Meteorite bag : ఉల్క శకలాలతో హ్యాండ్‌ బ్యాగ్‌.. బరువెంతో తెలుసా..!

రొటీన్‌కు భిన్నంగా ఉండాలని ఓ ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ కంపెనీ సరికొత్త ప్రయోగం చేసింది. ఏకంగా ఉల్క శకలాలతో హ్యాండ్‌ బ్యాగును రూపొందించి విక్రయానికి పెట్టింది.

Updated : 27 Mar 2023 12:15 IST

(Image : coperniparis)

ఫ్రాన్స్‌(France)కు చెందిన లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ‘కోపర్నీ’ ఓ వినూత్న హ్యాండ్ బ్యాగు(Hand bag)ను అమ్మకానికి పెట్టింది. దానిలో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఆ బ్యాగ్‌(Bag) ఉల్క శకలాల(Meteorite)తో తయారు చేశారు మరి. కొన్ని వేల ఏళ్ల క్రితం భూమిపై పడ్డ ఉల్క(meteorites)ను తీసుకొని నిపుణుల సాయంతో ఆ హ్యాండ్ బ్యాగు(Hand bag)ను మలిచారు. ఒక్కో దాని ఖరీదు 43వేల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ(Indian currency)లో సుమారు రూ.35లక్షలు విలువ చేస్తుందన్నమాట.

కోపర్నీ ఇటీవల ఫాల్‌|వింటర్‌ ఫ్యాషన్‌(Fashion) కలెక్షన్‌ను తీసుకొచ్చింది. అందులో పురావస్తుశాస్త్రాన్ని మిళితం చేస్తూ ఓ ప్రత్యేకమైన బ్యాగ్‌(Bag)ను ప్రవేశపెట్టింది. దాని డిజైన్‌లో శాస్త్రీయత, ఆదిమ కళ ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకొంది. ఈ కంపెనీ ఎక్కువగా విక్రయించే సాధారణ స్వైప్‌ బ్యాగ్‌ ఆకృతిలోనే చిన్న ఉల్క(Meteorite)తో స్వైప్‌ బ్యాగ్‌ను రూపొందించింది. అయితే ఆ బ్యాగ్‌ చూడ్డానికి సున్నితంగా కాకుండా గరుకుగా కన్పిస్తోంది.ఉల్క శకలాలు చెక్కి మలిచినందువల్ల అలా ఉందని కంపెనీ వెల్లడించింది. దానికి ‘మిని మెటియోరైట్ స్వైప్‌ బ్యాగ్‌’ అని నామకరణం చేసింది. ప్రస్తుతం బ్యాగ్‌ ఆకృతి ఎలా ఉంటుందో కంపెనీ ఆన్‌లైన్‌(Online) స్టోర్‌లో కొన్ని నమూనా చిత్రాలు ఉంచింది. బ్యాగ్ తయారీలో ఉపయోగించిన ఉల్క శకలాలు సుమారు 55వేల సంవత్సరాల క్రితం భూమిని చేరినట్లు సమాచారం.

ఇక బ్యాగ్‌ కొలతల విషయానికి వస్తే 9×12×23 సెంటీమీటర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. బరువు సుమారుగా 2 కేజీలు ఉండనుంది. ఖాళీ సంచి మాత్రమే ఆ బరువుంటే.. అందులో ఏవైనా వస్తువులు పెట్టుకొని మోయగలమా అనేది కొనుక్కునే వారు ఆలోచించాల్సిన విషయం. అన్నీ ఒకే ఉల్కతో కాకుండా.. భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డ ఉల్కలను సేకరించి బ్యాగులను తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బ్యాగును ఒకసారి కొనుగోలు చేస్తే మళ్లీ రిటర్న్‌ తీసుకోమని కంపెనీ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిమాణం కంటే పెద్దది కొనుగోలు చేయాలంటే ఖరీదు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 21 నుంచి ఆర్డర్లు తీసుకుంటున్న కంపెనీ ఏప్రిల్ 5న వాటిని డెలివరీ చేయనుంది. సాధారణంగా ఒక్కో బ్యాగు డెలివరీకి 6 వారాలు పడుతుందని సదరు కంపెనీ పేర్కొంది.

ఉల్క అంటే ఏంటి?

రాత్రి వేళ మనం ఆకాశంలోకి చూస్తున్నప్పుడు కాంతిపుంజాలు నేలరాలిన దృశ్యాలు కన్పిస్తాయి. నిజానికి అవి నక్షత్రాలు కావు. అంతరిక్షంలో నుంచి భూమిపై పడే ఉల్కలు. గ్రహాలు ఏర్పడిన తొలిరోజుల్లో గ్రహాల ఆకర్షణకు లోనుకాని కొన్ని శిలలు, ధూళికణాలు గ్రహాలతోపాటు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే అంగారక గ్రహం నుంచి, చంద్రుని నుంచి వెలువడిన ధూళి కణాలు కూడా అంతరిక్షంలో ఉంటాయి. అంతరిక్షంలో తిరిగే వీటిని 'మెటియోరైడ్స్‌' అంటారు. ఇవి చూడ్డానికి రాళ్లలాగే కన్పించినా భూమిపై ఉండేరాళ్లతో పోలిస్తే కాస్త విభిన్నంగా ఖనిజాలతో కూడి ఉంటాయి. చిన్న ఇసుక రేణువు మొదలుకొని పెద్ద బండరాయి వరకు వీటి ఆకృతి ఉంటుంది. భూమ్యాకర్షణ వల్ల వందల ఏళ్లుగా ఉల్కలు అంతరిక్షం నుంచి నేలపై పడుతున్నా కొన్నింటిని మాత్రమే మానవులు సేకరించగలిగారు.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని