Germany : జర్మనీలో భారీ ఉప్పు కొండ.. దాంతో 114 ఫుట్‌ బాల్‌ మైదానాలను కప్పేయొచ్చు!

సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు చాలా దేశాల్లో కన్పిస్తాయి. జర్మనీలో ఓ చోట ఉప్పును పోగు చేస్తూ కృత్రిమంగా ఓ భారీ కొండను సృష్టించారు.

Published : 15 Mar 2023 12:12 IST

మానవులు తమ అవసరాల కోసం భూమి లోపల దొరికే ఖనిజ లవణాలను వెలికి తీస్తుంటారు. అలా తీసిన ముడి సరకులో ఇతర పదార్థాలు కూడా కలిసుంటాయి. వాటిని శుద్ధి చేసి వేరు చేయాల్సి ఉంటుంది. జర్మనీ(Germany)లో కొన్ని వేల టన్నుల ఉప్పు(Salt)ను వేరు చేసి కొండగుట్టలా మార్చారు. ఆ విచిత్రం ఏంటో చదివేయండి.

సెంట్రల్‌ జర్మనీ(Germany)లోని హెర్రింజన్‌ పట్టణంలో భారీ ఉప్పు(Salt) కొండ దర్శనమిస్తుంది. దీన్ని ప్రపంచం(World)లోనే అతి పెద్ద కృత్రిమ ఉప్పు పర్వతంగా గుర్తించారు. 1976లో ఈ ఉప్పు పర్వతం చిన్న కుప్పగా మొదలైంది. ఆ సమయంలో హెస్సెన్‌ పట్టణం చుట్టూ ఉన్న గనులను తవ్వి పొటాష్‌ సాల్ట్‌ను వెలికితీసేవారు. ఆ మిశ్రమాన్ని సబ్బులు, గ్లాసుల తయారీలో ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, సింథటిక్‌ రబ్బరు, కొన్ని రకాల ఔషధాల తయారీలో విస్తృతంగా వాడుతున్నారు. దాంతో ఈ ప్రాంతంలో పొటాష్‌ సాల్ట్‌ తవ్వకాలు మరింతగా పెరిగాయి. అయితే పొటాష్‌ సాల్ట్‌ తవ్వితే ముడిసరకుగా సోడియం క్లోరైడ్‌(ఉప్పు) వస్తుంది. అందువల్ల తవ్విన ఉప్పును ఒక చోట కుప్పగా పోసేవారు. అలా స్థానిక కంపెనీ ఇప్పటి వరకు 9 గనుల్లో జరిపిన తవ్వకాల మూలంగా కొన్ని మైళ్ల దూరం వరకు ఉప్పు పోగైంది. ఆ ఉప్పు పర్వతాన్ని స్థానికులు మోంటెకాలి, కాలిమంజారో ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు.

మోంటెకాలి 2017 సంవత్సరం లెక్కల ప్రకారం.. సముద్ర మట్టానికి 1740 అడుగుల ఎత్తుకు చేరింది. దాదాపు 100 హెక్టార్లలో ఇది విస్తరించింది. హెర్రింజన్‌లో ఎక్కడ నుంచి చూసినా ఈ పర్వతం కన్పిస్తుంది. దాంతో ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షించింది. వారు డబ్బులిచ్చి మరీ ఈ ఉప్పు శిఖరాన్ని ఎక్కుతున్నారంటే అక్కడ ఉన్న డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. దీనిని ఎక్కేందుకు దాదాపు 15 నిమిషాలు సమయం పడుతుంది. ఈ ఉప్పు పర్వతం ఎక్కడం వల్ల వెర్రా వ్యాలీ, థురింజియాన్‌ అటవీ ప్రాంతం మొత్తం చూడొచ్చనేది పర్యాటకుల అభిప్రాయం.

ఇప్పటి వరకు మౌంట్‌ కాలెలో ఎంత మేర ఉప్పు పోగయిందో లెక్కలు చెప్పడం కష్టం. దాదాపు 236 మిలియన్‌ టన్నుల ఉప్పు ఇక్కడ ఉంటుందని ఒక అంచనా. ఆ ఉప్పుతో  114 ఫుట్‌ బాల్‌ మైదానాలను కప్పేయొచ్చు. ఏటా ఉప్పు పర్వతం పెరుగుతూనే ఉంది తప్ప తరగట్లేదు. ఈ ఉప్పు పర్వతం కారణంగా పర్యావరణ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీని కారణంగా చుట్టుపక్కలి ప్రాంతాల్లోని మంచి నీరు కూడా ఉప్పగా మారుతోంది. 60-100 వరకు సంచరించే వివిధ రకాల కీటకాలు మాయమవుతున్నాయి. ప్రస్తుతం మూడు రకాలు మాత్రమే కన్పిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మొత్తంగా పర్యావరణ విధ్వంసానికి దారి తీయొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో పొటాష్‌ పరిశ్రమ కారణంగానే పలువురు జీవనం సాగిస్తున్నారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఆ పరిశ్రమను మూసేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. అందుకే కంపెనీకి కావాల్సిన అనుమతులు మరి కొన్ని సంవత్సరాలు పొడిగించారు. అందువల్ల ఈ పర్వతం ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇప్పట్లో తరిగే అవకాశమే లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు