The Rubberboy : బాబోయ్‌ రబ్బరు బోయ్‌.. పెట్టెలో పట్టేస్తాడట!

తనకు సోకిన అరుదైన వ్యాధిని ఓ అవకాశంగా మలుచుకున్నాడు డేనియల్‌ బ్రౌనింగ్‌ స్మిత్ (Daniel Browning Smith). శరీరాన్ని వంపులు తిప్పుతూ ఏకంగా 7 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ (Guinness World Records) సంపాదించాడు.

Published : 18 Apr 2023 14:46 IST

అమెరికాకు (America) చెందిన డేనియల్‌ బ్రౌనింగ్‌ స్మిత్ (Daniel Browning Smith) ‘ది రబ్బర్‌ బోయ్‌’గా (The Rubberboy) పేరు గడించాడు. ఎందుకంటే అతడు తన శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు. అంతే కాదు శరీరం మొత్తాన్ని మడత పెట్టేసుకొని ఓ పెట్టెలోకి వెళ్లిపోగలడు. అంతటి నైపుణ్యంతో రాణిస్తున్నాడు డేనియల్. ఈ గుర్తింపుతో అతడికి పలు ప్రకటనలు, సినిమాలు, టీవీ షోల్లో నటించే అవకాశాలు దక్కాయి.

ఎవరీ డేనియల్‌?

డేనియల్‌ అమెరికాలోని మెరిడియన్‌లో జన్మించాడు. అతనికి ఒక సోదరి, సోదరుడు. చిన్న పిల్లవాడిగా ఉన్న సమయంలోనే డేనియల్‌ బాగా ఎత్తులో నుంచి నేలపై దూకేవాడు. అయినా అతడికి ఏమీ అయ్యేది కాదు. దాంతో ఇంట్లో వాళ్లంతా నోరెళ్లబెట్టేవారు. తమ పిల్లవాడికి ‘కంటోర్షనిస్టు’గా మంచి భవిష్యత్తు ఉందని అతడి తల్లిదండ్రులు భావించారు. అంటే ఒక రకమైన సర్కస్‌ ఫీట్లు చేసే వ్యక్తి. యువకుడిగా ఎదిగిన తరువాత డేనియల్‌ వీధుల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడు. దాంతో ఓ సర్కస్‌ షోలో అవకాశం వచ్చింది. శిక్షణలో మరింత రాటుదేలేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో స్కూల్‌లోని మాస్టర్‌ లూయీ వద్ద చేరాడు. కొద్ది రోజుల తర్వాత గురువే ఆశ్చర్యపోయే రీతిలో డేనియల్‌ తన శరీరాన్ని వంపులు తిప్పేవాడు. అప్పటికే చాలా మంది ‘కంటోర్షనిస్టు’లు ఫీట్లు చేస్తున్నప్పటికీ డేనియల్ శైలి ప్రత్యేకంగా ఉండేది. వేగంగా.. భిన్నంగా కదలడంలో అతడు ప్రత్యేక ముద్ర కనబర్చేవాడు.

ఏడు గిన్నిస్‌ రికార్డులు

డేనియల్‌ వైవిధ్యమైన శైలి చూసి గిన్నిస్‌ సంస్థ అతడిని 1999లోనే ‘మోస్ట్‌ కంటోర్షనిస్ట్‌ ఇన్‌ ఎ బాక్స్‌’గా గుర్తింపునిచ్చింది. ఆ సాహసం ఏంటంటే తన మొండాన్ని 180 డిగ్రీల కోణంలో వంచి... చేతులు, కాళ్లను మడిచి ఒక బాక్సులో ఒదిగిపోయాడు. 2007లో అతడికి ‘మోస్ట్‌ ఫ్లెక్సిబుల్‌ మ్యాన్‌’ అనే మరో గిన్నిస్‌ బుక్‌ అవార్డు దక్కింది. ఇలా మొత్తం 7 గిన్నిస్‌ రికార్డులు అతడిని వరించాయి. ఆ తరువాత నుంచి డేనియల్‌కు పలు సినిమాలు, టీవీ షోల్లో నటించే అవకాశాలు వచ్చాయి. బయట కూడా పలు కళాశాలలు, కచేరీలకు వెళ్లి ప్రదర్శనలిచ్చేవాడు. దాంతో అతడికి ‘ది రబ్బరు బోయ్‌’ అనే అరుదైన గుర్తింపు లభించింది.

లోపమే వరం

డేనియల్ తన శరీరాన్ని పలు రకాలుగా వంచడానికి కారణం ‘ఎలస్‌ డన్లోస్‌ సిండ్రోమ్‌’. జన్యుపరమైన లోపం కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ‘ఎలస్‌ డన్లోస్‌ సిండ్రోమ్‌’లో 13 రకాలు ఉన్నాయట. ఈ వ్యాధి బారిన పడిన వారి శరీరంలోని కీళ్లు ఎన్ని వంపులైనా తిరుగుతాయి. చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల వారికి చిన్నపాటి దెబ్బ తగిలినా గాయం పెద్దగానే అవుతుంది. ఈ వ్యాధి సోకిన చాలా మంది తీవ్రమైన కండరాలు, ఎముకల నొప్పులతో బాధపడుతుంటారు. అదృష్టవశాత్తూ డేనియల్‌కు ఓ మోస్తరు నొప్పి మాత్రమే ఉంటోందట. అందుకే తాను ఎంచుకున్న రంగంలో అవలీలగా రాణించగలుగుతున్నాడని వైద్య నిపుణులు చెబుతున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు