Twitter vs Threads: ట్విటర్‌కు కాస్త ఇబ్బందే.. పోటీ యాప్‌లు పెరుగుతున్నాయ్‌!

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు (Twitter) పోటీగా మెటా (Meta) ‘థ్రెడ్స్‌’ను (Threads) తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో టెక్‌ కంపెనీల మధ్య పోటీ ఎలా సాగుతోందో తెలుసుకోండి. 

Updated : 10 Jul 2023 14:53 IST

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon musk) ట్విటర్‌ను (Twitter) కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ సామాజిక మాధ్యమంలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. చాలా మంది సెలబ్రిటీల బ్లూ టిక్‌ తొలగించాడు. కొంత రుసుం వసూలు చేసి సాధారణ యూజర్లకు కూడా బ్లూ టిక్‌ ఇచ్చేశాడు. కొద్ది రోజుల క్రితం పోస్టులు చేయడానికి, చూడటానికి కూడా పరిమితి పెట్టేశాడు. ఈ చర్యలతో ట్విటర్‌ యూజర్లు మస్క్‌పై గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో మెటా (Meta) కంపెనీ ‘థ్రెడ్స్‌’ను (Threads) తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయి? ఏ విధంగా దూసుకెళ్తోంది? ఇలాంటి ఇతర యాప్‌లకు కూడా ఆదరణ పెరుగుతోందా?తదితర విషయాలు పరిశీలించండి.

ఏంటీ ‘థ్రెడ్స్‌’

ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ల మాతృసంస్థ మెటా ఈ నెల 5న ‘థ్రెడ్స్‌’ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్‌ ఆధారిత పబ్లిక్‌ సంభాషణలు జరిపే యాప్‌. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ వెనుకున్న సాంకేతిక బృందమే దీనిని అభివృద్ధి చేసింది. సుమారు 100 దేశాల్లోని ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఈ యాప్‌ను వినియోగించుకునే వీలుంది. దాంతో రెండ్రోజుల్లోనే ఏడు కోట్ల మంది ఈ యాప్‌లో ఖాతా తెరిచారు. ఈ అనూహ్య స్పందన చూసి మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సైతం ఆశ్చర్యపోయాడట.

ఎలా పని చేస్తుంది?

‘థ్రెడ్స్’ అనేది యూజర్ల ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో భాగం. అందులో నుంచే వారు ఈ ఖాతా తెరవచ్చు. దాంతో అప్పటికే వాడుతున్న ఖాతా పేరు, అనుసరిస్తున్న ఖాతాలు కొత్త యాప్‌లోకి కూడా బదిలీ అవుతాయి. బ్లాకింగ్‌, పరిమిత వినియోగదారులు, పదాలను కనిపించకుండా చేయడం వంటి ఫీచర్లు ఈ రెండు యాప్‌లలోనూ ఉన్నాయి. ఒక వేళ యూజర్లకు ‘థ్రెడ్స్‌’ యాప్‌ నచ్చకపోతే వారి ఖాతాను డీ యాక్టివేట్‌ చేసుకోవచ్చు కానీ, డిలీట్‌ చేయలేరు. పొరపాటును ఈ ఖాతాను డిలీట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా కూడా పోతుందట. ‘థ్రెడ్స్‌’ నుంచి గోప్యంగా ఇతరులకు సందేశం పంపించే వీలు లేదు.

డేటా మొత్తం సేకరిస్తోంది

గూగుల్ ప్లే స్టోర్‌ ప్రకారం.. థ్రెడ్స్‌ యూజర్ల ప్రాంతం, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, సందేశాలు, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌, డాక్యుమెంట్స్‌, ముఖ్యమైన రోజులు తదితర డేటాను సేకరిస్తుంది. అంతేకాకుండా చిరునామా, ఫోన్‌ నంబర్‌, రాజకీయ, మత పరమైన ఆసక్తులు, లైంగిక ధోరణి గురించి కూడా తెలుసుకుంటుందట.

ట్విటర్‌ సారూప్యతలు

థ్రెడ్స్‌లోని యూజర్‌ ఇంటర్‌ఫేస్‌, బేసిక్‌ ఫీచర్లన్నీ దాదాపు ట్విటర్‌ను పోలి ఉన్నాయి. ఇందులో పోస్ట్‌, కామెంట్‌, రిప్లై వంటి కార్యకలాపాలు చేయొచ్చు. ఒక పోస్టును ఐదు వందల అక్షరాలకు పరిమితం చేశారు. లింక్‌లు, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను కూడా పోస్ట్‌ చేసే సదుపాయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చాలా మంది ట్విటర్‌ను వినియోగిస్తున్నారు. ఏదైనా హాట్‌ టాపిక్‌ గురించి కీవర్డ్‌ను టైప్‌ చేస్తే ఆ సమాచారం వెంటనే తెరపై ప్రత్యక్షమవుతుంది. కానీ, థ్రెడ్స్‌లో అలాంటి ఫీచర్‌ లేదు. రోజువారీ సంఘటనలను తెలుసుకునే ‘ట్రెండ్స్‌’ ఫీచర్‌ను కూడా కొత్త యాప్‌లో ప్రవేశపెట్టలేదు. అయితే ఇందులో ఇప్పటి దాకా ప్రకటనలు కనిపించలేదు.

మస్క్‌ స్పందన..

‘థ్రెడ్స్‌’ రాబోతోందన్న వార్తల గురించి ఎలాన్‌ మస్క్‌ మొదట్లో పొడిపొడిగా ప్రతిస్పందించారు. అయితే ‘థ్రెడ్స్‌’ను ట్విటర్‌లాగే రూపొందించారని తెలిసి తమ న్యాయవాది అలెక్స్‌ స్పైరోతో జుకర్‌బర్గ్‌కు ఓ లేఖ పంపించారు. తమ సంస్థలో పనిచేసిన పాత ఉద్యోగులను మెటా నియమించుకుని వాణిజ్య రహస్యాలు, ఇతర మేధోపరమైన అంశాలను తెలుసుకుందని ఆ లేఖలో ఆరోపించారు. ట్విటర్‌ వాణిజ్య రహస్యాలను, ఇతర రహస్య సమాచారాన్ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు చేపట్టాలని.. లేదంటే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ‘పోటీ మంచిదే. కానీ, మోసం సరైన పద్ధతి కాదు’ అని ఎలాన్‌ మస్క్‌ కూడా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలను మెటా ప్రతినిధి ఆండీ స్టోన్‌ ఖండించారు. థ్రెడ్స్‌ ఇంజినీరింగ్‌ బృందంలో పని చేస్తున్న వారెవరూ కూడా గతంలో ట్విటర్‌లో పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ఐరోపాలో ఆలస్యం

విడుదలైన తొలి రోజే దాదాపు 100 దేశాల్లోకి అడుగుపెట్టిన ‘థ్రెడ్స్‌’కు ఐరోపాలో మాత్రం అడ్డుకట్ట పడింది. రెగ్యులేటరీ సమస్యల కారణంగా మెటా దీన్ని ప్రారంభించలేకపోయింది.  కొంచెం ఆలస్యమైనా ఈయూ చట్టాలకు తగినట్లుగా కొన్ని మార్పులు చేసి త్వరలోనే ‘థ్రెడ్స్‌’ను ప్రవేశపెడతామని ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడం మోస్సేరి తెలిపారు. ఐరోపాలో మే నెలలో ‘ఈయూ డిజిటల్‌ మార్కెట్ చట్టం’ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఆన్‌లైన్‌ వేదికలు డేటాను న్యాయబద్ధంగా వినియోగించుకోవాలి. ప్రత్యర్థులకు నష్టం కలిగించకూడదు. టార్గెట్‌ ప్రకటనల కోసం యూజర్ల సమ్మతి తీసుకోవాలి.

మరిన్ని పోటీ యాప్‌లు 

స్పిల్ : దీన్ని ట్విటర్‌ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. ఇందులో దృశ్య సంభాషణలు చేయొచ్చు. యూజర్లు గిఫ్స్‌, మీమ్స్‌, వీడియోలను పోస్టు చేసుకోవచ్చు. ట్విటర్‌లో పోస్టుల రీడ్‌కు మస్క్‌ పరిమితి విధించిన నేపథ్యంలో వేల కొద్దీ కొత్త యూజర్లు తమ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చారని స్పిల్‌ సీఈవో టొర్రెల్‌ తెలిపారు.

టీ2 : ఈ సామాజిక మాధ్యమాన్ని కూడా ట్విటర్‌ మాజీ ఉద్యోగులే అభివృద్ధి చేశారు. ఇందులో 280 అక్షరాలతో పోస్టులు చేయొచ్చు.

బ్లూ స్కై : ఈ సామాజిక మాధ్యమం సృష్టి వెనుక ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ ఉన్నాడు. డీ సెంట్రలైజ్డ్‌ నెట్‌వర్క్‌ ఇందులోని ప్రత్యేకత.

మాస్టోడాన్‌ : ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేయక ముందు నుంచే మాస్టోడాన్‌ ఉంది. అయితే మస్క్‌ నిర్ణయాల కారణంగా ఈ యాప్‌నకు ఆదరణ పెరిగింది. ఇందులో ప్రకటనలు కనిపించవు.

కోహోస్ట్‌ : 2022 ప్రారంభమైన ఈ నెట్‌వర్క్‌లోనూ దాదాపు ట్విటర్‌లో ఉన్న అన్ని ఫీచర్లున్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని