్ ఇంజినీర్, ప్రాజెక్ట్స్ కో డైరెక్టర్ షైలింగ్ పై తెలిపారు. భవనం యథాస్థానంలో వచ్చి నిలబడిందని చెప్పారు. దాని నిర్మాణం స్ప్రింగ్ లేదా రబ్బర్ బ్యాండ్‌లా సాగేలా డిజైన్ చేశామని ఆయన వెల్లడించారు. భవనం బాగా ఊగుతున్న సమయంలో పై భాగం అటూఇటూ ఒకటి నుంచి రెండు అడుగుల దూరం కదిలిందని ఇంజినీర్లు తెలిపారు. ఈ ప్రయోగ భవనం తయారీలో క్రాస్ ల్యామినేటెడ్ కలపతోపాటు స్టీల్ వినియోగించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్
-
BJP: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!
-
TS High Court: అక్టోబరులోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!