Flashback : బాబ్బాబు.. ఈ రైలును కాస్త తొయ్యండయ్యా!

ఒకప్పుడు రైళ్లు మధ్యలో మొరాయిస్తే ప్రయాణికులు దిగి తోసేవారు. ఆ సంగతేంటో చదివేయండి.

Updated : 18 Mar 2023 12:21 IST

అమెరికా(America)లోని విల్మింగ్టన్‌(Wilmington), లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles) నగరాల నుంచి లాంగ్‌బీచ్‌లోని విల్మోర్‌ ప్రాంతానికి 19వ శతాబ్దంలో కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే వీధి రైలు మార్గం(Street railway) ఏర్పాటైంది. తొలుత ఆ మార్గంలో రైళ్లను గుర్రాలు లాగేవి. తరువాత ఆవిరి యంత్రంతో నడిచే రైలు ఇంజిన్లను ప్రవేశపెట్టారు. దానిని విల్మింగ్టన్‌ అండ్‌ లాంగ్‌ బీచ్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్ రైల్‌ రోడ్డుగా పిలిచేవారు. క్రమంగా అది ‘ది గెట్‌ అవుట్‌ అండ్‌ పుష్‌ రైల్‌ రోడ్డు’(The Get Out And Push Railroad)గా మారి పోయింది. అంటే దిగి తోసే రైలు అని అర్థం. ఆ పేరు రావడానికి వెనుక కారణం ఏంటో తెలుసుకోండి.

స్థిరాస్తి ప్రాజెక్టు కోసం..

అమెరికాకు చెందిన జడ్జ్‌ రాబర్ట్‌ ఎం. విడ్నీ, అతడి స్నేహితుడు డబ్ల్యూ.ఈ. విల్మోర్‌ కలిసి 1882లో లాస్ ఏంజెలెస్‌ కౌంటీలో ఓ స్థిరాస్తి ప్రాజెక్టును చేపట్టారు. 10వేల ఎకరాల్లో ఆ ప్రాజెక్టును రూపొందించారు. దాంతో ఓ నగరాన్నే నిర్మించాలని వారిద్దరూ సంకల్పించారు. దానికి తొలుత ‘ది అమెరికన్‌ కాలనీ ట్రాక్ట్’ అని పేరు పెట్టారు. తరువాత విల్మోర్‌ సిటీగా పేరు మార్చారు. ఈ స్థిరాస్తి ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, నివాసాలు, చర్చి(Church), పార్క్‌ల నిర్మాణానికి  స్థలం వదిలిపెట్టారు. ప్రారంభంలో ఇక్కడి ప్లాట్లు చూడటానికి వచ్చేవారంతా లాస్‌ ఏంజెలెస్‌ నుంచి విల్మింగ్టన్‌ వరకు రైలు(Rail)లో వచ్చి.. అక్కడ్నుంచి గుర్రాలు, బగ్గీల్లో చేరుకొనేవారు. ఇదంతా ప్రయాసతో కూడిన పని అని కొనుగోలుదారులు చెప్పడంతో జడ్జ్‌ విడ్నీకి ఒక ఆలోచన వచ్చింది. విల్మింగ్టన్‌కు సమీపంలోని దక్షిణ పసిఫిక్‌ ట్రాక్‌లను విల్మోర్‌ సిటీతో కలిసేలా గుర్రాలు లాగే స్టీర్‌ కార్‌ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. 

సొంతంగా రైల్వే ప్రాజెక్టు

విడ్నీ రైలు, ట్రాక్‌ నిర్మాణ ప్రతిపాదనను లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదం లభించింది. గుర్రాలు లాగే స్టీర్‌ కార్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్టును తానే చేపట్టాలని విడ్నీ భావించాడు. అందుకోసం ఓ కంపెనీని స్థాపించి ముగ్గురు వడ్రంగులు, కొద్ది మంది సహాయకులతో ట్రాక్‌ నిర్మాణం ప్రారంభించాడు. గుర్రాలు లాగడానికి అవసరమైన కంపార్ట్‌మెంట్‌ తరహా బండ్లను విల్మోర్‌ సిటీలోనే చేయించాడు. వాటికి అమర్చాల్సిన ఇనుప చక్రాలను లాస్‌ ఏంజెలెస్‌ నుంచి తెప్పించాడు. మొత్తానికి గుర్రాలు లాగే స్టీర్‌ కార్‌ లైన్‌ను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాడు. 

దిగి నెట్టక తప్పలేదు!

రైల్వే లైను పూర్తి కావడంతో స్థిరాస్తి ప్రాజెక్టు వేలానికి ఒక తేదీని విడ్నీ ప్రకటించాడు. ఆ రోజు జనం తండోపతండాలుగా లాస్‌ ఏంజెలెస్‌ నుంచి బయల్దేరారు. విల్మోర్‌ జంక్షన్‌లో వారిని చూడగానే తాను రూపొందించిన గుర్రాలు లాగే స్టీర్‌ కార్‌ లైన్‌ ఏ మాత్రం సరిపోదని అతడికి అర్థమైంది. ఆయన చుట్టూ ఉన్న వడ్రంగులు కూడా గుర్రాలు లాగాల్సిన రైలు పూర్తిగా చెక్కతో తయారు చేశామని, ఇంత మంది ఎక్కితే అది కచ్చితంగా ముక్కలవుతుందని చెప్పారు. దీంతో విడ్నీ ఆ చుట్టుపక్కల ఉండే ఎడ్ల బండ్లను అద్దెకు తెచ్చి అందుబాటులో ఉంచాడు. కానీ, విడ్నీ టైమ్ బాగాలేదు. ముందు ఊహించినట్లుగానే ఆ చెక్క రైలు మార్గంమధ్యలోనే ముక్కలైపోయింది. దాంతో కొంత మంది పురుషులు రైలు దిగి దానిని తోస్తూ ముందుకు నడిపించారు. దాంతో అది ‘గెట్‌ అవుట్ అండ్ పుష్‌ రైల్‌ రోడ్డు’గా ముద్రపడిపోయింది.

వ్యాపారానికి బైబై

విడ్నీ స్థిరాస్తి వ్యాపారంలో 36 లాట్లు మాత్రమే విక్రయించగలిగాడు. అందులో 9 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ కేవలం 6 కుటుంబాలే నివాసం ఉండటానికి వచ్చాయి. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడికి రావడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. గుర్రాలు లాగే రైలు బండిని మెరుగు పరిచినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత వర్షాలు కూడా రావడంతో ఆ రైలు మార్గం కొట్టుకుపోయింది. దాంతో నిరాశ చెందిన విడ్నీ తన స్థిరాస్తి ప్రాజెక్టు వదిలేశాడు. భూమిని అసలు యజమానులకే మళ్లీ విక్రయించాడు. రోడ్‌ రైలు ప్రాజెక్టు మాత్రం తన వద్దే ఉంచుకున్నాడు.

స్టీమ్‌ ఇంజిన్‌ రైళ్ల ప్రవేశం

కొత్త యజమానులు విల్మోర్‌ సిటీ పేరును లాంగ్‌ బీచ్‌గా మార్చారు. వేసవి విడిదికి ఈ ప్రాంతం బాగుంటుందని చెబుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. జనాలను ఆకర్షించడానికి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌(Hotel) కూడా నిర్మించారు.
దాంతో విడ్నీ తన గుర్రాల రైలు బండి మార్గాన్ని ఆ  హోటల్‌ వరకు పొడిగించాడు. దానికి ప్రయాణికుల ఆదరణ పెరగడంతో గుర్రాలతో కాకుండా స్టీమ్‌ లోకోమోటివ్‌ ఇంజిన్లను ఆ మార్గంలో ప్రవేశపెట్టాలని భావించాడు. కొత్త రైలు ప్రాజెక్టు 1885 సెప్టెంబరులో ప్రారంభమైంది. రద్దీకి సరిపడా ట్రాక్‌లు నిర్మించారు. ప్రయోగ పరీక్షల్లో కొన్నిచోట్ల ఎత్తయిన ప్రదేశాల్లో రైలు ముందుకు కదల్లేక పోయింది. మరుసటి ఏడాది పూర్తిస్థాయిలో స్టీమ్‌ ఇంజిన్‌ రైళ్లతో ట్రాక్‌పై రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఆ ఇంజిన్లకు కూడా లాగే సత్తా ఉండేది కాదు. దాంతో ప్రయాణికులు మళ్లీ దిగి నెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. అయితే గుర్రపు రైలు కార్‌తో పోలిస్తే ఈ ఇంజిన్లు కాస్త మెరుగైన పని తీరు కనబర్చాయి.

తరువాతి కాలంలో ఈ రైలు ప్రాజెక్టును దక్షిణ పసిఫిక్‌ రైలు రోడ్ కంపెనీ తన ఆధీనంలోకి తీసుకుంది. తేలికపాటి రైళ్లను తీసేసి.. దృఢమైన రైళ్లను ప్రవేశపెట్టింది. దాంతో ప్రయాణికులు దిగి నెట్టాల్సిన అవసరం ఇక లేకుండా పోయింది. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని