Karnataka : రాజకీయాల్లో చందనసీమ తారాజువ్వలు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) భాజపాలో (BJP) చేరతారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. దాంతో మీడియా (Media) ముందుకు వచ్చిన సుదీప్ తనకు గాడ్ ఫాదర్‌లాంటి సీఎం బసవరాజ్ బొమ్మై (Basavaraj bommai) కోసం ప్రచారం మాత్రమే చేస్తానని, పోటీ చేయబోనని స్పష్టం చేశారు.
దక్షిణాదిలో సినీ, రాజకీయ (politics) రంగాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగునాట ఎన్టీఆర్ (NTR), తమిళనాట జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి సినీ రంగంలో పేరు సంపాదించి రాజకీయాల్లోకి అడుగుపెట్టి పెను సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రి (CM) పీఠంపై తమదైన ముద్ర వేసి సత్తా చూపించారు. ఇటీవలే కన్నడ (Karnataka) నాట అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తాజాగా కన్నడ స్టార్ సుదీప్ (Sudeep) ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. దాన్ని ఖండించిన ఆయన సీఎం బసవరాజ్ బొమ్మై కోసం మాత్రమే భాజపాకు ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలపై అక్కడి నటులు ఎలాంటి ముద్రవేశారో చదివేయండి.
అగ్రనటుడు అంబరీశ్
దివంగత కన్నడ నటుడు అంబరీశ్ దాదాపు రెండొందలకు పైగా చిత్రాల్లో నటించారు. రాజ్‌కుమార్, విష్ణువర్దన్‌లతో సమానమైన గ్రాఫ్ ఈయనకు ఉండేది. దాంతో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ౧౯౯౪లో కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత రెండేళ్లకు జనతాదళ్ తీర్థం పుచ్చుకొని ౧౯౯౮లో పోటీ చేశారు. మండ్య స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. ౧౯౯౯లో మళ్లీ సొంతగూటికి చేరి ఎంపీగా గెలుపొందారు. కేంద్ర మంత్రి పదవి రావడంతో ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా కొనసాగారు. కావేరీ జల వివాదంలో అన్యాయం జరిగిందని విమర్శిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ౨౦౦౯ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగిన అంబరీశ్.. హెచ్‌డీ కుమారస్వామి, ఎస్.ఎం కృష్ణ, కేఆర్. పేటే కృష్ణ వంటి ప్రముఖులను గెలిపించడం కోసం ప్రచారం చేశారు.
మండ్య ఎంపీగా సుమలత
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్రనటి సుమలత. ౨౨౦కి పైగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. సినీ కెరీర్‌లో స్వీట్‌స్పాట్‌కు చేరుకొన్నాక అంబరీశ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత ౨౦౧౯ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుమలత విజయం కోసం కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శన్, రాక్‌లైన్ వెంకటేశ్, దొడ్డన్న వంటి సినీ ప్రముఖులు కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తానని ఇటీవల సుమలత ప్రకటించారు.
రాజకీయ వారసుడు నిఖిల్
౨౦౧౬లో విడుదలైన ‘జాగ్వార్’ చిత్రంతో కన్నడ, తెలుగు ప్రేక్షకులను పలకరించారు నిఖిల్ కుమారస్వామి. ఇప్పటి వరకు ఐదు చిత్రాల్లో నటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వారసుడిగా ఈయన రాజకీయ రంగప్రవేశం చేశారు. ౨౦౧౯ లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ టికెట్‌పై మండ్య స్థానం నుంచి ఎంపీగా పోటీచేశారు. కానీ, ఈ ఎన్నికల్లో నటి సుమలత చేతిలో నిఖిల్‌కు ఓటమి తప్పలేదు.
దివ్య స్పందన అలియాస్ రమ్య
చందన సీమలో అగ్ర శ్రేణి తారగా గుర్తింపు తెచ్చుకున్నారు రమ్య. ఆమె నటనకుగానూ రెండు ఫిల్మ్‌ఫేర్, ఉదయ, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు దక్కాయి. ఈమె తల్లి రంజిత కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేశారు. దాంతో రమ్య కూడా రాజకీయాలపై ఆసక్తితో ౨౦౧౨లో యూత్ కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత మండ్య లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ౨౦౧౪లో మరోసారి పోటీ చేసి సీఎస్ పుట్టరాజు చేతిలో కేవలం ౫,౫౦౦ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. రమ్య భాజపాలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్‌ను నడిపిస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్
తన జీవితంలో సినిమా, రాజకీయాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ సాగిపోతున్నారు జగ్గేశ్. కెరీర్ తొలినాళ్లలో చిన్న పాత్రల్లో నటించారు. ఆ తరువాత విలన్‌గా అవకాశాలు వచ్చాయి. తనదైన శైలిలో హాస్యప్రతిభను చాటుతూ ఒక పెద్ద స్టార్‌గా ఎదిగారు. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీగా, కేఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా కొనసాగారు. కొన్నేళ్లపాటు హస్తం పార్టీలో ఉన్న ఆయన ఆ తర్వాత భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ౨౦౨౨ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
యాక్షన్ హీరో కుమార్ బంగారప్ప
౮0-౯౦వ దశకంలో యాక్షన్ హీరోగా రాణించారు కుమార్ బంగారప్ప. నాటకీయ పరిణామాల మధ్య రాజకీయాల్లో ప్రవేశించిన ఈయన ౧౯౯౬లో సొరబ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో అనేక పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి ఈయన తండ్రి ఎస్.బంగారప్ప విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి దక్కక పోవడంతో ఎస్.బంగారప్ప సొంతంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ౧౯౯౯లో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో హస్తం గుర్తుపై బంగారప్ప రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ౨౦౦౪ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచి ఎస్‌ఎం కృష్ణ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
సూపర్‌స్టార్ల చిత్రాల్లో శ్రుతి
చందనసీమపై తన దైన ముద్ర వేసిన నటీమణుల్లో శ్రుతి ఒకరు. రెండు దశాబ్దాలపాటు ఆమె వెండితెరపై వెలుగు వెలిగారు. ఈ క్రమంలో కన్నడ సూపర్ స్టార్లందరితో ఆమె కలిసి పని చేశారు. ౨౦౦౮లో ఆమె కాషాయ కండువా కప్పుకొని భాజపాలో చేరారు. దాంతో ఆమెకు మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవి దక్కింది. తర్వాతి కాలంలో శ్రుతి కర్ణాటక జనతాపక్ష పార్టీలో చేరారు. ౨౦౧౪లో ఆ పార్టీని భాజపాలో విలీనం చేశారు. ప్రస్తుతం ఈమె కర్ణాటక కేడర్ విమెన్స్ వింగ్‌లో ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
‘మాల్గుడి డేస్’ డాక్టర్ అనంత్‌నాగ్ నగర్కట్టే
దాదాపు ౩౦౦ చిత్రాలో నటించిన డాక్టర్ అనంత్‌నాగ్ నగర్కట్టే నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’లోనూ ఈయన నటించారు. అనంత్ నటనకు ఆరు ఫిల్మ్‌ఫేర్ సహా ఎన్నో అవార్డులు వరించాయి. రాజకీయాల్లో ప్రవేశించి జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణపై కూడా జేడీఎస్ అభ్యర్థిగా ఓ సారి పోటీ చేశారు. ఇటీవలి కాలంలో ఈయన భాజపాలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్
నటుడిగా రాణించిన బీసీ పాటిల్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. హీరేకెరూర్ అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సినిమాల్లోకి రాక ముందు ఈయన పోలీసు శాఖలో పనిచేశారు.
శశి కుమార్
నటుడిగా రాణిస్తున్న సమయంలోనే శశికుమార్ ఓ ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయనకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. రాజకీయాల్లోకి ప్రవేశించి జనతాదళ్ (యు)లో చేరారు. ౧౯౯౯లో చిత్రదుర్గ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.
తార
అనురాధగా పుట్టి.. సినిమాల్లో ‘తార’గా రాణించారీమె. సహాయక పాత్రల ద్వారా తార కన్నడ సీమలో అభిమానుల్ని సంపాదించుకొన్నారు. ‘హసీనా’లో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తరువాత కమల దళంలో చేరిన ఆమెకు ౨౦౧౨లో కర్ణాటక చలనచిత్ర అకాడమీ అధ్యక్షురాలి హోదా దక్కింది. ఏడాది తర్వాత ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఉమా శ్రీ
సహాయక పాత్రల ద్వారా కన్నడ సినిమాల్లో రాణించిన మరో నటి ఉమా శ్రీ. ఎక్కువగా ఈమె హాస్యపాత్రల్లో నటించి నవ్వులు పూయించింది. రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్‌లో చేరి.. ౨౦౧౩ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అధిష్ఠానం గుర్తింపుతో సిద్ధరామయ్య మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగింది.
వీరు మాత్రమే కాకుండా నరేంద్రబాబు, మాళవిక అవినాశ్, భావన వంటి నటులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తరహాలో తమ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి నటులు కన్నడ సీమలో ఇంతవరకు లేరనే చెప్పవచ్చు. సినీ కెరీర్ గ్రాఫ్ టాప్‌లో ఉన్న సమయంలో దిగ్గజ నటుడు రాజ్‌కుమార్‌కు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం దక్కింది. జేహెచ్ పటేల్, జార్జ్ ఫెర్నాండెజ్‌లు ఆయనను కలిసి 1978 ఎన్నికల్లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయమని కోరారు. కానీ, ఆయనకు తన సినీ గ్లామర్‌ను రాజకీయాలకు వినియోగించుకోవడం ఇష్టం ఉండేది కాదట. అందుకే ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై