Putrajaya Roundabout : అది ప్రపంచంలోనే అతి పెద్ద కూడలి.. ఎన్ని రోడ్లు కలుస్తున్నాయో తెలుసా!

ప్రపంచంలోనే (World)అతి పెద్ద కూడలి మలేసియాలో (Malaysia)ఉంది. దాని ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

Updated : 29 Jun 2023 15:32 IST

(Image : Tourism Malaysia)

మలేసియా (Malaysia) పరిపాలనా రాజధాని పుత్రజయలో ప్రపంచంలోనే (World) అతి పెద్ద కూడలి ఉంది. 3.4 కిలోమీటర్ల పొడవున్న ఈ కూడలి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో (Guinness World Records) స్థానం సంపాదించింది. కూడలి అనగానే మూడు లేదా నాలుగు రోడ్లు కలుస్తాయి. మహా నగరాల్లో మహా అయితే ఏడు దారులు వరకు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఏకంగా 15 రోడ్లు కలుస్తున్నాయి.

మలేసియా పరిపాలనా రాజధాని పుత్రజయలో పర్సిరన్‌ సుల్తాన్ సలావుద్దీన్ అబ్దుల్ అజీజ్‌ షా కూడలి దర్శనమిస్తుంది. దీనిని పుత్రజయ కూడలి అని కూడా పిలుస్తుంటారు. మలేసియాకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించే ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. ప్రఖ్యాత మలేసియన్‌ ఆర్కిటెక్ట్‌ హిజ్జాస్‌ కస్తూరి దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఆధునిక ఇంజినీరింగ్‌ అద్భుతమని చెప్పవచ్చు. 2003లో ఈ కూడలి ప్రారంభమైంది. ఇస్తానా మేలావటి చుట్టూ దీన్ని నిర్మించారు. ఇస్తానా మేలావటి  రాజు యాంగ్ డి-పెర్టువాన్‌ ఆగోంగ్‌ నివాసం ఉండే రెండో ప్యాలెస్‌. పుత్రజయలోని చాలా పర్యాటక ప్రాంతాలకు ఈ కూడలి మీదుగానే వెళ్లొచ్చు. ప్రధాన మంత్రి కార్యాలయం, అతి పెద్ద మసీదుకు దారి ఇటు నుంచే ఉంటుంది.

ఈ కూడలి పై నుంచి చూస్తే చక్కగా.. దీర్ఘవృత్తాకారంలో కన్పిస్తుంది. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలను ఒక వైపు మాత్రమే అనుమతించడం మరో విచిత్రమైన విషయం. ట్రాఫిక్‌ను ఒక దిశలోనే మళ్లిస్తున్నప్పటికీ ఈ కూడలి నిత్యం రద్దీగానే కన్పిస్తుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని